ఆ యక్షిణి చేతిలో దీపం భూమికి తాకిందా ఇక యుగాంతమే
సంకల్పసిద్ధిని ఇచ్చే క్షేత్రం , పిల్లలని రక్షించే దేవత !! ఆ యక్షిణి చేతిలో దీపం భూమికి తాకిందా ఇక యుగాంతమే !!
- లక్ష్మి రమణ
ఉత్తరాఖండ్లోని కుమార్ కొండల నడుమ జోగేశ్వర్ క్షేత్రం ఉంది. జగదీశ్వర్ లోయలో జాగేశ్వర్ ధామ్ గా కోటి దేవదారు వృక్షాల నడుమ ఈ క్షేత్రం ఉంది. సృష్టిలో మొట్టమొదటి శివలింగాన్ని దేవతలు ఋషులు కలిసి ఇక్కడే ప్రతిష్టించారట. మృత్యుంజయేశ్వరునిగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామికి అభిషేకం చేసుకుంటే, దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు షష్టి మాత ఈ దేవిని దర్శించి, పూజించిన వారికి సంకల్ప సిద్ధి కలుగుతుందని చెబుతారు. షష్టి దేవి చిన్న పిల్లలను రక్షించేటటువంటి దేవత. కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే, పిల్లలకు శుభాలు జరుగుతాయి. అపమృత్యు భయాలు తొలగిపోతాయి.
ఇక్కడ ఒక గుండం ఉంటుంది. దీన్ని బ్రహ్మగుండం అంటారు బద్రిలోని బ్రహ్మ కపాలం నుంచి ఇక్కడికి నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి ఇక్కడ ఉన్న బ్రహ్మ పాదాలకి అభిషేకం చేసుకుంటారు. భక్తులు బ్రహ్మగుండంలో స్నానం చేస్తే, మోక్షం వస్తుందని విశ్వాసం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 100కి పైగా ఆలయాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగం.
ఈ జ్యోతిర్లింగం గుజరాత్ లో ఉన్నదని అంటున్నారు కానీ అసలైన జ్యోతిర్లింగం జగదీశ్వర్ లోనిదే అని కొంతమంది వాదన. పూర్వకాలంలో అడవులు గుట్టలు దాటి రావడం కష్టం. కనుక గుజరాత్ లోని దారుక వనంలో శివలింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగంగా అర్చించారు. కానీ అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని, అసలైన ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే జాగేశ్వర్ కి వెళ్లాల్సిందే! ఇక్కడ విగ్నేశ్వరుడు, శివపార్వతులు ఏకశిలలో కనిపిస్తారు. ఇలాంటి శిల్పము భారతదేశంలో ఇది ఒక్కటే.
అన్నపూర్ణాదేవి ఆలయం, నవదుర్గ ఆలయం, దండేశ్వర ఆలయం, కుబేర ఆలయం మొదలైన ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. శనిని తన కాళ్ళ కింద తొక్కి పెట్టినట్టుగా దక్షిణాభిముఖుడై ఉన్న హనుమంతుడిని ఇక్కడ మనం దర్శించవచ్చు.
ఆంజనేయుడు ఇప్పటికీ సప్తస్థలాలలో సంచరిస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం. ఆ సప్త ప్రాంతాలలో జాగేశ్వర్ కూడా ఒకటి. ఈ క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో వృద్ధ జాగేశ్వర్ క్షేత్రం ఉంది. ఇక్కడి నుంచి హిమాలయ శిఖరాలు మనోహరంగా కనిపిస్తాయి. 108 శిఖరాల అద్భుత సౌందర్యాన్ని ఇక్కడి నుంచి ఈ దర్శించవచ్చు. ఈ శిఖరాల మీద ఎన్నో రకాల దేవత రూపాలని చూడవచ్చు. శివుడు, ఢమరుకము, ఓంకారము, విష్ణువు, లక్ష్మీ, ఆదిశేషుడు మొదలైన ఎన్నో రూపాలను ఇక్కడ భక్తులు దర్శిస్తారు.
ఇక్కడ ఒక యక్షిని చేతిలో అఖండ జ్యోతి ఉంటుంది ఆ జ్యోతిని తన రెండు చేతులతో పట్టుకుని యక్షిని దర్శనమిస్తుంది. ఆ చేతులు క్రమంగా కిందికి దిగుతున్నాయని అవి పూర్తిగా క్రిందకు దిగితే కలియుగం అంతమవుతుందని భక్తుల విశ్వాసం.