నీటిలో నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకోవాలి !
నారసింహుణ్ణి ,నిలువెత్తు నీటిలో నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకోవాలి !
-లక్ష్మీ రమణ
నారసింహ క్షేత్రాలు , చాలా విత్రమైన మహిమలతో అలరారుతుంటాయి. సింహస్వరూపం భగవంతునికి ప్రతీక. కాబట్టే ఆ మహిమలు అలా వర్ధిల్లుతుంటాయేమో మరి. ఒకచోట నారసింహుని శ్వాసని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు . మరో చోట నారాసింహుడు ఇప్పటికీ రక్త చందనాన్ని స్రవిస్తుంటాడు. మరోచోట వైద్యుడై సర్వరోగాలని నియంత్రిస్తుంటాడు. ఇలా నారసింహుడు వెలసిన క్షేత్రమల్లా గొప్ప మహిమతో కూడి ఉంటుంది. అలాంటిదే ఇక్కడ మనం చెప్పుకోబోతున్న నారసింహ క్షేత్రం .
కర్ణాటక రాష్టంలోని బీదర్ కి సమీపంలో ఝార్ణీ అనే ప్రాంతంలో ఉందీ నారసింహాలయం . నారసింహుడి మరో విశిష్ఠత ఏంటంటే, సింహం గుహల్లో ఉండడానికి ఎలాగైతే ఇష్టాన్ని చూపిస్తుందో అలాగే ఈయన కూడా గుహాలయాల్లో ఉండేందుకు ఇష్టపడతారు. ఝూర్ణీ లో కూడా నారసింహుడు గుహలోనే స్వయంవ్యక్తం అయ్యారు. స్వయం వ్యక్తం అనేకంటే, అసలు ఆయనే అక్కడ శిలగా నిలిచిపోయారు అంటే, సరిగ్గా ఉంటుందేమో !
పూర్తిగా జూలు, గుండ్రని కాళ్ళూ , బయటికి ఉన్న కోరలు , పళ్లతో ఆ స్వామి శత్రుభయంకరంగా దర్శనమిస్తారు. అదికూడాకాదిక్కడి విశేషం. భక్తులు నిలువెత్తు నీటిలో నడుచుకుంటూ వెళ్లి, నడుములోతు నీళ్ళల్లో ఉన్న స్వామిని దర్శించుకోవడం ! దాదాపు 600 మీటర్ల లోపలికి నీటితో నిండిన గుహ గుండా ప్రయాణం చేయాలి . అప్పుడు దర్శనమిస్తారు నారసింహుడు. ఆయన పాదాల నుండీ ఈ గంగమ్మ ఊరుతూ ఉంటుందట !
క్రీ.పూ 400 ల సం ల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువైవున్నారని చెబుతున్నారు. ఈయనకి జలనరసింహుడు అని కూడా పేరు. ఈ పేరు రావడం వెనుక, స్వామీ ఇక్కడే నిలవడం వెనుకా ఒక కథని వినిపిస్తున్నారు స్థానికులు .
పూర్వం ఈ గుహలో శివుడు తపస్సుని ఆచరిస్తున్నారట. అప్పుడు జలాసురుడనే రాక్షసుడు, ఆయన తపస్సుని భాగాంమ్ చేయడానికి అనేక యత్నాలు చేయసాగాడట . ఆ సమయంలోనే హిరాణ్యకశిపుణ్ణి వధించిన క్రోధంతో అడవులవెంట తిరుగుతున్నారట నారసింహులవారు. ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న శివయ్యని విసిగించాలని చూస్తున్న జలాసురుణ్ణి అదే ఊపులో మట్టు పెట్టారట . అయితే, ఆసమయంలో జలాసురుడు స్వామిని అనుగ్రహించమని , తన పేరుమీద ఇక్కడే కొలువై భక్తులని అనుగ్రహించమని వేడుకున్నాడట . దానికి సంతసించిన స్వామీ, ఆ చివరి క్షణంలో ఆ రాక్షసుని పస్చాత్తాపానికి వశుడై, అక్కడే కొలువయ్యారని స్థల పురాణం .
ఇక్కడి చేరుకోవాలంటే, బీదర్ దగ్గరి ప్రదేశం. ఇక్కడికి అన్ని ప్రధాన నగరాల నుండీ రైలు సౌకర్యం ఉంది . అక్కడినుండి బస్సులు, ఆటోలు గుహదాకా అందుబాటులో ఉంటాయి.