త్రిముఖదుర్గమ్మ

కార్తీకపున్నమి వేళలో, చందమామ చల్లని కిరణాలతో అభిషేకం చేసే త్రిముఖదుర్గమ్మ !
-లక్ష్మీరమణ
కార్తీకపౌర్ణమి రోజున ఆలయ దర్శనం చేద్దామనుకుంటున్నారా ? ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉంటె, ఈ వ్యాసం ఖచ్చితంగా మీకోసమే. సూర్యుడు తన కిరణాలతో దేవీదేవతలని అభిషేకించే ఆలయాలని గురించి చాలానే వినివుంటాం . కానీ అంతటి తీక్షణమైన కాంతిని కలిగి ఉండని చంద్రుడు తన వెన్నెల కాంతులతో ఆ ముగ్గురమ్మలను అభిషేకంచేసే చోటు ఇది . అమ్మ ఒడిలా ఆశీర్వదించే దుర్గమ్మ సన్నిధానం , కార్తీకపూర్ణమి వేళలో చంద్రకిరణ సందర్శనం , ఆ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగ రూప నిలయమైన ఈ క్షేత్రంలో మీకు తప్పక లాభిస్తాయి .
భైరవకోన ప్రకృతి అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు నెలవు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులలో నల్లమల అడవుల్లో ఉన్న ఓ అద్భుతలోయ భైరవకోన. అంతుచిక్కని రహస్యాలకు, ప్రకృతి పరవశానికి, పరమాత్మ ప్రకాశానికి నెలవు నల్లమల అడవులు. అలాంటి నల్లమల అడవుల్లో ఉన్న అద్భుతలోయ భైరవకోన. కాకులు దూరని కారడవి కాదు . ఎందుకంటె, మనుషులమైన మనమే చేరుకోగల ప్రదేశం . కానీ అంతటి కానలో ఒక్క కాకయినా కనపడకపోవడం, కూయకపోవడం విచిత్రమే కదా !
కాలభైరవ దర్శనం :
పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించేవాడు కాబట్టి భైరవకోన అనే పేరు వచ్చిందని ఒక కథనం చెప్తుంటే, పూర్వం మునులు భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి భైరవకోన అనే పేరొచ్చిందని మరో కథనం చెప్తోంది. ఇలా ఈ క్షేత్రానికి భైరవకోన అని పేరు రావడానికి ఎన్ని కథనాలు వినబడుతున్నా ప్రధానంగా వినిపించే స్థానిక ఐతిహ్యం మాత్రం కృతయుగంతో ముడిపడి ఉంది.
కృతయుగంనాటి నేపధ్యం :
కృతయుగంలో ఇక్కడి నృసింహాలయంలో ప్రహ్లాదుడు, భైరవున్ని అర్చకుడిగా నియమించాడట . ప్రహ్లాదుడు గతించిన తరువాత ఆ ఆలయాన్ని పట్టించుకునేవారు లేక, బ్రతకడానికి వేరే దారిలేక బాధపడుతున్న భైరవుడు, క్షుద్బాధను తీర్చుకోవడానికి దారిదోపిడీలకు పాల్బడేవాడట. దాంతో కోపగించుకున్న నృసింహాస్వామి భైరవున్ని, రాక్షసుడిలా దారిదోపిడీలు చేస్తున్న నీవు, రాక్షసుడవు కమ్మని శపించాడు. అయితే క్షుద్బాధని భరించడం చేతకాకే ఆకలి భరించలేకే అలా చేసానని తన పాపానికి పరిహారం శూచించమని భైరవుడు ప్రాదేయ పడ్డాడు. భైరవుడి ప్రార్ధనలకు కరిగిపోయిన నృసింహస్వామి, కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తన భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ,ఉండమనీ కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని వరమిచ్చాడు. అప్పటినుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు. అలా భైరవునికి నెలవైన ఆ లోయ భైరవకోనగా పిలువబడుతోందని చెప్తారు.
భైరవకోనలో ప్రవేశించగానే నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహం మనకు స్వాగతం చెప్తుంది. స్వామి పక్కనుంచి ముందుకు సాగిపోతూ వెళ్తే 200 మీటర్ల ఎత్తునుంచి దూకే జలపాతం అందంగా దర్శనమిస్తుంది. కొండలమీదనుంచి జలపాతం ద్వారా వచ్చే ఆ నీరు కిందనిర్మింపబడ్డ పెద్ద సిమెంటు గాబులలో చేరేవిధంగా ఏర్పాటు చేసారు. ఈ జల ప్రవాహం మార్గంలో, కొండల మీద వున్న రకరకాల వైద్య మూలికలను స్పర్శిస్తూ ,వాటిలోని ఔషధగుణాలని తనలో నింపుకుంటూ ప్రవహించటం విశేషం. ఈ నీటిలో స్నానం చేసినవారికి అనేక రుగ్మతలనుంచి విముక్తి లభిస్తుందిని భక్తుల విశ్వాసం .
రుద్రాలయం :
రుద్రాలయం చూడగానే,ఒక పార్శ్వంలో రుద్రుడు కొలువైనకొండకి, నాగరాజు తన పడగనీడపట్టాడా ? అనే భ్రమ కలుగక మానదు. కానీ ఇక్కడ కొలువైన తొమ్మిది శివాలయాలు ఒకే కొండలో మలచినవి కావడం విశేషం . ఆ గుహాలయాల బయట ద్వారపాలక ప్రతిమలతో పాటు వివిధ దేవతల శిలా మూర్తులు కూడా కనబడతాయి. శివుని కోసం చెక్కిన ఈ గుహాలయాలలో, గుహలమధ్యన గర్భగుడిలో లింగరూపుడై శివుడు పూజలందుకుంటుంటే, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వుంటాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి విగ్రహాలుంటాయి.
త్రిముఖ దుర్గాస్వరూపం :
ఈ శివాలయాలన్నీ పై వరసలో వుంటే కింద ఆలయంలో ముగ్గురమ్మల మూలపుటమ్మ త్రిముఖదుర్గగా దర్శనమిస్తుంది. ఈ దుర్గమ్మ కుడివైపు ముఖం మహాకాళిగా కనబడుతుంటే, మధ్య ఉన్న ముఖం ప్రసన్నవదనంతో ఉన్న మహలక్ష్మి, ఎడమవైపు మహా సరస్వతీదేవి గా దర్శనమిస్తారు. అయితే విచిత్రమేమిటంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ వుంటుంది. తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని అలా అద్దం ద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని, అక్కడ సరస్వతీమాత అలా అద్దంలో చూస్తూ ఉంటుందని చెప్తారు. ఈ మాతని త్రిముఖ దుర్గాస్వరూపంగా చెబుతారు.
కార్తీకపౌర్ణమి వేళలో :
ఇక్కడి పౌర్ణమి అందాలు చూడడం ఇక్కడ ఓ మరపురాని అద్భుతం. కార్తీకపూర్ణమికి ఈ క్షేత్రంలో ఉండగలగడం ఒక సుకృతం . ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున చంద్రబింబం, అక్కడి ఆలయానికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పరావర్తనం చెంది , ఆ తరువాత దుర్గాదేవి విగ్రహం పై నిలుస్తుంది . అరుదైన ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి వేలాదిమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో భైరవకోనకు తరలివస్తుంటారు.
అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత:
పూర్వం ఈ ప్రాంతాన్ని అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత అనే ఆయన బాగా అభివృధ్ధి చేసారట. ఆయన విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణేశ్వరీమాత కొలువైవుండటానికికూడా ఆయనే కారణమని చెప్తారు. ఈ అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత శివ భక్తుడు. శివుడు ఈయనకు స్వప్నంలో దర్శనమిచ్చి నిన్ను కరుణిస్తానన్నాడట. కానీ ఎన్నాళ్ళకూ కనికరించలేదుట. అప్పుడాయన అమ్మవారితో మొరబెట్టుకున్నాడుట. అమ్మ ఆయన ఆర్తి గమనించి అన్నపూర్ణేశ్వరీ రూపాన కనిపించినదట. అలా కనిపించిన అన్నపూర్ణేశ్వరీ దేవి, నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని అడిగిందట సుబ్బయ్యతాతను. అప్పుడా భక్తుడు నాదగ్గరకొచ్చినవాళ్ళకి నేను మంచి చెయ్యాలి. అలా నాకు వరమివ్వు. నేను బతికున్నంతకాలం నీకు ఏదోవిధంగా నైవేద్యం పెడతానని చెప్పాడుట. ఆయన పరోపకార బుద్ధిని గ్రహించిన ఆ జగజ్జనని ఆయన్ని అనుగ్రహించటమేగాక అన్నపూర్ణాదేవిగా అక్కడే స్ధిరపడ్డది.
సుబ్బయ్యతాత మరణించిన తరువాత ఆ ప్రదేశం మరుగున పడిపోయింది. అలా మరుగునబడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 1949లో శ్రీ కాశీరెడ్డినాయన ద్వారా అందరికీ తెలిసింది.
కాకులు లేని క్షేత్రం :
ఈ క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం మరో విశేషం. ఇలా ఎన్నో అందాలకు, అద్భుతాలకు, మరేన్నో రహస్యాలకు నిలయం భైరవకోన. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అందమైన అద్భుతం.
ఇలా చేరుకోవచ్చు :
ప్రకాశం జిల్లా సి యస్ పురం మండలంలో కొత్తపల్లి గ్రామ సమీపంలో ఉంటుంది భైరవకోన. ఒంగోలు నుంచి భైరవకోన 124 కిలోమీటర్లు. ఒంగోలు నుంచి పామూరుకు వెళ్లి, సి యస్ పురం నుంచి భైరవకోన వెళ్లవచ్చు. సీయస్పురం నుంచి భైరవకోనకు ఆటోలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంది.