శ్రీకృష్ణుడు స్వయంగా నివసించిన చోటుని చూడాలనుకుంటున్నారా ?
శ్రీకృష్ణుడు స్వయంగా నివసించిన చోటుని చూడాలనుకుంటున్నారా ?
-లక్ష్మీ రమణ
కన్నయ్యని కన్నులనిండా నింపుకోవాలని ఎవరికుండదు ? అటువంటి మనోహర మూర్తిని ఆశించని రేపల్లె మొత్తంలోనే లేరని , అమృతకథనం భాగవతం యెంత గొప్పగా చెప్పింది ! అయినా నోటిలోనే బ్రహ్మాండాన్ని చూపిన వాడు బ్రహ్మానందాన్ని ఇవ్వలేడా ! ఆయన రూపలావణ్యం, అవతార గుణ వైశిష్ట్యం అలాంటివిమరి ! ద్వారకానగరాన్ని ముంచెత్తిన ఆ సముద్రుడు , మురళీధరుని నివాసమందిరాన్ని మాత్రం మింగకుండా వదిలేశాడు . అదే నేటి జగత్ మందిర్ లేదా ద్వారకాధీశుని దేవాలయం . రండి ఆ విశ్వకృష్ణుని దర్శించుకుని వద్దాం .
ద్వారకాపురి ఒక ఆధ్యాత్మిక సిరి:
ద్వారకాపురి ఒక ఆధ్యాత్మిక సిరి. గుజరాత్ రాష్ట్రంలో , గోమతీ నది , అరేబియా సముద్రంలో సంగమించే చోట ఉంది ద్వారకా నగరం. జీవాత్మ రుక్మిణీ మాత , ఆ పరమాత్మ యొక్క అనంత సంద్రంలో కలుస్తున్నాదా అన్నట్టుంటుంది ఈ సంగమం . ఇక్కడ సముద్రపు ఘోష కూడా ఆ నారాయణుని నామంలా తోస్తుంది. ద్వారక లోని ఈ ద్వారకాధీశుని దేవాలయాన్ని జగత్ మందిర్ లేదా విశ్వ పుణ్యక్షేత్రం అని పిలుస్తారు. ద్వారక అంటేనే, ద్వారము అనేకదా అర్థం. ఈ ద్వారము దేనికి ప్రవేశము అంటే, ఈ ఆలయం రెండు మార్గాలు చూపిస్తుంది. ఒకటి స్వర్గం , మరొకటి ముక్తి . ఇక్కడ ఈ రెండుద్వారాలూ ఉపస్థితమై ఉండడం మరో విశేషం. భక్తులు స్వర్గద్వారం నుండీ ప్రవేశించి , ముక్తి ద్వారం నుండే బయటికి వస్తారు. భగవానుడు స్వయంగా ఉన్న చోటు స్వర్గమే మరి. ఆయనని ఆశ్రయించాక ముక్తి తానంతట తానుగా వలచి వరించక మానుతుందా ?
యునెస్కో వారసత్వ సంపద:
అద్భుతమైన ఈ ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించపడుతూ ఉంది. ఈ దేవాలయం 2500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కృష్ణుని ముని మనవడు గా చెప్పబడే వజ్రనాభుని చేత నిర్మించబడిందని స్థానిక విశ్వాసం. హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) ఉన్న ప్రదేశంలో అతను ఈ ఆలయాన్ని నిర్మించారని , ఇక్కడి ప్రతి ధూళికణమూ ఆ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమైనదేనని ఇక్కడి వారు చెబుతారు . సముద్రగర్భంలో ఇప్పటికీ సజీవంగా ఉండి , నిద్దరోతున్న ద్వారకాపురిని నిర్మించిన విశ్వకర్మే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆలయం కేశవునిదైనా , శైవసంప్రదాయ నిర్మాణశైలి , శైకత శిలలపై స్పష్టంగా తెలుస్తుంటుంది . అయితే, ఈ దేవాలయం చుట్టు ఉన్న భవనాలు మాత్రం 16 వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి . అచ్చమైన చాళుక్యుల శైలి ఇక్కడి కుడ్యాలలో తెలుస్తుంటుంది . 43 మీటర్ల ఎత్తున్న దేవాలయ శిఖరం , దాని పైన సూర్య చంద్రుల చిత్రాలతో ఉన్న జండా 10 కిలో మీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి . ఈ అలయంలో లోపలి వెళ్ళడానికి బయటకు రావడానికి ఉన్న రెండు ద్వారాలనే ‘స్వర్గ ద్వార’, ‘మోక్ష ద్వార’ అని పిలుస్తారు. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి. జీవుడికి తుది గమ్యమైన మోక్షాన్ని అందించేదే మోక్షపురి.
గర్భాలయంలో నల్లనయ్య:
ద్వారకానగరి ఇప్పుడున్న విశ్వనగరాలకన్నా ఎంతో అధునాతనమైనది. అద్భుతమైన అటువంటి నగరాన్ని నిర్మించి, పాలించిన మహా చక్రవర్తి, విశ్వాచాలకునికి రూపాయలకి కొదవేముంది. ఆ రాజరాజు తలచుకుంటే, సేవలకు తక్కువేముంది ? ద్వారకానాధుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. గర్భాలయంలో నల్లనయ్య నల్లని రాతివిగ్రహంలో సుమారు 2.25 అడుగుల ఎత్తుతో నయనానందకరంగా , నవనీత హృదయునిగా దర్శనమిస్తారు . రోజులోని సమయంతో పాటు, తన వస్తధారణని మార్చడం తద్వారా ఆయారూపాలలో ఆకట్టుకోవడం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్యాకదా!
సమయానుగుణమైన దర్శనలకు తగినట్లు వస్తధ్రారణలో మార్పులు జరుగుతుంటాయి. ఈ దర్శనాలు వల్లభాచార్యుల చేత వ్రాయబడిన పుష్టి మార్గాంలో నిర్దేశించిన విధంగా జరుగుతాయి. అవే మంగళ, శృంగార్, గ్వాల్, రాజభోగ్, ఉథాపన్, భోగ్, సంధ్యా ఆరావళి, ష్యాన్. 5 అంతస్తుల ఈ ఆలయం లైమ్‌స్టోన్ ఇంకా ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్న జెండాని ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేయడం విశేషం . ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి మరియు సత్యభామాదేవి ఆలయాలు ఉన్నాయి. బెట్ ద్వారకా ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.
సముద్రగర్భంలో ద్వారక :
శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసిపోయింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, అలాగే మునుల శాపప్రభావాన, తమలోతాము కలహించికొని నిశ్శేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్ధం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ, బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించారు. మరునిమిషం ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరాన్ని దాటిన యాదవులు ద్వారకానగరం సముద్రజలాల్లో మునిగిపోవడం వెనుతిరిగి చూసి హాహాకారాలు చేసారు.
అర్జునుడు ఈ విషయం హస్థినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారకానగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకానగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తనజలాల్లో ముంచివేసింది. అందమైన భవనాలు ఒకటి తరువాత ఒకటి మునగడం నేను కళ్ళారా చూసాను. అంతా మునిగి పోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒకసరస్సులా ఆ ప్రదేశం కనిపించింది. అక్కడ నగరం ఉన్న జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్థావించింది. ఇలా ద్వారకానగరం సముద్రగర్భంలో కలసిపోయి అంతటితో ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియగానికి నాంది పలికాడు.
ఈ హరి నివాసం మాత్రం నిలిచి ఉంది . అక్కడే ద్వారకాధీశుని ఆలయం నెలకొంది. మన పుణ్యవశము చేత ఆ స్వామీ నడయాడిన స్ధలంలో అడుగుపెట్టి , అక్కడి స్వామిని దర్శించుకోగల్గుతున్నాం. ఇక్కడి స్థలమహాత్యాన్ని గుర్తించి, ఆది శంకరాచార్యులవారు ఇక్కడ ద్వారకాపీఠాన్ని స్థాపించారు . దీన్నే కాళికాపీఠం అనికూడా అంటారు .
బెట్ ద్వారక:
బెట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీకృష్ణుని ఆలయలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపారం, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మరియు మతప్రధానమైన కేంద్రం శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసించబడుతుంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి.
చార్ధామ్ లలో ఒకటి :
హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకలోని శ్రీకృష్ణ ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ద్వారకాపురి సమీపంలోనే జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది.
వీలయితే, తప్పకుండా ద్వారకాధీశుని ఆలయ దర్శనం చేసుకోండి. శుభం .