అద్భుతాలకు ఆలవాలం ఈ కేదారేశ్వర ఆలయం !!
అద్భుతాలకు ఆలవాలం ఈ కేదారేశ్వర ఆలయం !!
- లక్ష్మి రమణ
ఆలయంలోని గోముఖం నుండీ నిరంతరం ప్రవహించే నీరు .
ఎంతతిన్నా క్షణంలో జీర్ణంచేసే ఔషధ తీర్థం .
నిశీధిలో అశ్వాల డెక్కల శబ్దం
కాలునికి చుట్టుకొనే కాలనాగులు
ఇవన్నీ కేదారేశ్వరుని ఆలయ అద్భుతాలు .
కేదారేశ్వర స్వరూపంలో శివుణ్ణి ఆరాధించడం వలన స్త్రీలకి సౌభాగ్యాలు , పతి ఆదరాభిమానాలూ మెండుగా లభిస్తాయన్నది తెలుగువారికి తెలిసిన విషయమే . అయితే, కేదారేస్వర వ్రతం మాత్రమే కాకూండా మన దేశంలో అనేకానేక కేదారేస్వర ఆలయాలున్నాయి. మహిమాన్వితమైన ఈ ఆలయాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు . అటువంటి ఒక దేవాలయం మధ్యప్రదేశ్లో ఉంది.
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో పొహ్రీ అనే ఊరుంది . ఈ ఊరిలో సర్కులా నది ప్రవహిస్తూ ఉంటుంది . ఎత్తయిన కొండలు, పరుచుకున్న ప్రక్రుతి సౌందర్యం మధ్య పరమేశ్వరుడు స్వయంభువై వెలిసి ఉన్నారు . ఒక భక్తునికి కలలో కనిపించి తానూ కొండల మధ్య వెలిసి ఉన్నానని, ఆలయాన్ని నిర్మించవలసిందని ఆ కేదారేశ్వరుడు ఆదేశించారు . ఆ కలలో సూచించిన విధంగా కొండని తవ్వి చూడగా కేదారేశ్వరుడు దర్శనం ఇచ్చారు. ఇది దాదాపు 500 ఏళ్ళకి పూర్వం జరిగిన ఉదంతం . అప్పటినుండీ ఇక్కడ కేదారేశ్వరునికి నిత్యపూజలు, అభిషేకాలు , ప్రత్యేకపూజలూ జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న కేదారేశ్వర ఆలయాన్ని 16 వ శతాబ్దంలో పోహ్రీని పరిపాలించిన రాజు నావల్ఖండేరావ్ నిర్మించారు. పర్వతం నుండీ జాలువారే నీటి ప్రవాహం శివలింగానికి క్షణక్షణమూ అభిషేకాలు చేస్తుంటుంది . అంతకు ముందర బుధి పొహ్రి అనే ప్రదేశంలో ఈ కేదారేశ్వరుడు పూజలందుకునేవారిని ఇక్కడి పూజారులు చెబుతారు.
ఒకవైపు గడియగడియకి గంగతానాలు సహజంగా జరుగుతూ ఉంటె, మరోవైపు ప్రధాన ఆలయానికి సమీపంలో ఒక నీటి కొలను ఉంటుంది. ఇది ఏ కాలంలోనూ ఎండిపోదని స్థానికులు చెబుతారు . సహజమైన జలతో స్వచ్ఛంగా ఉండే ఈ నీటిని ఆలయంలో పూజల కోసం ప్రజలు ఈ కొలను నుండి తీసుకువెళతారు.
ఆలయం చుట్టూ ఉన్న కొండ ఒక ఔషధీయ బాండాగారం అని చెప్పాలి. విలువ కట్టలేని ఎన్నో ఔషధాలు, మూలికలు ఈ కొండ మీద లభిస్తాయి. ఈ ఆలయం దిగువకి దిగి వెళ్ళినప్పుడు, గంటల శబ్దం వినబడుతుంది. ఎవరో ఆహ్వానించినట్టు అనిపిస్తుంది . కానీ ఆలయం లోకి వెళ్ళినప్పుడు అక్కడ అటువంటి శబ్దాలు, గంటల మోతలు ఏమీ వినబడకపోవడం ఒక విచిత్రమైన విషయం .
చీకటి పడే సమయానికి ఈ ఆలయంలో ఎవరూ ఉండరు. అర్ధరాత్రి గుర్రాల శబ్దం వినిపిస్తుంటుంది . అంతే కాదు, నాగేంద్రుడు ఇక్కడి కేదారుణ్ని చుట్టుకొని భక్తులకి దర్శనం ఇస్తుంటారు. సాధారణంగా మానవుల శబ్దం విన్న తర్వాత ఆ సర్పం అదృశ్యమవుతుంది. కానీ నాగేంద్రహారాన్ని ధరించి ఉన్న కేదారేశ్వరుని దర్శనం జన్మజన్మల అదృష్టమని భక్తుల విశ్వాసం .
పితృదేవతలకు మహాలయపక్షాలు, పుణ్య తిథులలో ప్రజలు ఈ కొలనులో ఆర్ఘ్యం ఇస్తారు. ఇక ఇక్కడి గోముఖ తీర్థం మరో అద్భుతం . కేదారేశ్వరునికి సమీపంలోనే ఈ తీర్థం ఉంటుంది . ఈ తీర్థంలోని నీటిని సేవిస్తే, ఒక వ్యక్తి ఎంత ఆహారం తిన్నా, వెంటనే జీర్ణమైపోతుందట.
ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి అనిపిస్తోంది కదూ ! కేవలం మహిమాన్విత ఆలయమే కాదు, ప్రక్రుతి ఒడిలో కాసేపు హాయిగా సేదతీరాలి అనుకునేవారు కూడా ఈ ప్రాంతాన్ని, చుట్టుపక్కల ఉన్న విహార స్థలాలని ఎంపిక చేసుకోవచ్చు . కేదారేశ్వరుని మహిమని చాటుతున్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి .
శుభం !!