ఆతర్వాత వెతికి చూసినా కనిపించదు !
ఆయన రథాన్ని అనుసరిస్తూ వస్తుందా బ్రహ్మాండమైన గరుడ పక్షి. ఆతర్వాత వెతికి చూసినా కనిపించదు !
-సేకరణ
త్రి మూర్తులలో లయకారకుడైన మహేశ్వరునికి దేశంలోని అనేక ప్రాంతాలలో ఆలయాలు వున్నాయి. వీటిలో పంచభూత లింగాలుగా కొలువైన ప్రదేశాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇక, తెలుగునాట కోటేశ్వరరావు అనే పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూంటుంది. అలాగే మనకి దేవీ దేవతలా పేర్లు పెట్టుకోవడం కూడా ఒక సంప్రదాయం . అలా కోటేశ్వరుడు అనే పేరుతొ వెలుగొందుతున్న శివయ్య క్షేత్రం గురించి, దానియొక్క దివ్యమైన మహిమని గురించి తేలుకుందాం రండి !
కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఈ పరమేశ్వర క్షేత్రానికి ఎంతో విశిష్టత వుంది. స్వామి కోటేశ్వరునిగా వెలసి ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి కోటే అనే పేరొచ్చిందంటారు. ఈ ఆలయం కేరళ ఆలయ నిర్మాణశైలిని పోలి వుంటుంది. నల్లని రాతిపై కోటేశ్వర స్వామి రూపం దర్శనమి స్తుంది. ఆలయంలో ఒక పెద్ద గద్దె ఉంటుంది. దీనిపైనా నిలబడితే, గర్భగుడిలోని కోటేశ్వరస్వామిని నేరుగా దర్శనం ఇస్తారు .
రథోత్సవంలో వెన్నంటి ఉండే గరుడస్వామి :
ఈ కోటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రతి ఏడాది వైభవంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా కర్నాటకలోని పలు ఆలయాలలో రథోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయంగా వుంది. అలాంటి రథోత్సవాలలో ఈ కోటేశ్వర క్షేత్రంలో జరిగే రథోత్సవం ఉడిపి ప్రాంతంలోనే కాకుండా మొత్తం కర్నాటక రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందింది. తొమ్మిది రోజులపాటు నిర్వహించే రథోత్సవాన్ని కొడిహబ్బ అంటారు. కన్నడంలో కొడిహబ్బ అంటే, అతిపెద్ద రథోత్సవం అని అర్థం .
కోటేశ్వరస్వామికి జరిగే రథోత్సవంలో ఒక విశేషం వుంది. కేరళలో అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి నాడు జరిగే మకరజ్యోతి దర్శన సమయంలో స్వామికి ఆభరణాలు అలంకరించే సమయంలో ఎలాగైతే ఆకాశంలో ఒక గరుడ పక్షి ఎగురుతూ వుంటుందో ఆ విధంగానే కోటేశ్వరలో స్వామికి జరిగే రథోత్సవం నాడు, రథంపై స్వామి వారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చే సమయంలో ఒక గరుడ పక్షి ఆ రథాన్ని అనుసరిస్తూ,
వుండడం కొంత ఆశ్చర్యంగాను, విశేషంగాను వుంటుంది. రథోత్సవం సమయంలో ఎక్కడి నుంచి వస్తుందో అంతే వేగంగా ఆ తర్వాత కనిపించకుండా పోతుంది ఆ గరుడ పక్షి.
మధురమైన జీవితంకోసం - చెరుకుగడలు :
మిగతా ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయంలో స్వామికి చెరకు గడలు సమర్పింస్తుంటారు భక్తులు. ఈ ప్రాంతంలో రైతులు చెరకును అధికంగా పండిస్తారు. రథోత్సవం నాడు కొత్తగా పెళ్లైన దంపతులు చెరకు గడలను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించి మొక్కుకొంటుంటారు. కోటేశ్వర స్వామికి చెరకును నైవేద్యంగా సమర్పిం చడం వల్ల చెరకులోని తీపిలాగా వారి జీవితా లోను ఆనందోత్సాహాలు కలిగి వుంటాయని ప్రగాఢంగా నమ్ముతారు.
కోటేశ్వరుడి ఆలయం :
ఆలయంలోకి ప్రవేశించగానే కేరళ నిర్మాణ శైలి ఆకట్టుకొంటుంది. ఇరవై ఐదు అడుగుల ఎత్తుగా గల ప్రధాన ద్వారం వంద అడుగుల ఎత్తులో గల ధ్వజస్తంభం భక్తులకు కనువిందు చేస్తాయి. గర్భగుడిలో కోటేశ్వరుడు చందన, విభూది, కుంకుమ లేపనాలతో లింగరూపంలో నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయంలో మరొక విశేషం ఆలయంలో గల పుష్కరిణి. ఇది పరమేశ్వరుడి చేతిలో గల డమరుకం ఆకారాన్ని పోలి వుంటుంది.
గతంలో ఈ ఆలయానికి ఏడు ప్రాకారాలు వుండేవి. ఆ తర్వాత క్రమేపి కొన్ని ప్రాకారాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ ప్రాంతానికే ధ్వజపుర అనే పేరు కూడా వుంది. అలయంలో కోటేశ్వర స్వామికి ఎదురుగా పార్వతి. దేవితోపాటు దంతేశ్వరి పేరుతో ఉత్సవ విగ్రహం వుంది. ఇరవై ఐదు అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పుతో ఆలయ ప్రధాన ద్వారం తూర్పు వైపుకు వుంటుంది. వంద అడుగుల ఎత్తులో గల ధ్వజ స్తంభం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ.
ఇక్కడి ప్రధాన ఆలయంలోనే అనేక ఉపాలయాలు వున్నాయి. కర్నాటకలోని పలు ఆలయాలలో గల ఉపాలయాలలో గణపతి విగ్రహం, అమ్మవారు, కృష్ణుడు తదితర మూర్తులు కొలువుదీరి వున్నట్లే ఈ కోటేశ్వర క్షేత్రంలోనూ గల ఉపాలయాలలో వినా యకుడు, కార్తికేయుడు, అర్ధనారీశ్వరుడు, గోపాల కృష్ణుడు, పార్వతిదేవికి ఉపాలయాలు వున్నాయి. కాళీ లక్ష్మి పేరుతో గల అమ్మవారికి ఉపాలయం వుంది. అమ్మవారు ఒక చేతిలో చీపురును, మరొక చేతిలో పసిపాపను పట్టుకొని వుండడం ప్రత్యేక తను కలిగి వుంటుంది. అలాగే గణపతి, సుబ్ర హ్మణ్యస్వామి, వేణుగోపాలుడు, దేవి, సప్తమాతృ కలు, మహిషాసురమర్ధిని, వెంకట రమణమూర్తిలు కొలువుదీరి వుండి భక్తులకు దర్శనమిస్తుంటారు.
కాళీలక్ష్మి అవతారం - విచిత్రం :
కాళీ లక్ష్మిగా పిలవబడే అమ్మవారు ఒక చేతిలో చీపురు, మరొక చేతిలో పసిపాపను పట్టు కొని వుండడం వెనుక గల కారణం పురాణాల లోనూ చెప్పబడలేదంటారు. ఈ అవతార స్వరూ సం ఒక రహస్యంగా వుండిపోయిందంటారు. ఈ ఆలయంలోనే భూత గణాలన్నీ నందితోపాటు ఆలయ ప్రాకారం వద్ద కొలువుదీరి వుంటాయి. రెండు పెద్ద నటరాజస్వామి విగ్రహాలు రెండు వైపులా వున్నాయి.
కోటి లింగాలతో శివలింగం:
ప్రధాన శివలింగం పెద్ద పెద్ద కళ్లతో ప్రత్యేకంగా వుంటే, దాని దిగువ భాగంలో అనేక చిన్న శివలింగాలు ఇమిడి వుండడం విశేషంగా చెప్తారు. ఇవి చూసే వారికి సరిగా కనిపించవు. ఆ ప్రదే శంలోనే చిన్న బావి ఒకటి వుంది. దానిపై వెలసి వుండే శివలింగానికి వెండి తాపడం చేసి వుంటారు. నాల్గవ ప్రాకారం గుండా గర్భగుడిలోని ప్రధాన దేవరును దర్శించుకొనే సమయంలో దక్షిణం వైపుగా వుండే గణపతిని మూల గణపతి అంటారు.
ముక్కోటి దేవతలు ఈ ప్రాంతానికి వచ్చి పరమ శివుడి కోసం ప్రార్ధన చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ఒకనాడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అలా శివుడు ముక్కోటి దేవతలకు ప్రత్యక్షమైన ప్రదేశమే నేడు కోటేశ్వర క్షేత్రంగా భాసిల్లుతోందని, ఆ ముక్కోటి దేవతలకు శివుడు కనిపించినందువల్ల ఈ క్షేత్రంలో గల శివలింగంపై కోటి చిన్నపాటి శివ లింగాలు ఏర్పడ్డాయంటారు. అందువల్లే స్వామికి కోటీశ్వరుడు, కోటేశ్వరుడు అనే పేరొచ్చిందంటారు.
పాండవులు నిర్మించారు:
పాండవులు ఈ ఆలయాన్ని మొదటగా నిర్మించారంటారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరి పాలించిన బసరుడు అనే రాజు ఆలయాన్ని అభి వృద్ధి చేశాడట. ఆలయంలో కోటి తీర్థం అని పిలవబడే కోనేరుతోపాటు ప్రక్కనే పెద్ద అశ్వద్ధ వృక్షం, నాగశిలలు వున్నాయి. ఈ కోటితీర్ధం నుంచే కోటేశ్వరస్వామికి చేసే అభిషేకాలకు ప్రతి రోజూ నీటిని వినియోగిస్తుంటారు.
పరశురామ స్థాపిత సప్తముక్తి క్షేత్రాలలో ఒకటైన ఈ కోటేశ్వరలోని కోటిలింగేశ్వరుడిని దర్శిం చుకొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు.
ఇలా చేరుకోవచ్చు :
కర్నాటకా రాష్టంలోని ఉడిపి నుండీ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోటేశ్వర క్షేత్రం .