Online Puja Services

ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా

3.133.123.162

ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుంది -బాసర 
-లక్ష్మీ రమణ 

‘క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
రశ్రేణికి జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక ర మ్య పాణికిన్’

అని శారదామాతకి సాష్టాంగప్రణామాన్ని తీయని తెలుగులో చేస్తారు పోతనామాత్యులు భాగవత రచనకి పూనుకుంటూ .  నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించు దేవికి , బ్రహ్మదేవుని మనసు వశపరచుకున్న వాణికి , రుద్రాక్షమాల, చిలుక, పద్మము, పుస్తకము చేతుల ధరించు రాణికి , సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకునట్లు వంగి, భక్తితో నమస్కరిస్తానని చెబుతూ భాగవతాన్ని రాసే శక్తిని ప్రసాదించమని ఇలా ప్రార్ధిస్తారు.

‘పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళి గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీ
దెట్టే వెంట జరింతు దత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్
పట్టున్ మానకుమమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ’

తల్లీ! సరస్వతీ! నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను. రెల్లుపొదలో పుట్టిన కుమారస్వామిని కాను. నావలో పుట్టిన వ్యాసుడిని కాను. కాళీమాత అనుగ్రహం పొందిన కాళిదాసును కాను. (అంటే కవిత్వంలో వారికున్న ఘనత నాలో ఏ మాత్రం లేదు అని అర్థం). నేనుభాగవత పురాణాన్ని రచించాలనుకుంటున్నాను. నాకు తగినంత శక్తిని ప్రసాదించమ్మా! అని . అక్షర స్వరూపమైన ఆ వాగ్దేవికరుణా కటాక్షం లేకపోతే కవిత్వం మాట వాణికెరుక, నోటా మాటైనా వచ్చేనా ? 

 అటువంటి ఆ జ్ఞానాంబిక కొలువైన తెలుగు నేల బాసర . సిద్ధి, సిరి, శక్తి స్వరూపాలకు  నిలమై అలరారే బాసర ఆలయం తెలుగు గడ్డపై ఉండడం తెలుగుప్రజలు చేసుకున్న పుణ్యం. గోదారి అలలు అమ్మ పాదాలు అభిషేకించాలని ఆరాటపడుతుంటాయి. ఆ అలలనే తీగలుగా మలిచి జ్ఞానామృతాన్ని వర్షించే గానం చేస్తున్నట్టు ఉంటుంది వీణాపాణి. 

గోదావరి నీటి తరగలు బాసర క్షేత్రాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. అక్కడే ఒడ్డున ఉన్న గోదారమ్మ ప్రతిమ చేతిలో పూర్ణ కలశంతో శివుణ్ణి అభిషేకిస్తున్నట్టు ఉంటుంది. కొద్ది సేపు ఆప్రతిమ సౌందర్యానికి ఒకింత ముగ్ధులై, ఆ పక్కనే సజీవంగా  ప్రవహిస్తున్న గోదారమ్మని చూస్తూ తన్మయులవుతారు. శారదాదేవి దర్శనార్ధం వచ్చే భక్తులు ముందర గోదావరిలో స్నానాదికాలు ఆచరించి ఆతర్వాత శారదాదేవి దర్శనానికి ఉద్యుక్తులవుతారు.

జ్ఞానాంబిక :
​ముగురమ్మల మూలపుటమ్మగా జ్ఞానాంబిక బాసరలో దర్శనమిస్తుంది . శ్వేత హంస పై  ఆసీనురాలై, శ్వేత వర్ణ శోబితం గా మందస్మిత వదనంతో అనుగ్రహిస్తుంది మాత సరస్వతి. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. సర్వ శుక్లా సరస్వతీ అని వేదం చెబుతుంది. శ్వేతవర్ణం సత్వగుణానికి ప్రతీక . మహాకాళి నీలవర్ణంతో  తమోగుణానికి,  మహాలక్ష్మి అరుణవర్ణం తో రజోగుణానికి ప్రతీక కాగా మహాసరస్వతి శ్వేత వర్ణం తో సత్వగుణానికి ప్రతీకగా విరాజిల్లుతూవుంటుంది . ఈ సత్వగుణ మే  లోకం లో సమభావనకి , శాంతికీ మూలం . కనుక సరస్వతీ  ఆరాధన వల్ల  లోకం లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి . కానీ ఇక్కడి శారదాంబ మాత్రం చూపరులకు పసుపువర్ణ శుశోభితంగా దర్శనమిస్తుంది . ముఖం నిండా పసుపు , దానిపైన దిద్దిన కుంకుమ, చెరగని చిరునవ్వు తో శారదాంబ శాంతస్వరూపిగా గోచరిస్తుంది. కామితార్థులకు  ఉదయం జరిగే అభిషేకసేవ  సమయంలో అమ్మ నిజరూప దర్శనం ప్రాప్తిస్తుంది .  లోకకల్యాణ కారక మైన ఈ శారదా దేవి సేవలో తరించేందుకు భక్తులు తండోపతండాలుగా బాసరకు  వస్తుంటారు .

దేశంలో ఉన్న అతి కొద్ది  సరస్వతీ దేవాలయాల్లో బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రసిద్ధి చెందినది .ఇక్కడి గోదావరిలో స్నానమాచరించి జ్ఞానాంబికను, వ్యాసమహర్షిని దర్శించుకొంటే సకల విద్యలూ సంప్రాప్తిస్తాయని స్థల పురాణం. శారదేవిని అర్చించుకొనేందుకు అశేషంగా భక్తులు తరలివస్తారు. కనుక దేవాలయాన్ని అందుకు అనుగుణంగా తీర్చి దిద్దారు. ఈక్షేత్రాన్ని చేరుకోవడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించింది.   రైలు, బస్సు సర్వీసులు ఇక్కడికి చేరుకొనేందుకు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

విశేష అర్చనలు:
విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానం చేత ధనం, ధనం చేత అధికారం సంప్రాప్తిస్తాయని పండిత వచనం. వేదవ్యాసగురువుల అనుగ్రహం, జ్ఞానాంబిక ఆశీర్వచనం కలిసిఉండడం వల్ల ఈ క్షేత్రంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తుంటారు.బాసర జ్ఞానసరస్వతీదేవి ఆలయంలో వసంతపంచమి వేడుకలు, అక్షరాభ్యాసాలు, విశేష అర్చనలు వైభవోపేతంగా జరుగుతుంటాయి. గురుస్థానం కాబట్టి గురుపూర్ణిమ వేడుకలు కూడా విశేషంగా నిర్వహిస్తుంటారు. 

ప్రధాన అంతరాలయంలో సరస్వతీదేవి సరసనే కొలువైన లక్ష్మీ మాత చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. చైతన్య జ్ఞానానికి ప్రతీకలా శారదమ్మ ఇక్కడ దర్శనమిస్తుంటే, చెంతనే లక్ష్మీ దేవి ఐశ్వర్య ప్రదాయనిగా కొలువై ఉంటుంది.సరస్వతీ కాటాక్షం, లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడే కదా ఇహ జీవన నౌక  ఆనందమయంగా సాగేది. ఏఒక్కటి లేకున్నా సంసార సుడిగుండంలో చిక్కుకున్న జీవుడు ఆధ్యాత్మిక కాంతి కనపడక అల్లాడాల్సిందే కదా . అందుకే ఇక్కడ సిద్ధికి, సంపదకీ అధిదేవతలైన ఇద్దరమ్మలూ  ఒకే అంతరాలయంలో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారనిపిస్తుంది. 

అందుకే ఈ దేవి సాన్నిధ్యంలో  తమ పిల్లలు అక్షరాభ్యాసం చేస్తే వారి  అనుగ్రహంతో సిరి, జ్ఞాన సిద్ధి సంప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం సైతం తెలియజేస్తుంది. అనంతంగా ఆక్షరాభ్యాస కార్యక్రమాలు ఇక్కడ నిత్యం జరుగుతూంటాయి . ఆ సమయంలో ఆలయమంతా 

సరస్వతి నమస్తుభ్యం
వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి
సిద్దిర్భవతు మే సదా

అనే సరస్వతీ ప్రార్థన తో ప్రతిధ్వనిస్తుంటుంది.

ముగ్గురమ్మల దర్శనం :
 అమ్మవారి మూలమూర్తిని దర్శించుకొనే  ముందరే భక్తులకు అంతరాలయానికి ముందర ప్రతిష్టించిన  సరస్వతీ దేవి అర్చామూర్తి దర్శనమిస్తుంది. నిత్యాభిషేకాలు, కుంకుమార్చనలు జరిపించుకొనే ఈ దేవి దివ్య ప్రభలతో తోజోమూర్తిగా విరాజిల్లుతూ ఉంటుంది. 

లక్ష్మీ , సరస్వతుల అనుగ్రహాన్ని పొందిన తర్వాత భక్తులు పక్కనే కొలువైన మహంకాళిని దర్శించేందుకు ఉద్యుక్తులవుతారు. చారడేసి కళ్ళతో ఒకింత ప్రశాంత వదనంతో ఉన్నా,  దుష్ట శక్తుల పాలిటి అపరకాళిని కాగలనని హెచ్చరిస్తున్నట్టే ఉంటుంది కాళీమాత . దేవీనవరాత్రులు, శివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శరణన్న వారిని అమ్మలాగా కాపాడే ఈ చల్లని శక్తి స్వరూపిణిని దర్శించుకున్న భక్తులు వ్యాస భగవానుని దర్శనానికి బయలుదేరతారు . 

స్థలపురాణం:

స్థలపురాణం  ప్రకారం బాసర లోని మూలమూర్తిని , ఆమాటకొస్తే ముగ్గురమ్మలనూ ఇసుక బొమ్మలుగా చేసి, ప్రాణ ప్రతిష్ట చేసినవారు  వేదవ్యాసులు .  కురుక్షేత్ర యుద్ధానంతరం మనస్తాపం చెందిన వేదవ్యాసులు  ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణం లో  తపస్సు చేయడం ప్రారంభించారు. అప్పుడు వ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట . దాంతో ఆయన  నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులనూ ప్రతిష్ఠించారని ఐతిహ్యం .

