గౌరీదేవి పిల్లలకోసం తపస్సు చేసిన ఈ బౌద్ధ గిరి !
గౌరీదేవి పిల్లలకోసం తపస్సు చేసిన ప్రదేశం ఈ బౌద్ధ గిరి !
లక్ష్మీ రమణ
తన కడుపు పండాలని, పండంటి బిడ్డని ఎత్తుకోవాలని ఆరాటపడని సువాసినులు ఎవరుంటారు . పైగా తమ ఈ చిరు కోరికని మన్నించి తమఒడిని ఒక ముద్దుల చిన్నారితో నింపమని , అమ్మ గౌరమ్మని వేడుకుంటూ ఉంటారు . ఆదిదేవుని అర్థాంగి , పరమేశ్వరి సంతాన ప్రదాయని మరి . అయితే, ఆవిడే స్వయంగా పుత్రుల కోసం తపస్సు చేసిన ప్రదేశాన్ని గురించిన విషయం ఇదీ !
పుణెకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ్ వినాయక ఆలయం’. గిరిజాత్మజుడు అంటే పార్వతీ పుత్రుడు అని అర్థం. ఈ గణపయ్యను దర్శించుకోవటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎతైన పర్వతంమీద బౌద్ధ గుహలో కొలువై ఉంటాడీ లంబోదరుడు. పర్వతం పైకి వెళ్లాలంటే దాదాపు 300కుపైగా మెట్లు ఎక్కి వెళ్లాలి. పిల్లలు, వయస్సులో ఉన్నవారు చురుగ్గా ఎక్కగలరేమో గానీ కాస్త పెద్ద వయస్సు వారికి, ఆరోగ్యం అంతగా సహకరించని వారికీ ఈ ప్రయాణం కాస్త కష్టమనే చెప్పాలి. అటువంటివారు స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉంటే, డోలీల సహాయంతో వెళ్లవచ్చు. అటువంటి సౌకర్యం ఉంది ఇక్కడ.
పుత్రుడ కోసం పార్వతీదేవి 12 ఏళ్లు ఘోర తపస్సు చేసిన ప్రదేశం ఈ లేన్యాద్రి పుణ్యక్షేత్రం. ఆ తపస్సు తర్వాత , నలుగుపిండితో బుజ్జి గణపయ్యని తయారు చేసి , ప్రాణం పోసి, ఆ బుల్లిగణపయ్యకు కౌమారప్రాయం వచ్చేవరకూ ఇక్కడే ఉన్నారని స్థానిక కథనం . ఈ గిరిజాత్మజ గణపయ్య నాలుగు పిండితో చేసిన మూర్తి లాగానే పూర్తిగా రూపురేఖలు కనిపించని విధంగా ఉంటారు .
స్తంభాలు అనేవి లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మానా జరిగింది . ఇదే ఈ గిరిజాత్మజ వినాయకుని ఆలయం ప్రత్యేకత. ఈ స్వామిని పూజిస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
సాధారణంగా మహారాష్ట్రలో హిందువులు వినాయక చవితి పండుగ సందర్భంగా అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకుంటారు. మొత్తం అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవాలంటే 654 కి.మీ ప్రయాణించాలి. ఈ అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి ‘గిరిజాత్మజ వినాయకుడు’ ఈ గణపతి కొండలపై ఉన్న గుహలో వెలసి భక్తులతో పూజలందుకుంటున్నాడు.