ఈ ఆలయంలో తాళం కప్ప (lock ) వేశారంటే
ఈ ఆలయంలో తాళం కప్ప (lock ) వేశారంటే, మీ కోరిక తీరిపోయినట్టే !!
-లక్ష్మీరమణ
తాళం వేస్తే, కోరిక తీర్చే కాళీమాత ఆలయం కథ ఇది . ఈ ఆలయంలో కానుకలు సమర్పించక్కర్లేదు . కొబ్బరికాయల ముడుపులు చెల్లించక్కర్లేదు . ఇక్కడ ఆ దేవి సులభ ప్రసన్న . కావాల్సిందల్లా ఒక తాళం . అంతే . కానీ ఫలితం మాత్రం చాలా గొప్పది . కోరినకోర్కెలు వెంటనే తీరిపోతాయి . ఈ తాళంమొక్కు కథేంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ ! చూద్దాం పదండి .
కాలం శక్తి స్వరూపమైతే , ఆదేవి కాళిక రూపంలో సాక్షాత్కరిస్తుంది . కాలంలో అనుకూలించని విషయాలకీ , అనుకూలించే విషయాలకీ , ధర్మానికి , అధర్మానికీ కూడా అధినేత్రి ఆ దేవి . అందుకే అనుకూలతలకీ , ప్రతికూలతకీ తాళం వెయ్యగలగడం , తీయగలగడం ఈ దేవి అనుగ్రహంతో సాధ్యం అవుతుంది .
మొక్కుచెల్లించుకొనే పధ్ధతి :
తాళం వేసేప్పుడు (లాక్ చేసేప్పుడు) మనసులో మీ కోరికని చెప్పుకోవాలి . తాళంచెవిని భద్రపరుచుకోవాలి . అది ఖచ్చితంగా ఫలవంతమవుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం . అలా కోరిక తీరినతర్వాత, తాళం తీయాలి . అమ్మకి మేకని ఆహారంగా సమర్పించాలి . ఆ తర్వాత అన్నదానం చేయాలి. ఇదీ ఇక్కడి పద్దతి . ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా !
కాళీమాత ఆలయం – ఉత్తరప్రదేశ్:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, కాన్పూర్ జిల్లా, బెంగాలీ మొహల్లాలో అతి పురాతనమైన కాళీమాత దేవాలయం ఉంది. ఇక్కడి భక్తులు అమ్మవారిని ‘తాలే వాలీ దేవి’ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయంలో ఎటువంటి కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఓ తాళం కప్ప తెచ్చి తాళం వేస్తే సరిపోతుందని గుడి పూజారులు అంటున్నారు. మహిళా భక్తులు కొనసాగిస్తున్న ఈ ఆచారం కొన్ని శతాబ్దాల నుండి ఇక్కడ కొనసాగుతోందిమరి !
ఈ ఆచారం వెనుకున్న స్థానిక గాథ :
పూర్వం కొన్ని శతాబ్దాల క్రితం అమ్మవారి దర్శనానికి ప్రతి రోజు ఓ భక్తురాలు ఉదయాన్నే వచ్చేది. ఒక రోజు దేవాలయ ప్రాంగణంలో ఆమె తాళం కప్పను ఉంచి తాళం వేసింది. దీనిని గమనించిన అప్పటి ఆలయ పూజారి ‘ఎందుకిలా చేస్తున్నా అమ్మ’ అని ప్రశ్నిస్తే, ఆమె తన కలలోకి కాళీమాత కనిపించి ఇలా గుడి ప్రాంగణంలో తాళంకప్పను ఉంచితే ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని తెలియజేసినట్టుగా చెప్పింది . దీని తరువాత ఆ భక్తురాలు మళ్లీ ఓ రోజు అకస్మాత్తుగా వచ్చి నా కోర్కె నెరవేడంతో ఈ తాళం తెరుస్తున్నానని ఆమె ఆలయ ప్రాంగణంలో ఉన్న గోడలపై రాసింది.
ఇక అప్పటినుండి మనసులో తమ కోరికలు కోరుకుంటూ భక్తులు ఇక్కడ ఇలా తాళం వేస్తారు. వారి వారి కోర్కెలు నెరవేరినవాళ్లు నవమి రోజున అమ్మవారికి మేకను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాతి రోజు ఉదయం ఆలయంలో భక్తులకు అన్నదానం చేస్తారు .
మీకూ తీరని ధర్మబద్ధమైన కోరికలేమైనా ఉంటె, వెంటనే ఈ అమ్మదర్శనానికి బయల్దేరండి మరి .