Online Puja Services

భైరవకోన

3.145.82.96

కార్తీకపౌర్ణమి నిండు చంద్రుడు తన కిరణాలతో అభిషేకించే శక్తి ఆలయం - భైరవకోన . 
-సేకరణ 

నల్లమల అడవిలో ప్రయాణం . దట్టమైన అడవి . ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే చెట్లు. కొండలపైనుండీ జారీ పడే జలపాతాలు . ఆ కోనలోని కొండపైన కొలువయ్యాడు భైరవుడు . ఆయనదేమో అరివీరభయంకర రౌద్రం . స్వామి చెంతనే కొలువైన అమ్మదేమో, వెన్నెలతో అభిషేకం చేయించుకునే పూర్ణచంద్రుని చల్లదనం . ఆధ్యాత్మిక అమృతం అనిపించే భైరవకోన విశేషాలు ఇక్కడ మీకోసం . 

 భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవ కోన ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. 

సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు మలిచిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహంమీద కార్తీకపౌర్ణమిరోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాతపు సేలయేటిలో స్నానంచేసి , ఈ ఆలయాలని దర్శించుకొని పునీతులవుతారు .

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచీ ఉన్నదే.ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఆలయాల జాబితా కొద్దిగా పెద్దగానే ఉంటుంది . గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. 

అయితే ప్రకాశంజిల్లోని సీతారామపురం మండలంలోని ఈ భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖానికీ ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగానూ చెక్కబడ్డాయి.

వీటన్నింటిలోనూ గర్భాలయాలూ వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు.

ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. 

ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం లను పోలిన లింగాలను ఇక్కడ అవే పేర్లతో ఆరాధిస్తుండడం విశేషం .

వీటిల్లో ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఆశీనమై కనిపిస్తుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోబాటు బ్రహ్మ, విష్ణువుల స్వరూపాలు కూడా నిలిచి ఉండడం  విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగానూ ప్రాచుర్యం చెందింది. 

ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూతా కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

అంతేకాదు ఈప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba