Online Puja Services

భూతప్రేత పిశాచాలకు సింహస్వప్నం ఈ మీసాల వీరభద్రుడు

3.143.241.253

భూతప్రేత పిశాచాలకు సింహస్వప్నం ఈ మీసాల వీరభద్రుడు . 
లక్ష్మీ రమణ 

వీరభద్రుడు శివుని స్వరూపమే . దక్షయజ్ఞానికి తండ్రి ఆహ్వానాన్ని అందుకోకుండానే , హాజరవుతుంది సతీదేవి . అక్కడ పిలవని పేరంటానికి వచ్చిందన్న ఎత్తిపొడుపుని , శివనిందని, హేళనని తట్టుకోలేక, ప్రాయోపవేశం చేసి, యోగాగ్నిలో ఆహుతి అవుతుంది. అప్పుడు కోపోద్రిక్తుడైన శివుడు తన ఝటాఝూటం నుండీ ఒక పాయని తీసి నేలకేసి విసిరికొట్టారు. ఆ పాయ నుండీ పుట్టినవాడు వీరభద్రుడు .  మహారౌద్ర స్వరూపుడైన ఆ స్వామీ దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేశారు. ఆ వీరభద్రుడు నెలకొన్న క్షేత్రం కురవి . 
 

వీరభద్రుని స్వరూపం :
కురవి వీరభధ్రుడు నల్లని రూపం, కోరమీసాలు, పదునైన చూపులతో, ఐదు జతల చేతులతో శత్రుభయంకరంగా దర్శనమిస్తారు . కుడివైపున ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పుష్పం, ఒక చేతిలో గద, ఒక చేతిలో దండం, ఎడమవైపున ఒక చేతిలో ఢమరకం, ఒకచేతిలో సర్పం, ఒక చేతిలో విల్లు , ఒక చేతిలో బాణం, ఒకచేతిలో ముద్ధరం ధరించి ఉంటారు . 

స్వామి పాదాల దగ్గర వినయంగా నంది వాహనం ఉంటుంది . ఎడమవైపున భక్తులకు అభయమిస్తూ భధ్రకాళిక నెలకొని ఉంటుంది. వీరభద్రుడి రౌద్రరూపం భూతప్రేత పిశాచాలకు వణుకు పుట్టిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టి దుష్టశక్తల పీడ తొలగించుకోడానికై ఎక్కడి జనమో కొరవిలోని దేవుడిని శరణువేడతారు. 

పరివార దేవతలు :
వరంగల్ జిల్లాలోని కురవిలోని భద్రకాళీ సమేతుడై దర్శనమిస్తారు వీరభద్రుడు. రుధిర నేత్ర జ్వాలలకు ప్రతీకగా ఇక్కడే పరమశివుడూ పూజలందుకుంటున్నారు . ఆలయంలోపలకు ప్రవేశించగానే గణపతి దర్శనమిస్తాడు. గణపయ్య ఆనతి తీసుకున్నాకే వీరభద్రుడికి పూజలు చేయడం ఆనవాయితీ. అనుమతి ఇచ్చేవాడు కనుకనే ఆయనని అనుజ్ఞా గణపతి అని పిలుస్తారు . ఆలయ ఉత్తరభాగంలో రామలింగేశ్వరస్వామి, దక్షిణంలో చంద్రమౌళీశ్వరుడూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నవగ్రహాలను సప్తమాతృకలనూ ప్రతిష్టించారు. ఆలయానికి అనుబంధంగా ఆంజనేయుడి గుడి ఉంది. నాగేంద్రుని విగ్రహన్ని కూడా చూడవచ్చు.

ఆలయ చరిత్ర:
రాష్ట్రకూట రాజైన భీమరాజు కురవిని (నేటి కొరవి సీమను) పాలించేవాడు. అతడే వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో శిధిల స్థితికి చేరుకున్న ఆలయాన్ని కాకతీయ పాలకుడు ఒకటో బేతరాజు పునర్నిర్మించాడు. కాకతీయ వీరనారి రుద్రమాంబ వీరభద్రుడిని దర్శించుకుని కానుకలు సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ క్షేత్రం కాకతీయుల పాలనలో ప్రసిద్ది చెందినది. 

స్థల మహత్యం : 
ఓసారి కురవి ప్రాంతంలో అల్లకల్లోలం తలఎత్తింది. శత్రుమూకలు స్వైరవిహారం చేశాయి. అపార ప్రాణనష్టం కలిగించాయి. ఆ సమయంలో వీరభద్రుడు ప్రత్యక్షమై, దుష్టులను చంపినట్లు చరిత్ర. కొన్నిసార్లు మానవరూపంలో వచ్చి ప్రజలతో ఆటలు ఆడేవాడట, పాటలు పాడేవాడట. అంతలోనే హఠాత్తుగా అదృశ్యమయ్యేవాడట. ఇప్పటికీ ఈ స్వామిని శరణు వేడినవారికి స్వామి సులభ ప్రసన్నుడై దర్శనమిస్తారని విస్వాసం.  శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. భద్రకాళి, వీరభద్రుల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతారు. రధోత్సం జరుగుతుంది. ప్రభల బళ్ళు కడతారు.

ఎలా వెళ్ళాలి:
వరంగల్ జిల్లా కురవి మండలంలో ఉంది ఈ ఆలయం. మహబూబ్ నగర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి కర్నూలు రైలు మార్గంలో ప్రయాణించి మహబూబాబాద్ లో దిగి అక్కడనుండి కురవికి వెళ్ళవచ్చు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore