కుచేలుడి అటుకులు ప్రసాదంగా దిరికితే
కుచేలుడి అటుకులు ప్రసాదంగా దిరికితే సిరిసంపదలకు లోటే ఉండదట !
- లక్ష్మి రమణ
కుచేలుడు శ్రీకృష్ణులవారి బాల్య స్నేహితుడు . అయినా, పిల్లాడికి ఆకలయితే పాలు పట్టే స్తొమత కూడా లేదాయనకి. మధురానగరికి రాజు , బాల్య స్నేహితుడైన కృష్ణుని కలిసొస్తే, ఆ దుర్భర పరిస్థితి నుండీ బయటపడొచ్చు అనుకున్నారు. కానీ కృష్ణయ్యకి ఏం కానుక తీసుకెళ్ళాలి ? కుచేలుడి భార్య ఇంట్లో ఉన్న ఇన్ని అటుకులని మూటకట్టి ఇచ్చింది . మహారాజుకి ఆ పేదవాడు ఇవ్వగలిగిన బహుమానం అదే మరి !మిత్రుడు తీసుకొచ్చిన ఆ గుప్పెడు అటుకులనే ప్రీతిగా స్వీకరించాడా పరమాత్మ. ప్రతిగా తరగని సంపదల్ని కుచేలుడికి అనుగ్రహించాడు. ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న ఆ కుచేలుని ఆలయాన్ని దర్శించి, అక్కడ ప్రసాదంగా అటుకులని పొందితే, పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. రండి ఆ ఆలయాన్ని దర్శిద్దాం .
గుజరాత్ లోని పోర్ బందర్ గ్రామంలో జన్మించారట కుచేలుడు. కుచేలుని అసలు పేరు సుదాముడు. ఆయన పేరు మీద ఆ ప్రాంతాన్ని సుదామపురి అని పిలిచేవారు. శ్రీ కృష్ణునిని లీలలు చూసి ఆనందించడానికి స్వయంగా నారద మహర్షే , మధు, కారోచన అనే దంపతులకు సుదాముడు అనే పుత్రునిగా జన్మించాడని నమ్ముతారు .
సుదామునికి ఆయన జన్మస్థలంలోనే ఒక చక్కని ఆలయం ఉంది . 12 వ 13వ శతాబ్దములలో నిర్మించిన ఈ ఆలయాన్ని గ్రామస్ధులు విస్తారపరచి, విశాలంగా కట్టి పునరుధ్ధరించారు. సుదామునికి ఉన్న ఒకే ఒక ఆలయంగా ఇది ప్రఖ్యాతి చెందింది. రాజస్థాన్ రాజవంశాలవారు దంపతులుగా వచ్చి మొదట ఇక్కడ పూజలు జరిపించడం ఇప్పటికీ ఒక సంప్రదాయంగా ఉంది .
సుధాముని ఆలయం చాలా గొప్పగా ఉంటుంది . యాభై స్ధంభాలతో నిర్మించబడిన మహామండపం తరువాత గర్భగుడి వుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 'శ్రీ సుదామపురి యాత్రా ధామ్' అని స్వాగత ద్వారం వుంటుంది. ప్రవేశ ద్వారం వద్దనే ద్వారపాలకుల విగ్రహాలు వుంటాయి.
గర్భగుడి లో సుదాముడు ఆయనికి ఎడమ ప్రక్కన భార్య సుశీల, కుడిప్రక్కన శ్రీ కృష్ణుడు ఆశీనులై దర్శనమిస్తారు. గర్భగుడికి మీదన ఉత్తర దేశ బాణీలో ఎత్తైన విమానం కనిపిస్తుంది. ఆలయానికి చుట్టూ నందనవనం, సుదాముడు వుపయోగించిన నుయ్యి వున్నాయి.
ఈ ఆలయంలో నిత్యం రాత్రి ఏడు గంటలకు సంధ్యా హారతి జరుపుతారు. ఉదయం పదకొండు గంటలకు 'దామాజీ తండుదల్' (కుచేలుని అటుకులు) అనే మహా ప్రసాదం భక్తులకు పంచిపెడతారు . ఈ ప్రసాదాన్ని స్వీకరించిన వారికి సిరిసంపదలు, కోరకున్న వరాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
తన స్నేహితునికి ఆనాడు అంతులేని సంపదనివ్వడమే కాదు, ఇప్పటికీ తరగని గౌరవాన్ని, గురుస్థానాన్ని ఇచ్చి ఉన్నతమైన ప్రతిఫలాన్నిచ్చారు పరమాత్మ . గుజరాత్ లో ఈ ఆలయం దర్శనీయ స్థానాలలో ఒకటి .
శుభం .
#sudama #kuchela #krishna #atukulu #damajitandudal
Tags: Kuchela, sudama, prasadam, atukulu, damaji tandudal, sudamapuri,