సంతానాన్ని అనుగ్రహించే హరిహర క్షేత్రము.
నరకాసుర వథ జరిగిన చోటు - సంతానాన్ని అనుగ్రహించే హరిహర క్షేత్రము.
- లక్ష్మి రమణ
నరకాసుర వథ కథా వృత్తాంతం అందరికీ తెలిసినదే . కానీ ఆ నరకాసుర సంహారం జరిగిన చోటు ఈ భువిపైన ఎక్కడున్నది ? ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు. స్వయంగా నారాయణుడు, భూదేవి కలిసి కృష్ణ పరమాత్మ , సత్యభామా దేవిగా వచ్చి నరకాసుర వథ జరిగిన ప్రాంతాన్ని గురించిన విశేషాలు చెప్పుకుంటూ ఆ క్షేత్ర దర్శనం ఈ రోజు చేద్దాం రండి .
నరకాసురుడు లోక కంటకుడైన అసురుడు . లోకాన్ని పీడిస్తున్న ఆ రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామా కలిసి వధించిన ప్రదేశం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ప్రజలందరిలోనూ సంతోషాన్ని నింపిన ఆ నరకాసుర వధ కృష్ణాజిల్లాలోని చల్లపల్లి మండలం నడకుదురు ప్రాంతంలో ఉంది. నదీతీర గ్రామమైన నదీతీర గ్రామమైన నడకుదురు ఆనాడు నరకోత్తారక క్షేత్రంగా వెలసిలింది. ఆ తర్వాత ఈ మాట నానుడిలో నరకొత్తూరు - -నడకదుర్రు నుండీ నడకుదురుగా రూపాంతరం చెందింది.
అరుదైన పాటలీ వనం ఉన్న ప్రదేశం:
నరకాసుర వథ అనంతరం శ్రీకృష్ణుడు దేవవనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటారట.ఆ పూలతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడ వెలసిన లక్ష్మీ నారాయణులని పాటలీ పుష్పాలతో అర్చించారని స్థానిక పురాణ కథనం. దానికి నిదర్శనమా అన్నట్టు పాటలీ వృక్షాలు మన దేశంలో చాలా అరుదు. కేవలం కాశి, నడకుదురు ప్రాంతాలలో మాత్రమే ఇవి కనిపించేవి. ఇప్పుడు కాశీలో కూడా పాటలు వృక్షాలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. పాటలీ వృక్షాలను వేరొకచోట నాటినా అవి పెరిగిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చాలా పాటలీ వృక్షాలు వనంలో పెరుగుతున్నాయ.
కృష్ణుడు పూజించిన నారాయణుడు :
శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణ విగ్రహాలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయి. హరి ఉన్న చోట హరుడు కూడా ఏదో రూపంలో ఉంటాడన్న నానుడికి ప్రతీకగా ఇక్కడ ద్వాపరయుగం నాటికే పరమేశ్వరుడు ‘పృథ్వీశ్వరుడుగా’ వెలిశాడు. ఆయన అలా వెలిసి ఉండడానికి కూడా కారణం నరకాసురుడే .
పృధివీశ్వరుడై వెలసిన ఈశ్వరుడు :
నరకాసురుడు ఇక్కడ ద్విముఖుడు అనే బ్రాహ్మణుడిని చంపాడు. ఆ పాపపరిహారార్థం పృధ్వీశ్వరుడికి పూజలు చేశారట. ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో ఎత్తులో ఉండేదట. కాలగర్భంలో మార్పుల కారణంగా భూమి కంటే తక్కువ ఎత్తులోకి దిగిపోయింది. ఇది మిగతా ఆలయల్లా కాకుండా పశ్చిమాభిముఖంగా ఉంటుంది. దీనికి ఎదురుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది.
పృధ్వీశ్వరుని పూజిస్తే సంతానం కలుగుతుందని స్థానికుల నమ్మకం. కార్తీకమాసంలో పూసే పాటలీ పుష్పాలతో పృధ్వీశ్వర స్వామికి పూజలు చేస్తారు. పృథ్వీశ్వరుని పూజకు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఆలయం చెంతనే ఉన్న కార్తీక వనంలో వందలాదిగా ఉన్న ఉసిరి చెట్లు వేలాదిమందికి ఆతిథ్యాన్ని ఇస్తాయి. కార్తికంలో ఇక్కడి వనాలలో సహపంక్తి భోజనాలు చేస్తారు.
ప్రశాంతమైన వాతావరణంలో అరుదైన పాటలీ వృక్షాలు , ఉసిరిక చెట్లతో నిండిన ఈ దివ్య వనంలో భోజనాలు చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు నడయాడిన చోటు , దివ్యమైన ఈశ్వరుని కరుణ పండిన చోటు ఈ నేలమీద, మన నేలమీద ఉండడం మన అదృష్టం . హైదరాబాదు, విజయవాడల నుండీ నడకుదురుకి వెళ్లేందుకు చక్కని బస్సు సౌకర్యం ఉంది . ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శించి ఆ హరిహరుల అనుగ్రహాన్ని పొందండి. శుభం .