అక్కడ క్షేత్రయ్య గళం పలికింది
అక్కడ క్షేత్రయ్య గళం పలికింది . స్వామి కరుణ వెన్నెలై కురిసింది
-లక్ష్మీ రమణ .
దక్షిణ భారతంలో ఉన్న కృష్ణుని ఆలయాలలో ప్రసిద్ధమైనది మొవ్వ గోపాలస్వామి ఆలయం . కృష్ణాజిల్లా ‘కూచిపూడి’ అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు! అక్కడ క్షేత్రయ్య గళం పలికింది . నాట్యకారుల పదం కలిసింది . స్వామి కరుణ వెన్నెలై కురిసింది . రండి ఆ గోపాలుని చల్లని కాంతిలో కాసేపు సేదతీరుదాం .
స్వయంవ్యక్తమైన మువ్వ గోపాలుడు :
పూర్వం ఈ ప్రాంతము కృష్ణా నదీ పరీవాహక క్షేత్రం. ఇక్కడ మౌద్గల్య మహర్షి తపస్సు చేస్తూ వుండేవారుట. ఆయనకి కృష్ణా నది ఒడ్డున ఇసుక దిబ్బల్లో ఈ వేణు గోపాల స్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహ విశేషాలేమిటంటే, శిలాకృతిలోనే, స్వామి వెనుక వున్న మకరతోరణం, దానిపైన ఉన్న దశావతారాలు, ఆయన ప్రక్కన రుక్మిణీ సత్యభామలు. చేతిలో ఉన్న వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం సైకత (ఇసుక) విగ్రహం కావటంతో అభిషేకాలు చేసేటప్పుడు కాళ్ళ దగ్గర కొచెం తరుగు ఏర్పడింది. దీంతో 2000 సంవత్సరంలో అదే ఆకారంలో వున్న పెద్ద విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని వెనుక ఒక హాల్లో వుంచారు.
మనోహరుడైన మురళీలోలుణ్ణి చూసిన గోపికా హృదయాలు రావాళించవా ? ఆయన పరమాత్మ. స్త్రీపురుషుల తేడాలేకుండా, జీవులన్నీ జీవాత్మలైన గోపికలు కదా ! ఆ స్వామీ సన్నిధిలో కూచిపూడి గజ్జె ఘల్లుమన్నది . క్షేత్రయ్య వంటి మధురగాయకుని గళం తీయని పదాలు ఆలపించింది . అది ఆ కన్నయ్య కృపాకటాక్ష వీక్షణమే . మువ్వ గోపాలుని గురించి చెప్పుకునేప్పుడు తప్పకుండా క్షేత్రయ్య గురించీ చెప్పుకోవాలి . లేకపోతె, ఆ కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది .
క్షేత్రయ్యగా మారిన గోపయ్య :
చాలా కాలం క్రితం వరదయ్య అనే గోవుల కాపరి గోవులను కాచుకుంటూ వచ్చి రోజూ ఈ విగ్రహం దగ్గర కూర్చుంటూ వుండేవాడుట. అతనికి చదువు సంధ్యలు ఏమీలేవు. ఒక రోజు అతనికి మువ్వ గోపాలుని విగ్రహానికి పూజలు చేయాలనిపించింది . అప్పటినుంచీ తనకు తోచిన విధంగా రోజూ పూజ చేసేవాడుట.
ఒకసారి వేణు గోపాల స్వామి వరదయ్యకు కనిపించి నువ్వు కారణ జన్ముడవు. ఇక్కడ గోవులు కాయటం కాదు నువ్వు చెయ్యాల్సిన పని, నా గురించి ప్రచారం చెయ్యమన్నాడుట. దానికి వరదయ్య నాకు చదువూ సంధ్యా ఏమీ రాదు. నేను నీ గురించి ఏమి ప్రచారం చెయ్యగలను అని అడిగాడుట. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఆ దేవ దేవుడే తలచుకుంటే చదువులకు కొదవా. వెంటనే స్వామి వరదయ్యని నాలుక చాపమని, అతని నాలుకమీద బీజాక్షరాలు వ్రాశాడు. దానితో వరదయ్య దశ తిరిగింది. ఆయన గొప్ప పండితుడై వేణుగోపాల స్వామి మీద అనేక పాటలు వ్రాశాడు. అవ్వే క్షేత్రయ్య పదాలుగా ప్రసిధ్ధికెక్కాయి. ఇక్కడి దేవదాసీలు ఆ పదాలకు పాదం కలిపి ఈ ఆలయ ప్రాంగణం లో అద్భుతంగా నాట్యం చేసేవారట . ఆ ఆనవాళ్ళని, అప్పటి నర్తకీమణుల చిత్రాలనీ ఇక్కడ ఇప్పటికీ మనం సందర్శించవచ్చు .
వరదయ్య ఈ పదాలు పాడుకుంటూ యాత్రలు చేసేవారు . ఆయన వ్రాసిన పదాలు మధుర భక్తి రసభరితాలు. తననే ఒక గోపికగా వూహించుకుని, ఆ మొరళీలోలునిలో ఐక్యమయ్యేందుకు తపించే భక్తుని ప్రేమనిండిన, హృదయ మందారాలు’. స్వామిమాటమీద ఆయన కీర్తిని వ్యాప్తిస్తూ ,వరదయ్య తమిళనాడుకెళ్ళి అక్కడ వరదరాజ స్వామిని సేవిస్తూ అక్కడే వుండిపోయాడు. వరదరాజ క్షేత్రంలో వుండటంతో ఆయనకి క్షేత్రయ్య అనే పేరు వచ్చింది.
మొవ్వగోపాలుని ఆలయంలోని ఉపాలయాలు :
ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది. స్వామివారి కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో సంజీవని ఉంటాయి. ఒకపక్క కోరుకున్న వరాలను అందిస్తూనే, మరోపక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతులలో ఖడ్గమూ, సంజీవనీ రెండూ కనిపిస్తాయి.
మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుంది అని చెప్పేందుకు క్షత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. ఇక్కడి గోపాలుడు దయాళువు. జ్ఞాన సింధువు . సైకత రూపంలో ఉన్న కరుణాతరంగుడు . మరెందుకాలస్యం! ఒకసారి వీలు చూసుకుని మొవ్వకి వెళ్లరండి. విజయవాడ నుంచి మొవ్వ కేవలం 50 కిలోమీటర్లే!!!