సర్వరోగనివారకుడు కాజీపేటలోని ఈ శ్వేతార్కగణపతి
సర్వరోగనివారకుడు కాజీపేటలోని ఈ శ్వేతార్కగణపతి .
-లక్ష్మీరమణ
సాధారణంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి, కాగా మరికొన్ని స్వయంభువులై వెలసినవి . కానీ ఈ గణనాధుడు ప్రకృతి చేసిన రూపము . చాలా అరుదుగా లభించే తెల్ల జిల్లేడు మూలము నుండీ ఉద్భవించిన గణపతి . ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే ఈ గణపతిని దర్శించుకుంటే, ఆయుష్ వృద్ధి, మనోకామనాసిద్ధి జరుగుతాయని భక్తుల విశ్వాసం . ఈ బొజ్జగణపయ్య మన తెలుగురాష్ట్రమైన తెలంగాణలో కొలువై యుండడం విశేషం .
శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రం తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందింది . వరంగల్ జిల్లాలోని కాజీపేట లో ఈ ఆలయం ఉంది . 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోంది . ఉత్తరాది దేవాలయాల్లో ఉండేవిధంగా ,కాజీపేటలోని ఈ స్వామివారికి దేవాలయ నిర్మాణం చేసి, ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో పద్దెనిమిదిన్నర కిలోల వెండితో కవచాన్ని తయారుచేసి స్థిరప్రతిష్ట నేర్పరచటం జరిగింది. ఖాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్ లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం, పద్మావతీ వేంకటేశ్వరాలయం, అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సాయిబాబా గుడి కూడా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లో అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.
స్వయంభుగా వెలసి వేలాదిమంది భక్తుల కోర్కెలను క్షిప్ర ప్రసాదిగా నెరవేరుస్తూ, ఎంతోమంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి పొందాడు ఇక్కడి శ్రీ శ్వేతార్క మూల గణపతి. ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పీ చెక్కలేదు. తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వ్యక్తమయ్యారు . ఈ శ్వేతార్క గణపతి రూపంలో స్పష్టత పూర్తిగా ఉండడమే ఇక్కడి విశేషము . గణపతి తల, కళ్ళు, తొండము, ఒకటి పొడుగ్గా మరొకటి విరిగినట్టుగా ఉండే రెండు దంతాలు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం.ఇలా ప్రతిదీ స్పష్టంగా స్వయంవ్యక్తం అయ్యాయి . ఉలిదెబ్బలు పడకుండా, ప్రక్రుతి రూపుదిద్దిన సర్వావయవ సంపూర్ణుడై స్వామీ దర్శనమిస్తుంటారు .
ఈ శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపుకు కైలాస స్థానాన్ని చూస్తున్నట్లుగా నిలిచి ఉండడం మరో విశేషం . సమస్త వాస్తు దోష నివారకుడిగా ఈయన ప్రసిద్ధిని పొందారు . ఈ శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్య సమస్యలు, కాపురంలో కలతలు...ఇలా అనేక సమస్యలతో ఈ గుడికి వచ్చే భక్తులు తమకు వెంటనే సత్ఫలితాలు చేకూరినట్టు చెప్తారు. ఇక తెల్లజిల్లేడు మహిమా? లేక ఆ గణపయ్య చల్లని మహిమా అనిపోల్చుకోలేని విధంగా సుదీర్ఘమైన వ్యాధులెన్నో ఈ స్వామీ కృపవల్ల తగ్గుతాయని ప్రతీతి .
శ్వేతం అనగా తెలుపు, ఆర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. నారదాది పురాణ గ్రంధాలలో తెల్లజిల్లేడు వృక్షం పరిపూర్ణంగా వందేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఆ వృక్ష మూలంలో గణపతి ఆకృతి ఏర్పడుతుందని చెప్ప బడింది. శ్వేతార్క గణపతి గొప్పతనం, వైశిష్టం గణపతి ఉపనిషత్‌లో కూడా తెలియజేయబడింది.
శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. శ్వేతార్క మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. కేవలం గరికతో పూజిస్తే చాలు సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తారట ఈ శ్వేతార్క మూల గణపతి .
విదేశీయులు కూడా ఈ మూర్తిని దర్శించాలని వస్తుంటారు. ప్రతి నెల మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం, మరియు గరిక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6.30 గం. అభిషేకం, 8.00 గం. మహానివేదన, రాత్రి 7.00 గం. పూజలు, జరుగుతున్నాయి.
ఎలా వెళ్లాలి ?
శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం హైదరాబాద్ కు 120 కి.మీ దూరంలో వరంగల్ జిల్లాలోని కాజీపేటలోని విష్ణపురిలో ఉన్నది. హైదరాబాద్ - విజయవాడ రైలుమార్గంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఉన్నది. శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయం వరంగల్ లోని కాజీపేట్ లో గల విష్ణుపురి లో ఉన్నది.