నవగ్రహ దోషాలని తొలగించే ఉడిపీ కృష్ణాలయం .
నవగ్రహ దోషాలని తొలగించే ఉడిపీ కృష్ణాలయం .
- లక్ష్మి రమణ
కలియుగంలో కృష్ణ నామస్మరణకి మించిన తారకం మరొకటి లేదు . హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే అని స్మరిస్తూ ఉంటె , ఆ కృష్ణుడే మార్గదర్శకుడై మన జీవనావని భద్రంగా తీరం చేరుస్తారని కలిసంతరణోపనిషత్తు చెబుతోంది . అంతదాకా ఎందుకయ్యా ఆలోచన కేవలం నవ రంధ్రాల నుండీ దర్శమిచ్చే ఉడిపీ లోని కృష్ణయ్యని దర్శనం చేస్తే చాలు కలిదోషమూ , గ్రహదోషాలూ తొలగిపోతాయి . హరి - హరుడై ప్రకటితమైన దివ్య స్థలం ఇది . ఇక్కడ పరంధాముని దర్శనం నవరంధ్రాల కిటికీ ద్వారా మాత్రమే చేసుకోవాలి . ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మహిమాన్వితమైన ఆ స్వామీ దర్శనాన్ని ఈ అక్షరాల్లో చేసుకుంటూ , మదిలో ఆ పరంధాముని దివ్య చైతన్యాన్ని మనలో నింపుకుందాం రండి .
ఉడిపి కర్ణాటకలోని ఒక ప్రదేశం . సాధారణంగా ఉడిపి అనగానే మన తెలుగువారికి చవులూరించే కర్ణాటక వారి ఉడిపీ హోటళ్ళు గుర్తుకొస్తాయి . కానీ అదే ఉడిపి లో అద్భుతమైన కృష్ణమందిరం ఉంది . దీనినే పరశురామ క్షేత్రంగా కూడా పిలుస్తారు . పురాణాలు స్లాఘించిన పశ్చిమ సముద్ర తీరంలో వెలసిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమయినది. ఈ క్షేత్రవివరాలు స్కాందపురాణంలో “రజతపీఠపుర మాహాత్యమ్” అన్న పేరుతో వివరించారు .
అనంతేశ్వరుని అవతారం :
పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతుండగా ఓ సర్పం నాగలి తగిలి మరణించింది. సర్పదోషం కలుగుతుందని దుఃఖిస్తున్న రామభోజుణ్ణి, పరశురాముడు ఊరడించి, నాలుగు దిక్కులా నాలుగు నాగప్రతిష్టలను చేయమని ఉపదేశించాడు. పరశురాముని ఆదేశానుసారంగా నాలుగు దిక్కులా నాలుగు వెండి పీఠాలను స్థాపించి, వాటిపై నాగప్రతిష్టలను చేసాడు రామభోజుడు. ఆవిధంగా వెండిపీఠాలను కలిగిన స్థలమై “రజతపీఠపురం”గా ఖ్యాతికెక్కింది ఈ క్షేత్రం.
అనంతరం పరశురాముడు “అనంతేశ్వరుడు” అన్న పేరుతో, ఓ లింగరూపంలో ఈ క్షేత్రంలో అవతరించినట్టు స్కాందపురాణం వివరిస్తోంది. ఈ రకంగా విష్ణు అవతారమైన పరశురాముడు శివస్వరూపంగా మారి పూలందుకుంటున్న విశిష్ట క్షేత్రం ఇది .
మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. సంస్కృతంలో “ఉడు” అంటే నక్షత్రమని అర్థం. “ప” అంటే పతి అని అర్థం. ఈవిధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా “ఉడుప” అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం. పలుకుబడితో అది ఉడుపిగాను, ఒడిపిగాను పేరొందింది .
మధ్వాచార్యులు ప్రతిష్టించిన కృష్ణ విగ్రహం:
ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి తయారుచేయించారని విశ్వాసం . ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు, ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత సుమారు ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.
ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడుపికి సమీపంలో గల “మల్పే” అన్న ప్రాంతంలో, సముద్రతీరంలో ధ్యానతత్పరులై ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరచి చూడగా, తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. ముఖ్యవాయువు అవతారమైన మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి త్రిప్పి, తుఫానుగాలిని నియంత్రించారు. బ్రతికి బైటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దనున్న రత్నాలను సమర్పించబోయారు. వాటిని నిరాకరించిన మధ్వాచార్యులు, నౌకను సమతౌల్యంలో ఉంచడానికి వాడుతుండిన రెండు పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ ముద్దలు “గోపీచందనం”గా పిలువబడే చందనపు ముద్దలు.
సముద్రతీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యుల చేతినుండి ఒక ముద్ద జారిపడి, అందులోని బలరాముని విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం “ఒడభాండేశ్వరం”గా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఇక్కడే ప్రతిష్టించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకుని “ద్వాదశ స్తోత్రం” అనే దివ్యస్తుతిని ఆశువుగా పఠిస్తూ ఉడుపికి తీసుకువచ్చారు. అక్కడగల మధ్వసరోవరం జలాల్లో ఆ చందనపు ముద్దను ముంచగానే, అందులోనుంచి కృష్ణప్రతిమ దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణమందిరంలో అర్చామూర్తిగా పూజలందుకొంటోంది. ఈవిధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణవిగ్రహాన్ని ఉడుపిలో పునఃప్రతిష్టించారు.
ఒక చేత కవ్వాన్ని, మరొక చేత కవ్వపుత్రాడును పట్టుకుని కనిపించే బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడుపి కృష్ణమందిరంలో దర్శిస్తారు. సంసారమనే సాగరాన్ని మధించి, మోక్షమనే వెన్నెను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమా భంగిమలోని అంతరార్థం. ఇక్కడ స్వామివారిని తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శించాలి. దీనిని నవగ్రహకిండి అని పిలుస్తారు. ఇలా నవగ్రహకిటికీ నుండి సకలగ్రహ పాలకుడైన పరమాత్మ కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. నవరంధ్రాలతో కూడిన ఈ శరీర మొహాన్ని అధిగమించి పరమాత్మ చైతన్యాన్ని సందర్శించమనే అద్భుత సందేశము ఈ దర్శనంలో నిబిడీకృతమై ఉంది .
ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్ డెక్కన్ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ ఉంది.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !