Online Puja Services

నిత్యం పెరిగే శివయ్య

3.15.34.50

గ్లాసెడు నీళ్లకే సంతృప్తిపడి కోరిన కోర్కెలు తీర్చే నిత్యం పెరిగే శివయ్య !
లక్ష్మీ రమణ 

శివుడు భోళా శంకరుడు. పిలిస్తే పలికే దైవం . ఆయనకీ అభిషేకం చేయడం ద్వారా సకల రోగాలూ హరించుకుపోతాయి. కరుణాసముద్రుడైన ఆ స్వామీ అనుగ్రహం చేత సకలమైన జ్ఞానాలూ సంప్రాప్తిస్తాయి .  పైగా ఆయనకీ అభిషేకం అంటే, అత్యంత ప్రియం. నిత్యా గంగాధరుడు కదా శంకరుడు ! ఇక ఇలాంటి స్వరూపం తోటే మహా శివలింగంగా అవతరించి , గ్లాసెడు నీళ్ల అభిషేకంతో సంతృప్తిని పొందే వరదాయకునిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది . మహాకాయుడైన ఇక్కడి స్వామీ నిత్యం పెరుగుతూ ఉండడం ఇక్కడై మరో విశేషం. నిత్యం పెరిగే, వినాయకుడు, నంది ఉండంగా లేనిది ఆ మహేస్వరుడు పెరిగితే వింతేముందీ అంటారేమో! పూర్తి వివరాలు చదివారంటే, ఆ స్వామీ విశేషత మీకూ అర్థమవుతుంది లెండి ! రండి ఆ మహా లింగేశ్వరుని దర్శిద్దాం !

శివునికి అభిషేకం అనేది మహా ప్రీతికరమైన అంశం. పంచామృతాలతో , ఫల రసాలతో అభిషేకం చేస్తే,  ఆయన అనుగ్రహం వర్షిస్తుందని మన ధర్మ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి . ఆ తీర్థాన్ని స్వీకరిస్తే, సకలమైన అనారోగ్యాలూ హరిస్తాయని పండితులు చెబుతారు . అంతేకాక, అపమృత్యు భయం అనేది తొలగిపోతుంది .  అందుకే పరమశివుడికి ఎంతో మంది భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు . స్వామి స్వయం వ్యక్తమైన క్షేత్రాలలో ఈ మహిమ మరింత స్పష్టంగా, ఆయన అనుగ్రహం మరింత అధికంగా భక్తులకి వర్తిస్తూ ఉంటుంది . అటువంటి క్షేత్రాలలో ఒకటి భూతేశ్వర్ నాధ్ ఆలయం.  ఇక్కడ శివుడు ఏకంగా ఒక కొండంత ఆకారంతో, దాదాపు 18 అడుగుల ఎత్తుతో మన ముందర నిలబడతారు . ఆ కొండంత దేవుడూ  కోరుకునేది , ఒకే ఒక్క గ్లాసుడు నీళ్లు అంటే వినడానికే విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం . ఇక్కడ ఈ స్వామిని వ్యాఘ్రేశ్వరుడు అని పిలుస్తారు .   

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని మరోడా గ్రామంలో ఈ భూతేశ్వరనాధ్ ఆలయం ఉంది.

చుట్టూ దట్టమైన అడవులు, అందమైన ప్రకృతి పరవశం మధ్య స్వామి వారు లింగాకారంలో కొలువై ఉన్నారు.మరింత విశేషం ఏమంటే,  ఈ ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది . ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిఏటా శివలింగం ఎత్తును రికార్డు చేస్తారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

ఆలయ చరిత్ర : 

భూతేశ్వర్ నాధ్ ఆలయానికి వందల సంవత్సరాలనాటి చరిత్రే ఉంది. జమిందారీ వ్యవస్ధ ఉన్న సమయంలో గరియాబంద్ ప్రాంతంలో శోభాసింగ్ అనే జమిందార్ ఉండేవాడు. మరోడా గ్రామంలో శోభాసింగ్ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు సాయంత్రం తన పొలానికి వెళ్లే సందర్భంలో పొలానికి సమీపంలోని ఓ ప్రత్యేక అకారం నుండి ఎద్దు రంకెలు వేయటం, సింహం గాండ్రింపు శబ్ధాలు వినిపించాయి. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు.

గ్రామస్తులంతా అక్కడకు చేరుకున్నారు. వారికి కూడా అలాంటి శబ్ధాలే వినబడటంతో సమీప ప్రాంతాల్లో ఈ జంతువులు ఉన్నాయేమోనని గాలింపు మొదలు పెట్టారు. కాని వాటి అచూకి మాత్రం కనుగొన లేకపోయారు. మట్టిదిబ్బగా ఉన్నచోట నుండే ఈ అరుపులు వినిపిస్తున్నాయని గ్రహించి అందులో ఏదో మహిమఉన్నట్లు భావించారు. అప్పటి నుండి వారంతా దానిని శివలింగంగా భావించి పూజించటం ప్రారంభించారు.

ఆప్రాంతంలో ఎంతో విశిష్టత కలిగిన ఆలయంగా భూతేశ్వర నాధ్ ఆలయం వెలుగొందుతుంది. శ్రావణ మాసం తోపాటు, మహాశివరాత్రి పర్వదినాల సమయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంత వాసులకు ఏచిన్న సమస్య వచ్చినా స్వామి ఆలయానికి వచ్చి భక్తితో శివలింగంపై గ్లాసు నీళ్ళు పోసి నమస్కరిస్తారు. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని భక్తులు చెబుతున్నారు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore