దొంగతనం చేసిన గణపతి
దొంగతనం చేసిన గణపతి - యమధర్మరాజుని సంహరించిన శివుడూ ఎక్కడంటే.. !
-లక్ష్మీ రమణ
జ్ఞానులు, సిద్ధులు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారంటే, ఏమో అనుకునేరు . ఈ కథ చదివారంటే, మీరుకూడా అవుననేస్తారు . స్వయంగా జ్ఞానస్వరూపమైన విఘ్నేశ్వరుడు కూడా అలాగే చిన్న పిల్లాడై ప్రవర్తిస్తుంటారు . అది లోకకళ్యాణానికే పరిణమించడం ఆయన లీల . అప్పుడు రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకెళుతుంటే, అడ్డుకోవడానికి మాయోపాయం పన్ని, ముందుగా తనని స్మరించలేదన్న నెపంతో , దాన్ని భూమిమీద పెట్టి జాతికి అంకితం చేసేశారు . సరే, ఇప్పుకూడా అలాటి ఒక గణేషుని దివ్య లీలని చెప్పుకుంటూ , ఆ లీల ప్రదర్శితమైన క్షేత్రాన్ని దర్శిద్దాం పదండి .
గవిఘ్నాలకి అధిపతి విఘ్నేశ్వరుడు . మన సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం తలపెట్టినా, ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాం. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తాం . అటువంటి గణనాధుడు తనకి తొలిపూజ చేయకపోతే, ఆగ్రహించిన ఉదంతాలు మన పురాణాల్లో కనిపిస్తాయి . దాన్ని ఆగ్రహం అనేకంటే, ఉడుక్కోవడం , లాగడం అంటే మరింత సమంజసంగా ఉంటుందేమో !
ఇంతకీ వినాయకుడు చేసిన దొగతనం ఏమిటా అని ఆలోచిస్తున్నారా ? ఆ విషయమే చెబుతున్నాం చదవండి మరీ ! పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేసారు. ఈ మహత్తర కార్యం మొదలు పెడుతున్న సమయంలో దేవతలు రాక్షసులు వినాయకుడికి పూజ చేయటం మరిచిపోయారు.
దీంతో అలకబూనారు మన గణనాధుడు. సముద్రగర్భం నుంచి ఉద్భవించిన ఒక కడివెడు అమృతాన్ని దొంగలించి, గుట్టుగా పట్టుకొచ్చి, తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లా తిరుక్కాడియాయూర్ లో ఉన్నటువంటి కడేశ్వరస్వామి ఆలయంలో దాచారు. అలా సముద్రగర్భం నుంచి అమృతాన్ని దొంగలించినందుకుగాను వినాయకుడికి ‘కళ్ళల్ వినయగర్’ అనే పేరు వచ్చింది. కళ్ళల్ అంటే దొంగ అని అర్ధం. ఇక్కడున్న వినాయకుణ్ణి ఇదే పేరుతొ పిలుస్తారు .
అయితే, ఈ విధంగా వినాయకుడు దొంగలించి దాచిపెట్టిన అమృతం కడవ నుండీ మహా శివలింగంగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆలయంలోని స్వామి వారు అమృతం నుంచి ఉద్భవించారు, కాబట్టి ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని అమృత కడేశ్వరుడిగా భక్తులు పూజించుకుంటున్నారు. అమృతమే తానైన స్వామి అమృత మనస్కుడై తన భక్తులని అనుగ్రహిస్తారని స్థానిక విశ్వాసం.
అదేవిధంగా యమధర్మరాజు నుంచి మార్కండేయుడిని కాపాడటం కోసం పరమశివుడు ఏకంగా యమధర్మరాజునే సంహరించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని కాల సంహారకుడు అని పిలుస్తారు. ప్రతి ఏడు ఈ ఆలయంలో స్వామి వారికి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ముఖ్యంగా కార్తీకమాసం, దసరా, శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
తమిళనాడు , మధురై నుండీ ఇక్కడికి చేరుకోవచ్చు .