Online Puja Services

పదకొండు మంది రుద్రులు ఎవరు ? ఎక్కడున్నారు ?

3.133.143.167

పదకొండు మంది రుద్రులు ఎవరు ? ఎక్కడున్నారు ?
-సేకరణ 

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది. దీని ప్రకారం ఈశ్వరుడు మనకి పదకొండు మంది రుద్రులుగా దర్శనమిస్తున్నారు .  అసలు  ఈ పదకొండు మంది రుద్రులు ఎవరు ? వారి స్వరూపాలు తెలుగు నేలపైన ఎక్కడున్నాయి  ? 

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు :

1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్రయంబకుడు , 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. 

ఈ ఏకాదశ రుద్రులు ప్రతిష్టింపబడిన స్థలములు.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం .(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):

పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివలింగరూపాన్ని పొందిందని కధ. వ్యాఘ్రము శివునిగా అవతరించడం వలన ఆయనని వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలుస్తారు . 

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):

విశ్వామిత్రుని తపస్సుని భంగపరచమని ఇంద్రుడు ‘మేనక’ అనే అప్సరసని పంపిస్తాడు . ఆమె అందచందాలకు విచలితుడైన విశ్వామిత్రుడు ఉద్రేకపూరితుడవుతాడు . దాంతో  విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మిస్తుంది.  విశ్వామిత్రుని తపస్సు ఆగిపోతుంది . ఆ  తరువాత మేనక, తన కర్తవ్యం ముగుసింది కాబట్టి  స్వర్గమునకు తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. కానీ వెళ్లలేకపోతుంది . అపుడు ఆమె శివుని శరణువేడింది.  ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి, ఆప్రదేశములో ప్రతిష్ఠించి పూజించమని చేబుతారు . 
 
అలా  మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) లో శివలింగమును ప్రతిష్ఠించి,  స్వర్గమునకు వెళ్లిందని స్థానిక ఐతిహ్యం .  మేనకచేత  ప్రతిష్ఠింప బడుటచేత ఈయనని  మేనకేశ్వరస్వామి అని పిలుస్తారు .  ఈయనే మహాదేవ రుద్రుడు . 

3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):

రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళుతున్నారు . మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారట .  అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదిలింది స్థల ఐతిహ్యం .  రామునిచేత ప్రతిష్ఠింపబడినది కాబట్టి ఈయన  రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే, ఆనందరామేశ్వరుడని పేరొందారు . ఈయనే త్యంబకేశ్వరుడు.  

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక
(శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):

తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామములో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధ . అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచేత  శివలింగము ప్రతిష్ఠ చేశారు . ఈయనే  విశ్వేశ్వరునిగా పేరొందిన త్రిపురాంతక రుద్రుడు.  

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):

మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి, శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి, అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామములో ప్రతిష్ట చేయబడిన చెన్నమల్లేశ్వరస్వామి . 

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):

రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకి వెళుతున్న సమయంలో  రామునిచేత ఈప్రదేశములో శివలింగాన్ని ప్రతిష్ఠి చేశారు .  కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించారు . రాఘవునిచే ప్రతిష్ఠింపబడడం వల్ల రాఘవేశ్వరస్వామిగా పేరొందారు . 

పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించిన , ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధ ఉంది . 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి )

దేవతలు, రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేసేందుకు శివుడు తన కంఠములో నిక్షిప్తము చేసికొని నీలకంఠుడయ్యారు. 

ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపములో ఆవిర్భవించారు . తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అవడం చేత అనంత భోగేశ్వరస్వామిగా పేరొందారు.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అని పేరొందారు . ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామములో లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలవబడ్డారు . 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి):

దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలలో  కాలిబూడిద అయినపుడు శివుడు, ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించాడు . వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేశాడు . ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచేత  ప్రతిష్ఠింపబడ్డారు . 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపించారు . విష్ణువు శివుని పాదములను కనుగొనలేక, తిరిగివచ్చి,తనకి కనిపించలేదని చెప్పారు . కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినప్పటికీ , ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూశానని చెప్పారు . శివునికి ఆగ్రహము వచ్చి, బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి, విష్ణువే అగ్రగణ్యుడని అనుగ్రహించారు . ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచేత ప్రతిష్టింపబడ్డారు . 

11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):

పూర్వకాలంలో విష్ణుమూర్తి,  శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించారు.  దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించారు .  ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామములో లింగరూపములో ఆవిర్భవించారు . పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామములోని  శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరొందారు .

సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు! సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని సంతు.!

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba