Online Puja Services

ఈ దేవుడికి ఉత్తరాలు రాయొచ్చు

3.131.38.100

ఈ దేవుడికి ఉత్తరాలు రాయొచ్చు . చిరునామా కావాలా ?
లక్ష్మీ రమణ 

దేవతలకి మంత్రాలు , తంత్రాలతో చెబితే కానీ మన బాధలు అర్థం కావా ? వారి కరుణకు ఒక ఫోన్ కాల్ చేసో , ఏదైనా ఏ- మెయిల్ పంపించే సౌకర్యమో ఉంటె, భలే బాగుంటుంది . అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా ! మరీ ఈ మెయిల్ కాదుకానీ, ఉత్తరం అయితే పంపించొచ్చు. కానీ, మీకువచ్చిన భాషకాకుండా, రాజస్థానీ హిందీ అయితే మరీ మంచిది .  ఎందుకలా అంటారేమో , అక్కడే ఉంది తిరకాసంతా మరి !

మీరు మల్లన్న సినిమా చూశారా ? సియాన్ విక్రమ్ , శ్రీయా నటించిన సినిమా ! అందులో మల్లన్న గుడికి వచ్చిన ఉత్తరాలని చదివి, వాళ్ళ కోరికలు తీర్చేందుకు విక్రమ్ ధనసహాయాన్ని, ఇతర సహకారాలనీ అందిస్తుంటాడు . కానీ ఈ కథ నిజంగా ఈ రాజస్థాన్ వినాయకుడిదేనేమో అనిపిస్తుంది. ఈ వినాయకుడి దగ్గరికి మీరు స్వయంగా వెళ్లినా, వెళ్ళక పోయినా, ఎంచక్కా ఉత్తరం రాసి, మీ కోరికని, మీ బాధని , ఆర్తిని విన్నవించుకోవచ్చు. ఆయనే స్వయంగా ఆ ఉత్తరాలలో ఉన్న సమస్యలు పురోహితుల ద్వారా విని వాటికి పరిష్కారాలు చూపిస్తారని, అనుగ్రహాన్ని చూపిస్తారని విశ్వాసం . ఆ కథే ఈ ముక్కంటి వినాయకుడి కథ . 

రాజస్థాన్ లోని రణథంబోర్‌లో కొలువై ఉన్నాడు ఈ విఘ్నేశ్వరుడు.  భక్తులు కోరిన కోరికలను తీర్చే ఇష్ట దైవంగా పేరుగాంచాడు. ఈ వినాయకుడికి కేవలం కోరికలను నెరవేర్చమనే కాదు, తమ ఇండ్లలో జరగనున్న శుభాకార్యాలకు గణేషున్ని ఆహ్వానిస్తూ కూడా ఉత్తరాలు పంపుతారు. కోరికలు నెరవేరిన తర్వాత  భక్తులు వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ కూడా ఉత్తరాలు రాస్తారు. అలా ఆ ఆలయానికి నిత్యం దాదాపు 20 కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయట. వాటన్నింటినీ పూజార్లు ఓపిగ్గా స్వామి ముందు చదివి వినిపిస్తారు . అనంతరం వాటన్నింటినీ స్వామి పాదాల వద్ద ఉంచుతారు .అందుకే మరి మీకు రాజస్థానీ వచ్చునంటే బాగుంటుందని చెప్పింది . 

ఈ దేవాలయానికి సంబంధించిన ఒక స్థానిక గాథని అక్కడివారు వినిపిస్తుంటారు. ఆ కథనం ప్రకారం 10వ శతాబ్దంలో హమీర్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ రాజుపైకి  అల్లావుద్దీన్ ఖిల్జీ దండెత్తాడు . దాదాపు 7 ఏళ్లు వీరిద్దరిపోరూ భీకరంగా జరిగింది. హమీర్ రాజ్యంలోని ఖజానాలో ఉన్న ఆహార సామగ్రి అంతా తుడిచి పెట్టుకుపోయింది.  ఇక తనకు ఓటమి తప్పదని హమీర్ అనుకున్నాడు. 

అయితే భగవంతుని కృప ఉన్నవాడు ఎప్పటికీ ఓటమిని చవిచూడడు . హమీర్ వినాయకుడికి గొప్ప భక్తుడు . ఈ కారణంగా ఓ రోజు విఘ్నేశ్వరుడు హమీర్‌కు కలలో కనిపించి ‘తెల్లారితే యుద్ధం ఆగిపోతుంది. నువ్వే గెలుస్తావు, అన్ని సమస్యలు తొలగిపోతాయి’ అని చెప్పారట. ఆశ్చర్యంగా మరునాడు అలాగే జరిగిందట. 

దీంతోపాటు హమీర్ కోట గోడపైన చక్కగా ఎవరో శిల్పి  చెక్కిన శిల్పంలా విఘ్నేశ్వరుడి ప్రతిమ స్వయంభువుగా వ్యక్తమయింది . 

ఆ విగ్రహానికి ‘మూడు కళ్లు (త్రినేత్ర)’ ఉన్నాయి . ఆయన దేవేరులైన సిద్ధి, బుద్ధి, వారి పుత్రులైన శుభం , లాభం లతో కలిసి ఆస్వామి ఇక్కడ కొలువయ్యారు . దాంతో హమీర్ అక్కడ ఆలయాన్ని నిర్మించారు. అదే ఆలయం ఇప్పుడు కొన్ని వేల మంది భక్తులకి  కొంగు బంగారంగా మారింది .

అలా వినాయకుడు,సకుటుంబ సపరివారంగా ఇక్కడ కొలువై, కొలుపులు అందుకుంటున్నారు. ఉత్తరాల ద్వారా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ మహిమోపేతమైన దేవునిగా పేరుగాంచారు . మీరుకూడా ఈ లంబోదరునికి ఉత్తరాలు పంపాలనుకుంటున్నారా ? అయితే, ఇదిగో చిరునామా :

రణథంబోర్ త్రినేత్ర గణేష్ టెంపుల్, సవాయ్ మధోపూర్, రాజస్థాన్ – 322021

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha