గురుగ్రహ దోషాలు తొలగించే బృహస్పతి ఆలయం .
గురుగ్రహ దోషాలు తొలగించే బృహస్పతి ఆలయం .
లక్ష్మీరమణ
గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించేవాడు . అంతటా శుభాన్ని, అనుగ్రహాన్ని వర్షించేటటువంటి వాడు . గురుగ్రహం అనుగ్రహం వుంటే అన్నిటా విజయం సిద్దిస్తుంది. అలాంటి అనుగ్రహ ప్రదాయకుడు దేవగురువు బృహస్పతి . ఆయనకీ ప్రత్యేకమైన ఆలయం తమిళనాడులో ఉంది . ఎన్నో విశేషాలకూ దర్శనం చేద్దాం పదండి .
అలంగుడి – తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బృహస్పతి లేదా గురు గ్రహం ప్రధాన దైవంగా నిర్మించిన నవగ్రహ ఆలయాలలో ఒకటి.
ఇక్కడ ప్రధాన దైవం పరమేశ్వరుడు . ఆయన్ని ఇక్కడ ‘ఆపత్సహాయేశ్వర్’ అని పిలుస్తారు . అలా పిలవడానికి ఆపద సమయంలో ఆదుకున్న ఆ శివుని కథే నేపధ్యం . ఆయనకీ తోడుగా ఇక్కడ నిలిచినా అమ్మ ఉమా దేవిని ‘ఏలావర్కుళలి’ లేదా ‘ఉమై అమ్మాయి’ అని పిలుస్తారు. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం నుండీ ప్రపంచాన్ని రక్షించడానికి పరమేశ్వరుడు విషాన్ని , మ్రింగి దాన్ని తన కంఠంలో నిలిపి, నీలకంఠుడయ్యారు . అలా ప్రపంచాన్ని రక్షించడం వలన ఆయనకీ “ఆపత్సహాయేశ్వర్” అంటే “రక్షకుడు” అని పేరొచ్చింది. అదే రూపంలో ఆయన ఇక్కడ ఆకొలువయ్యారు . ఇక ఈ ప్రదేశం ‘అలంగుడి’ గా ప్రసిద్ధిచెందింది.
సుందరమూర్తి కథ :
తిరువారూర్ ని చోళరాజులు పరిపాలించే కాలంలో ఒక రాజుగారు, ఆలంగుడి కోవేలని దర్శించుకొని అక్కడ వున్న సుందరమూర్తి అందమైన విగ్రహాన్ని చూసి మనసు పడి తిరువారూర్ తీసుకొని వెళ్తాడు . ప్రధాన పూజారి తిరిగి విగ్రహాన్ని ఆలంగుడి తెచ్చేందుకు మారు వేషంలో తిరువారూర్ వెళ్లి సుందరమూర్తి విగ్రహాన్ని వస్త్రాలలో చుట్టి వుయ్యాలలో తీసుకోని వస్తుండగా రాజబటులు తనిఖీ చేస్తూ వుంటే పూజారి తన బిడ్డకు మసూచి సోకిందని అందుకు బిడ్డను కప్పి అరణ్యం లోకి తీసుకొని పోతున్నానని చెప్తాడు . మసూచి ( స్మాల్ పాక్స్ ) అంటురోగం కాబట్టి రాజభటులు విగ్రహం వున్న ఉయ్యాలను తనిఖీ చెయ్యకుండా పంపించేస్తారు . పూజారి ఆలంగుడి కోవేలకి చేరిన తరువాత వస్త్రములు తొలగించి చూడగా విగ్రహానికి మసూచి మచ్చలు వుండటం చూచి ఆశ్చర్య పడతాడు . యిప్పటికి విగ్రహం పైన యీ మచ్చలు చూడొచ్చు .
ఆముదాకారుని కథ :
పూర్వం ముచుకంఠ చక్రవర్తి దగ్గర అముదాకరుడు అనే ఆపత్సహాయేస్వరుని భక్తుడు మహా మంత్రి గా వుండేవాడు. ఆతను పూనుకొని యీ కొవెల కట్టించి అనంతమైన పుణ్యం సంపాదించారు. అది తెలుసుకున్న ముచుకంఠ చక్రవర్తి ఆ పుణ్యం లో సగం తనకు ధార పొయ్యమని కోరాడు . అముదాకరుడు అంగీకరించలేదు . ఆగ్రహించిన చక్రవర్తి మహామంత్రిని హతమారుస్తాడు . చక్రవర్తిననే అహంకారంతో వున్న చక్రవర్తికి ప్రతీ రోజు యీ కోవెల లోంచి ' అముదాకరా ' అనే పిలుపు ప్రతిద్వనించి వినిపిస్తూ ఉండేదట . ఆ ప్రతిద్వనితో భయకంపితుడైన చక్రవర్తి , ఆపత్సహాయేశ్వరుని శరణు వేడుకొని అతని భక్తుడుగా మారుతాడు , తరువాత ఆ ధ్వనులు వినిపించలేదుట .
కలంగమల్ కట్థ వినాయకుని కధ:
వినాయకుడు యీ ప్రదేశంలో గజముఖాసురుడిని వధించారు. అందుకు యీ వినాయకుడిని కలంగమల్ కట్థ వినాయకుడు అని అంటారు. యిక్కడ పార్వతీ దేవి శివుని వివాహం చేసుకోవాలనే సంకల్పం తో తపస్సునాచరించి శివుని మెప్పు పొందిందిట . అందుకని యిక్కడ పుణ్య స్త్రీ లు శుక్రవారము నాడు తమ మాంగల్యానికి వుండే పసుపు తాడును మార్చుకుంటే వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది అని పార్వతీదేవి వరమిచ్చారని స్థల ఐతిహ్యం .
యీ కోవెల ప్రాంగణం లో యివి కాక , సప్తలింగాలు , వీరభద్రుడు , ముచుకంఠుడు , కాశీవిశ్వనాథుడు , విశాలాక్షి , కుమారస్వామి , తిరువక్కరసు , చంద్రుడు , సూర్యుడు మొదలయిన దేవతా మూర్తులు కొలువై ఉన్నారు .
బృహస్పతి :
ఇక్కడికి వచ్చేవారు శివుని అనుగ్రహంతో పాటుగా, గురుగ్రహ అనుగ్రహాన్ని పొందడం కోసం, గురుదోషం తొలగించుకోవడం కోసం వస్తూ ఉంటారు . బృహస్పతి / గురు గ్రహం (జుపిటర్ గ్రహం) దోష పరిహార పూజలని నిర్వహిస్తుంటారు . ఈయన అనుగ్రహ దృష్టివల్ల వర్షాలు బాగా కురుస్తాయని, దురదృష్టం పోయి, అదృష్టం ఆనుగ్రహిస్తుందని విశ్వశిస్తారు .
మిగిలిన గ్రహాలకూ కోవెలలు :
సమీపంలోనే మిగిలిన 8 గ్రహాలకీ కూడా ఆలయాలు ఉంటాయి . తిరునల్లార్ (సాటర్న్ లేదా శని), కన్జనూర్ (వీనస్ లేదా శుక్రుడు), సూర్యనార్ కోయిల్ (సన్ లేదా సూర్యుడు), తిరువెంకడు (మేర్క్యూరి లేదా బుధుడు), తిరునాగేశ్వరం (రాహువు), తిన్గలూర్ (మూన్ లేదా చంద్రుడు), కీజ్పెరుమ్పల్లం (కేతువు) అలంగుడికి సమీపంలో ఉన్నాయి .
అలంగుడి చేరుకోవడం ఇలా :
అలంగుడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబకోణం ప్రధాన రైల్వే స్టేషన్, నీదమంగళం మరో రైల్వే స్టేషన్. యాత్రీకులు కుంబకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో అలంగుడి చేరుకోవచ్చు.