ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తే, శ్రీఘ్ర వివాహము , సత్సంతానమూ కలుగుతాయి .
ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తే, శ్రీఘ్ర వివాహము , సత్సంతానమూ కలుగుతాయి .
- లక్ష్మీరమణ
ఆదినాథుడు కొలువైన పుణ్యక్షేత్రాలు భారతదేశం నలువైపులా ఎన్నో ఉన్నాయి . వాటిల్లో ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రాలు ఎంతో సుప్రసిద్ధిని పొందాయి. ఇవేకాక , పంచారామాలు పరమేశ్వరుని నిలయాలుగా ప్రసిద్ధమయ్యాయి . ఇవేకాక మరెన్నో ఆ దేవదేవుని క్షేత్రాలు ఈ నెల నాలుగు చెరగులా భక్తితో చేరినవారి ఆర్తిని తీరుస్తున్నాయి . అటువంటి ఒక మహిమాన్విత క్షేత్రం ఇది. ఓంకారం ఇక్కడే పుట్టిందని, బ్రహ్మ, విష్ణు సంవాదానికి కారణమైన అగ్నిలింగం ఉద్భవించింది ఇక్కడేనని భక్తులు విశ్వసించే ఈ క్షేత్ర మహిమని, చరిత్రని తెలుసుకుందాం .
స్థలపురాణం :
సృష్టి ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ దేవుడు, స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు వారిరువురి మధ్యన దిక్కులు పిక్కటిల్లేలా ఓంకార నాదంతో ఓక జ్వాలా లింగము ఉద్భవించింది. "అది ఎవరా ?" అన్న ఆశ్చర్యానికి లోనైనా వారికి " మీ ఇరువురలో ఎవరైతే నా ఆది అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప " అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మగారు హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్లారు . మహా విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళం లోనికి వెళ్ళారు. యెంత దూరం వెళ్లినా వాళ్ళిద్దరికీ ఆ మహా జ్వాలా లింగం ఆది అంతాలు దొరకని లేదు.
శివ తత్త్వం భోధపడిన శ్రీ హరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు.
కాని, అహంభావానికి లొంగిపోయిన విధాత మాత్రం తాను లింగ అగ్ర భాగం చూశానని దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపించారు . అసత్యం చెప్పిన బ్రహ్మదేవుని మీద ఆగ్రహించిన పరమేశ్వరుడు ఆయన ఐదవతలని ఖండించాడు. ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించరని శపించారు. పైగా బ్రహ్మగారికి అసత్యంలో వంత పాడిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని శపించారు . ఈ కథని మనం ప్రతి శివరాత్రినాడూ చెప్పుకుంటూనే ఉంటాం .
ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ ఉదంతమంతా జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల ప్రాంతంలో ఉన్న ‘ఓంకారం’ అనే గ్రామం లోనే అని ఇక్కడి స్థల పురాణం. అప్పుడే తొలిసారిగా ఓంకార నాదం ఉద్భవించిందని అందువల్లే ఈ క్షేత్రానికి "ఓంకారం" అన్న పేరోచ్చినదని స్థానిక నమ్మకం.
అడవిలో ఆహారం ఎలా ?
ఓంకార దివ్యక్షేత్రం అటవీ ప్రదేశంలో ఉండడం వలన ఇక్కడ వసతి సౌకర్యాలు తక్కువ. ఆహారం మాత్రం అవధూత శ్రీ కాశి నాయన ఆశ్రమంలో లభిస్తుంది. “ఆర్తులంరారికీ అన్నం “ అనేది ఆ అవధూత మాట. ఆ మాటని ఇప్పటికీ పాటిస్తూ ఆయన అనునూయులు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు . వసతులు పెద్దగా లేకపోవడం చేత ఉదయమే నంద్యాల నుండి వెళ్లి , తిరిగి సాయంత్రానికి వచ్చేయడం మంచిది.
విగ్రహ ప్రతిష్ఠలు :
పెద్దగా హడావుడీలు, విపరీతమైన అలంకారాలూ ఈ దివ్యక్షేత్రంలో ఏమీ కనిపించవు . చక్కని ప్రకృతి పారవశ్యంతో ఉన్న ఈ సిద్ధేశ్వరుని చెంత ధ్యానం చేసుకోవడం ఒక గొప్ప వరం . ఇక్కడ ఎందరో సిద్ధులు తపస్సు చేసుకున్నారని చెబుతుంటారు స్థానికులు. వారు నిత్యానుష్ఠానం చేసుకోవడానికి వీలుగా ఒక హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించుకొన్నారు . దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వట వృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహం ఉంటుంది .
అదే వృక్షం క్రింద విఘ్నేశ్వరుని తో పాటు ఎన్నో నాగ ప్రతిష్టలు కనిపిస్తాయి . వివాహ యోగానికి, సత్సంతానానికి ఇక్కడ నాగ ప్రతిష్టలు చేయడం ద్వారా తమ కోర్కెలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఉపాలయాలు :
మూడు కొండల నడుమ సుందర ప్రకృతిలో సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయం లోనికి వెళ్ళడానికి తూర్పున, దక్షిణాన ద్వారాలున్నాయి. రాజగోపురం ఉండదు. రాతి మండపా లను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంటుంది. ఆలయానికి వెనుక కొత్తగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి ,శ్రీ శనేశ్వర స్వామీ తపో వనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహా మూర్తులను ఉంచారు.
శ్రీ ఉమా సహిత సిద్ధేశ్వరుడు :
సిద్ధిప్రదాయకుడైన స్వామి ఓంకార సిద్ధేశ్వరుడై వెలసిన ఈ ప్రాంతం కూడా సిద్ధిని ప్రసాదిస్తుందా అనేంత ప్రశాంతమైన, సుందరమైన ప్రక్రుతి మధ్య నెలకొని ఉంటుంది . గర్భాలయంలో చందన, విభూతి కుంకుమ లెపనాలతొ ఓంకార సిద్దేశ్వర స్వామి లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు. ప్రక్కనే ఉమాదేవి అమ్మవారి సన్నిధి ఉంటుంది. మంగళ, శుక్రవారాలలో దేవదేవికి విశేష పూజలు చేస్తారు. దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవాలి :
శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, కర్నూలు జిల్లా , నంద్యాల పట్టణానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా ఓంకారమే. ఈ పురాణ ప్రసిద్ద స్థలం చేరుకోవడానికి నంద్యాల నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. నంద్యాల చుట్టుప్రక్కల ఉన్న నవ నంది క్షేత్రాలతో పాటు ఈ ఓంకారం క్షేత్రాన్ని కూడా తప్పక దర్శించాలి .
#Omkarasiddeswaraswamitemple #shiva #omkaram
Tags: omkara siddeswara swami temple, omkaram, nandyal, shiva, naga prathista