విప్పపూల చెట్టు నుండీ ఉద్భవించిన ఈశ్వరుడు !
విప్పపూల చెట్టు నుండీ ఉద్భవించిన మధుకరుడు ఈ ఈశ్వరుడు !
లక్ష్మీ రమణ
అక్కడ జగన్నాధుడు దారువు (చెక్క) రూపమై పూజలందుకుంటున్నాడు . ఇక్కడ దారువునుండీ దారుణమైన రౌద్రంతో ఉద్భవించిన శివుడు పూజలందుకుంటున్నాడు . ఆయన మాధవుడు. ఈయన మధుకరుడు. పుత్తడి పూలనిచ్చిన చెట్టు నుండీ పుట్టిన ఈశుని కథే ఇది . ప్రతి ఆవిర్భావంలో ఒక నిజమైన భక్తుని కథని నిక్షేపించుకున్న సర్వేశ్వరుడు ,శ్రీకాకుళంలోని ఈ ఆలయంలోనూ దివ్యమైన స్వరూపంతో వెలిసి తన మహిమని చాటుతున్నాడు .
ఒకప్పుడు హిమాలయాలమీద గొప్ప వైష్ణవయాగం జరిగింది. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు (గిరిజనులు) కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవికారానికి లోనయ్యారు . అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి " సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి" అని శపించాడు.
గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి. రెండవ భార్య చిత్కళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు. చీటికీ మాటికీ కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి "నీతో ఉంటే నేనైనా ఉండాలి...లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు" అని నిలదీసింది. శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు (విప్పా చెట్టు ) కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక, ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజూ ఏరుకునేది.
అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తలచి, ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.
ఈ శ్రీముఖ లింగంపైన స్వామి " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు."శ్రీముఖలింగం" అనే పదానికి "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని అర్ధం. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి.
10 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం చాల పురతనమైనది . మహాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి . భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు.
ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో చెప్పనే లేదు కదూ ! శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండల కేంద్రం లో గల ముఖలింగం గ్రామం లో వెలసిన ప్రసిద్ద శైవ క్షేత్రం ఇది . ఆలయం చుట్టూ క్యూ కాంప్లెక్స్ తోపాటు, సుందరమైన పార్కును పురావస్తుశాఖ ఏర్పాటు చేసింది. శ్రీముఖ లింగం ఆలయాన్ని దర్శించేందుకు ఆంధ్ర, తెలంగాణాల రాష్ట్రాలతోపాటు ఒరిస్సా రాష్ట్రం నుండి భక్తులు, యాత్రికులు తరలివస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 45కిలో మీటర్ల దూరంలో ఈ శ్రీముఖ లింగ క్షేత్రం ఉంది.