రోజుకో తీరు ఈ మహిమాన్విత శివాలయ దర్శనం
రోజుకో తీరు ఈ మహిమాన్విత శివాలయ దర్శనం .
లక్ష్మీరమణ
శివయ్యకి తన భక్తులంటే అమితమైన ప్రేమ . ఎంతటి ప్రేమంటే, తన భక్తుల జోలికొస్తే, మార్కండేయుని ఉదంతంలోలాగా యమధర్మరాజునైనాసరే, సంహరించేస్తారు . గొడగూచిని తండ్రిబారినుండీ రక్షించేందుకు తనలో ఐక్యం చేసుకున్నట్టు అపార పితృవాత్సల్యంతో సాక్షాత్కరిస్తారు . భస్మాసురుడి కథలోలాగా తనకే ముప్పని తెలిసినా , శరణన్నవారికి వరాలజల్లు కురిపించాక మానరు . ఆ భక్తవత్సలుని సంగతి , ఆయన కుమారుడైన కుమారస్వామికి తెలియనిదేమీకాదు . అందుకే ఈ ప్రదేశంలో ఆ శివస్వామిని ప్రతిష్టించారు .
పరమశివుడంటేనే అభిషేక ప్రియుడు. భక్త వత్సలుడు . బోళాశంకరుడు . అలాంటి స్వామీ భక్తుడు లోకకంఠకుడే అయినా అతనిని సంహరించిన పాపం ఊరికే పోదుమరి . అపార శివభక్తుడైన రావణాసురుని సంహరించిన రాములోరు కూడా దేశంలోని పలుచోట్ల స్వయంగా శివలింగ ప్రతిష్టలు చేశారు . అదే విధంగా స్వయంగా ఆ పరమేశ్వరుని పుత్రుడైన కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించినతర్వాత, శివభక్తాగ్రేశ్వరుడైన ఆ అసురుని సంహారానికి ప్రాయశ్చిత్తంగా, స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన లింగం శ్రీ స్తంభేశ్వరాలయం . స్కందపురాణంలో ఈ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది.
అసలు కుమారజననం సంభవించింది తారకాసుల వధ కోసం . కానీ, తారకాసురుడు రాక్షసుడే అయినప్పటికీ మహాశివభక్తుడు. శివుడొకటీ, శివభక్తులు వేరొకటీ కాదనే తండ్రి తత్వమెరిగినవాడు, ఆయన తనయుడు . అందువల్ల శివభక్తుని తన చేతులతో చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో కార్తికేయుని బాధను గమనించిన విష్ణుమూర్తి శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు అని పురాణగాధ .
స్తంభేశ్వరునికి సముద్రుడే స్వయంగా నిత్యం తన జలాలతో నిత్యం అభిషేకం చేస్తుంటాడు . గుజరాత్ లోని వడోదరా సమీపంలోని కవికంబోయి సమీపంలో ఉంది ఈ మహిమాన్విత ఆలయం. ఈ దేవాలయానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇక్కడి శివలింగం పురాతనమైనది. ఆలయ చరిత్రను బట్టి చూస్తే 150 సంవత్సరాల క్రితమే దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది. సాదాసీదాగా కనిపించే ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. సముద్రతీరంలో నిర్మించిన అనేక ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటిమట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటుంటారు. అయితే అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం మాత్రం ఈ కవికంబోయిలోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం విషయంలో చూడవచ్చు.
అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతుంది. ఆసమయంలో భక్తులు అందులోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వస్తారు. తరువాత కొద్ది సేపటికి నిదానంగా సముద్రంలో మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తీరం వద్దనే వేచి ఉంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగా, ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసీతెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం.
ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమవాస్య, పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.