మిస్టరీలుగా మారిన కొన్ని శివాలయాలు!

సైన్స్ కి కొరుకుడుపడని మిస్టరీలుగా మారిన కొన్ని శివాలయాలు!
- లక్ష్మి రమణ
పరమేశ్వరుడు ప్రకృతిని హృదయంగా ధరించినవాడు. ఆయన స్యయంగా వ్యక్తమైన చోట ఆమె పరవశించి ఉండడం సహజమైన విషయమే కదా ! అయితే, ఆయన చేసే లీలలు మాత్రం కొన్ని సార్లు చిత్రంగా, సామాన్య ప్రకృతికి అతీతంగా ఉండడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భక్తి భావాన్ని వికసింపజేసి ఆధ్యాత్మిక సౌరభాలని జగతిన నింపి ఈ జగతిని తనవైపు నడిపించడమే ఆ పరమేశ్వరుని ఈ ప్రవర్తనకి కారణం కావొచ్చు. నేటి శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ప్రశ్నలుగా , సైన్స్ కి కొరుకుడుపడని మిస్టరీలుగా మారిన అటువంటి కొన్ని శివాలయాలు వివరాలు ఇక్కడ మీకోసం .
1. మహానంది క్షేత్రంలో శివలింగం అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. అంత స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీరు . విశేషం ఏంటంటే, ఎంత చలికాలంలో నైనా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
2. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. గంగాధరుడైన స్వామి అన్ని గ్రామాల దాహార్తిని స్వయంగా నిలిచి తీరుస్తున్నారు.
3. ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ బుగ్గ రామేశ్వరాలయం ఉంది . ఈ ఆలయంలో శివలింగం నుండి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది.
4. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు. ఇది నిజంగానే ఒక ఆశ్చర్యకరమైన విశేషం .
5. అలంపూర్ లోని బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, ఆ అనంత జలరాశి లయకారుడిలో జీవుడు లయమయినట్టే మాయమవుతుంది . అంత నీరు ఎటుపోతుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు .
6. వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడిలో సంగీత స్తంభాలు ఉన్నాయి . ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. అప్పటి మన శిల్పులకు రాళ్ళని కరిగించి పోతపోయగలిగిన సాంకేతికత తెలుసేమో అనే అనుమానం ఇక్కడి శిల్పాలని , వాటిలో దాగిన సాంకేతికతని చూస్తే తప్పక కలుగుతుంది .
7. భీమవరంలో సోమేశ్వరుడుగా పరమేశ్వరుడు కొలువయ్యారు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు.
8. కోటప్పకొండ సినిమా పాటల ద్వారా బాగా ప్రాచుర్యాన్ని పొందింది . కానీ నిజానికి ఈ క్షేత్రం మహా మహిమాన్వితమైనది . అందుకు నిదర్శనం చుట్టూ చెట్లున్నా ఒక్క కాకి కూడా ఇక్కడ కనిపించదు . కాకులు ఇక్కడ వాలవు. పైగా ఎటుచూసినా కూడా 3 శిఖరాలు కనిపిస్తాయి
9. గుంటూరు జిల్లా చేజర్లలోని పరమేశ్వరుని పేరు కపోతేశ్వరుడు. ఈ స్వామి లింగస్వరూపానికి దక్షిణ భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
10. బైరవకొనలోని శివాలయం ఒక విశేషమైన ఆలయం . ఇక్కడికి కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా , అది గుడిలోకి నీరురాదు.
11. యాగంటి బసవన్న రోజురోజుకు పెరుగుతూ ఉంటాడు.
12. కర్నూలు జిల్లా సంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది. చెక్కలింగము అన్ని నెలలు నీళ్ళల్లో ఉన్నా రవ్వంతైనా జంకదు. అద్భుతమైన తేజస్సుతో దర్శనమిస్తుంది .
13. అమర్ నాద్ లో శ్రావణ మాసంలో స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
14. కర్ణాటకలోని శివగంగలోని శివలింగంపై నెయ్యి వుంచితే, అది దాని పూర్వరూపమైన వెన్నగా మారుతుంది . ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
15. మహారాష్ట్రలో కౌపీనేశ్వర దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
16. కంచిలో అమ్మవారు స్వామిని అర్చించిన మామిడిపండ్లని ఇచ్చిన చెట్టు ఇంకా ఉంది . దాని వయస్సు 4000 సంవత్సరాలు.
17. తమిళనాడు తిరు నాగేశ్వరము మరో విశేషమైన క్షేత్రం . ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే, ఆ పాలు నీలంగా మారుతాయి.
18. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నెరౌ అనే ప్రాంతంలో ఉన్న కిన్నెర కైలాసము లో ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు.
కేవలం ఇవేనా ఆ శివుని లీలా విశేషాలు ? ఇంకా ఎన్ని ఎన్నెన్నో !! ఇప్పుడున్న సైన్స్ కి పరీక్ష పెడుతూ, అప్పటి మన ఋషులు దర్శించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరూపిస్తూ ఆ పరమాత్మ లీలలు . భావన చేసి, భక్తిగా నమస్కరిస్తే చాలు. అనంత అమృత ధారలతో ఆ దేవదేవుని అనుగ్రహం మీ సొంతం అవుతుంది .
శుభం !!