స్పాట్ :

బాసర  తొలుత వ్యాసర. వ్యాసునికి ఈ భూమికి ఉన్న సంబంధం విడదీయరానిది. జగద్గురువైన  వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించారు.  అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసరగా ప్రసిద్ధిపొంది, ఆ తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన సైకత దేవీ మూర్తులకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో వ్యాసుడు తపమాచరించిన గుహ ఇప్పటికీ ఉంది. ఒక్క మనిషి మాత్రం పట్టే వెడల్పు లో ఉండే ఈ గుహలోకి వెళ్లి అక్కడున్న శారదాంబికను కూడా భక్తులు దర్శించుకొని తన్మయులవుతుంటారు.   

వేదవ్యాస దర్శనం :

'గు' శబ్ద / మంధకారస్య / 'రు'తన్నిరోధకః అని పెద్దల వచనం! గు అంటే అంధకారము లేదా అజ్ఞానం , రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్ధం . గురు శబ్దం లోనే  అజ్ఞానాన్ని నశింప చేయువారు అనే  అర్ధము నిబిడీకృతమై ఉంది. అజ్ఞాననమనే అంధకారంలో జ్ఞానదీప్తిని వెలిగించేవారే గురువు. సాక్షాత్తు పరమాత్మ ముఖతః వెలువడిన ఎకరూపమైన వేదములను, మానవ కళ్యాణం కోసం  విభజించి 4 శాఖలుగా ఏర్పరిచిన మహనీయుడు వేదవ్యాసుడు . ఈ నాల్గు  భాగాలూ ఋగ్గ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే పేర్లతో నాల్గు వేదాలుగా వర్ధిల్లుతూ మానవ జీవన ప్రామాణిక మైన అంశాలనూ , విద్యుక్త కర్మలనూ విశిదపరుస్తూ దిశా నిర్దేశనం చేస్తున్నాయి. వీటితో పాటు  అష్టాదశ పురాణాలను, భారత భాగవతాలను కృష్ణ ద్వైపాయనుడే ఈ జగతికి అందించారు. వీటిల్లో లేనిది విశ్వంలో మరేదీ లేదు. ఇటువంటి విస్వజ్ఞాన ప్రకాశములతొ అజ్ఞానమనే అంధకారాన్ని నిర్మూలింపజేశారు కనుక ఆయనే ఈ జగత్తుకు  తొలిగురువు. అటువంటి  జగత్గురువులు తపస్సు చేసిన జ్ఞాన భూమి బాసర . 

వ్యాసతీర్ధం:
ఇక్కడి వ్యాసతీర్ధం మహిమాన్వితమైనది . సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు యొక్క అపరరూపంగా భావింపబడి సమస్త ప్రపంచమునకు, ఆధ్యాత్మిక గురువుగా, జ్ఞానజ్యోతి స్వరూపుడై వెలిసిన శ్రీ వేదవ్యాస ముని నామమున, ప్రసిద్ధమైన వ్యాస తీర్ధం సర్వతీర్ధాలకు తలమానికం! ఈ వ్యాస తీర్ధములో స్నానము చేసినట్లయితే సమస్త మనోరథములు నెరవేరతాయి. సంతానార్ధులకు సంతానం, భోగభాగ్యములు కోరుకొన్నవారికి  సమస్త భోగభాగ్యములు ప్రాప్తిస్తాయి. మోక్ష లక్ష్మీ కటాక్షం కోసం తపించేవారు ఇందులో స్నానం చేయడం వల్ల  జీవన్ముక్తులవుతారు.ఇహ పరము లలో ఏ కామితార్ధమునైనా తీర్చగల దివ్య జలం ఈ వ్యాస తీర్ధమని బ్రహ్మదేవులు  వ్యాస తీర్ధ మహిమను  నారదునికి  వివరించారని శృతి వచనం.

వ్యాసతీర్ధం చుట్టుపక్కల మరో ఎనిమిది దివ్య తీర్ధాలున్నాయని వాటిలోని జలం పరమ పవిత్రమైనదని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు.ఇక ధనపుగుండు అనే  శిల కూడా యాత్రికులని ఆకర్షిస్తుంటుంది. దీనిని చేతితో తట్టినప్పుడు వ్యతిరేక దిశల్లో భిన్నమైన శబ్దం ఉత్పన్నమవుతుంది. దీంట్లో శీతమ్మవారి నగలున్నాయని భక్తుల నమ్మకం.

స్పాట్:

ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమైన సరస్వతీ దేవాలయం గా ప్రసిద్ధి పొందిన తెలంగాణా శక్తి క్షేత్రం బాసరను తిలకించి అమ్మ ఆశీస్సులను అందుకున్నారు కదా! మరో దివ్యధామ విశేషాలతో మల్లి కలుద్దాం.నమస్కారం.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya