ఈ వీరభద్రుని ఆలయంలోని శక్తి దేవతల దర్శనం
ఈ వీరభద్రుని ఆలయంలోని శక్తి దేవతల దర్శనం శుభం, సంతాన ప్రదాయకం .
- లక్ష్మి రమణ
వీరభద్రుడు రుద్రాంశ సంభూతుడు. శివ దీక్షా దక్షుడు . సాక్షాత్తూ శివ స్వరూపుడు. ఆయన కోపమైనా , కరుణా తరంగమైనా అపారమే . ఒక్కసారి భక్తిగా మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, వెంట నిలిచి భద్రంగా రక్షించే రక్షకుడు వీరభద్రుడు . వీరభద్రుని క్షేత్రాలు స్వామి స్వయం వ్యక్తమైనవి కొన్ని, ప్రతిష్టించినవి కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ మనం దర్శించే క్షేత్రంలో ఆయనే స్వయంగా వచ్చి, భక్త సంరక్షణార్థం స్తాణువై నిలిచి దర్శనమిచ్చి , అనుగ్రహిస్తున్నారు . అది కూడా భద్రకాళీ సమేతంగా !! ఈ క్షేత్రంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించి , అర్చిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి . ఎన్నో ప్రత్యేకతలున్న ఈ వీరభద్రుని క్షేత్రాన్ని దర్శిద్దాం రండి .
తూర్పు గోదావరి లోని ఏలూరుకు సమీపంలో ఉన్న పోలవరం మండలం పట్టిసీమ శివక్షేత్రంగా పేరొందింది. రాజమండ్రి నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో పోలవరానికి దగ్గరగా గోదావరి మధ్యలో వెలసిన అద్భుతమైన దేవాలయమిది. ఇక్కడున్న ప్రధాన లింగ మూర్తి శ్రీ వీరభద్రేశ్వర స్వామి. సతివియోగాన్ని భరించలేక పరమేశ్వరుడు తన జటాజూటము నుండీ సృష్టించిన విధ్వంసకారుడు, ఆగ్రహోదగృడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడే స్వయంగా లింగమై ఇక్కడ ఆవిర్బవించారని స్థలపురాణం చెబుతుంది .
స్థలపురాణం ప్రకారం పిలవని పేరంటానికి వెళ్లిన సతీదేవి, తన తండ్రి చేసిన శివ నిందను, శివ దూషణను , శివ అపరాధాన్ని భరించలేక యోగాగ్నిలో దగ్ధమవుతుంది. అప్పుడు శివుడు ఆగ్రహంతో తాండవం చేస్తూ తన శిరస్సు నుంచి ఒక జటను తీసి నేలకేసి కొడతారు. దాని నుంచి భీకరమైన ఆకారంతో ఆవిర్భవించిన స్వరూపమే వీరభద్రుడు. ఆయన అమితమైన రౌద్రంతో ఎగసిపడుతూ ప్రమధ గణాలతో దక్షయాగం జరుగుతున్న చోటికి వెళ్లి, పట్టసమనే ఆయుధంతో దక్షుడి శిరస్సును ఖండించి వేశాడు. ఆ విధ్వంస కాండ తర్వాత తన చేతిలోని పట్టసాన్ని నేటి పట్టిసీమ ప్రాంతంలో గోదావరి నదిలో కడిగారు. ఆ ఆయుధం పేరు మీదగాని ఈ ప్రాంతానికి పట్టిసీమ అనే పేరొచ్చిందని చెబుతారు .
ఇక్కడ కొండపైన భద్రకాళితో సహా లింగ రూపంలో కొలువయ్యాడని నాటి నుంచి వీరేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నడని ప్రతీతి. అలా స్వయంగా వీరభద్రుడే లింగస్వరూపంగా ఇక్కడ ఆవిర్భవించాడు.
దక్షయజ్ఞ నాశనం తర్వాత వీరభద్ర స్వామి మహా ఉగ్ర మూర్తిగా ఉన్నప్పుడు, ఆగస్త్య మహర్షి ఆ స్వామిని ఆ లింగనం చేసుకుని, అనునయించి, శాంతింప చేసిన స్థలం కూడా పట్టిసీమలోని ఈ ఆలయ ప్రాంతమే అని స్తానిక విశ్వాసం.
స్వామి వారు లింగాకృతుడై నిలిచిన వీరభద్రేశ్వరుడు అయితే, అమ్మవారు భద్రకాళి. ఈ ఆలయంలో ఉన్న అరీశ్వరి, పురీశ్వరి దేవతలను పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
గోదావరి నది ఎంత ఉధృతంగా ఉన్న నదీ గర్భంలో ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవోపేతంగా ఉంటాయి . అప్పుడు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు, అందమైన గోదావరి నదిలో నిర్వహించే తీరు చూసి తీరాల్సిందే గానీ మాటల్లో వర్ణించడానికి వీలు కాదు .
శివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పట్టిసీమ గ్రామం నుంచి గోదావరి మధ్యలో వున్న ఈ ఆలయం చేరాలంటే రెండున్నర కిలోమీటర్ల దూరం ఇసుకలో నడవాలి. ఇసుకలో అడుగులు వేగంగా పడవు.
అందువల్ల పోలవరం మండల చౌక దుకాణాల డీలర్ల సంఘం ఆధ్వర్యంలో వేలాది సంచులు సేకరించి గుడివరకు ఇసుక బస్తాలతో దారి ఏర్పాటు చేస్తుంటారు. భగవంతుని దర్శనానికి ఈ విధంగా ఆ వర్తకులు అందించే సేవ విలువ ఈ దివ్యాలయాన్ని దర్శించే భక్తులకి బాగా అర్థం అవుతుంది .
ఈ విధంగా వెళ్లొచ్చు: రాజమండ్రి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో పోలవరానికి దగ్గరగా ఈ క్షేత్రం ఉంది. రాజమేండ్రికి అన్ని ప్రధాన నగరాల నుండీ బస్సు, రైలు సౌకర్యాలున్నాయి.
శుభం !!