దొంగల భరతం పట్టిన అమ్మవారు .

దేవలోకం నుండీ జారిపడ్డ మృదంగం, దొంగల భరతం పట్టిన అమ్మవారు .
- లక్ష్మి రమణ
అమ్మవారి లీలా విలాసాలు ఎన్నగ ఎంతవారలకైనా సాధ్యమే !! అని ముక్కున వేలేసుకునేట్టు చేసిన ఉదంతం ఈ ఆలయం కథ . ఆలయాలలోని అమ్మని బొమ్మ మాత్రమే అని భావించేవారికి సవాలు విసిరిన దేవదేవి. ఎన్నో సార్లు అమ్మవారిని దొగలించాలనుకొని , ప్రయత్నించి, ప్రతిసారీ భంగపడ్డ దొంగల వ్యధ ఈ ఉదంతం . కెరలోని ఈ దివ్యమైన భవ్యమైన ఆలయాన్ని దర్శిద్దాం రండి .
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం ఇది . కొట్టాయం రాజుల ఆరాధ్య దేవత . ఇక్కడ అమ్మవారు "మృదంగ శైలేశ్వరి” పేర పూజలందుకొనే దుర్గాదేవి . ఈ ఆలయం పరశురామునిచేత స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించిందని చెబుతారు. ఇది ఒక తాంత్రిక శక్తి పీఠంగా కూడా పేరొందింది. ఇక్కడ అమ్మవారిని "మిఝావిల్ భగవతి" అని కూడా పిలుస్తారు.
ఇక అమ్మవారికి మృదంగ శైలేశ్వరి అనే పేరు రావడం వెనుక ఉన్న కథ చాలా ఆశక్తికరంగా ఉంటుంది . ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి జారి పడిపోయింది అని చెప్తారు. అటువంటి దివ్యమైన శిలలో దాగిన శక్తిని లేదా దేవి ఉనికిని గమనించిన పరశురాముడు, ఆమెను విగ్రహంలోకి ఆహ్వానించి, ఆమె కోసం ఆలయాన్ని నిర్మించాడు అని స్థలపురాణం.
సెక్యూరిటీని నిరాకరించిన ప్రభుత్వం :
ఇటీవల కేరళ రిటైర్డ్ డిజిపి శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి గారు విగ్రహాన్ని దొంగిలించిన ఆ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించారు. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి ‘పంచలోహ విగ్రహం’ చాలా విలువైనది మాత్రమే కాదు , మహా మహిమాన్వితమైనది కూడా. దీంతో ఈ విగ్రహాన్ని దొంగిలించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఆయన డి జి పి గా పనిచేస్తున్నప్పుడు, స్వయంగా సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట. ఎందుకంటే ఆ విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని వారు నమ్మడమే.
విగ్రహాన్ని దొంగిలించినప్పుడు ఏం జరుగుతోంది :
మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి చేర్చగలరు” అని .
రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి.
మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.
Mr. అలెగ్జాండర్ అనే పోలీసు అధికారి ఈ మూడు సందర్భాల్లో తనే డ్యూటీలో ఉన్నారు. అన్ని సార్లు దొంగలు విఫలం కావడం ఆయన్ని ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేసింది . వారిని విచారించినప్పుడు తెలుసుకున్న విశేషాలు అతని ఆశ్చర్యాన్ని మరింత పెంచాయి . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
విగ్రహాన్ని దేవాలయం నుండి దొంగలించి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తాము వెళ్లాల్సిన దారిని పూర్తిగా మర్చిపోతున్నారు. పైగా ఏదో మైకం ఆవహించినట్టు ఉంటుందని, తాము తమ మూత్ర,మల విసర్జన అవయవాల పైన నియంత్రణ కోల్పోతున్నామని చెప్పారు.
ఇలా జరగడానికి కారణం ఇదేనా ?
అమ్మవారు తాంత్రిక విధానంలో ప్రతితించబడ్డారని, 9 రోజులకు పైగా అమ్మవారి ప్రతిష సమయంలో పూజా కార్యక్రమాలు జరిగాయని, అందువల్ల అమ్మవారి మహిమ కారణంగానే ఆ దొంగలకు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయని ఇక్కడి అర్చకులు చెబుతూ ఉండడం విశేషం . ఈ మృదంగ శైలేశ్వరీ దేవి మహా మహిమోపేతమైన దేవతని స్థానికులు స్వానుభవాలతో వివరించడం ఇక్కడి మరో విశేషం .
ఇలా చేరుకోవచ్చు :
కేరళ రాష్ట్రంలోని కున్నూర్ రైల్వే స్టేషన్ నుండీ సుమారు 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడ నుండీ రోడ్డు మార్గం ద్వారా మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చేరుకోవచ్చు .