ఆ దొరగారికి గట్టిగా బుద్ధి చెప్పిన శివయ్య !
ఆ దొరగారికి గట్టిగా బుద్ధి చెప్పిన శివయ్య !
-లక్ష్మీ రమణ
నమ్మకం ఒకరు కల్పించేది కాదుకదా ! భగవంతుడు ఉన్నాడని , నమ్మే జాతిమనది . ఆ పరాయి దేశానికి ఈ సంప్రదాయంమీద గౌరవం లేదు, నమ్మకం అసలే లేదు . అందుకే ఆ శివయ్య జోలికెళ్ళారు . అసలే జ్యోతిస్వరూపుడేమో , బాగానే బుద్ధిచెప్పి పంపించాడు . తనపాదాల దగ్గరికే రప్పించుకున్నాడు .
బ్రిటీషు వాళ్ళు ఏం నాశనం చేయాలో అంతగానూ చేశిపోయారు . వైజ్ఞానికంగా, సాంప్రదాయపరంగా గొప్పదైన మన సంస్కృతికి తూట్లు పొడిచేశారంటే , అతిశయోక్తి కాదు . కానీ ఈ శివయ్య మహిమ ముందు ఓడిపోయారు . శివుని ముందు వెలుగుతున్న అఖండజ్యోతి ఒక బూటకమని వాదించిన ఒక తెల్లదొరగారు , వాయులింగేశ్వరుడైన శివుణ్ణి పరీక్షించదలిచాడు . ఈ వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది .
వాయువంటేనే, ప్రాణం. పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది.ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక. అంటే ఇది స్వయంగా ప్రాణలింగమే మరి ! వాయువు కంటికి కనిపించదు కదా . కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి అవకాశం లేదు. అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి ( ఆక్సిజన్ ) అందక శివ జ్యోతి ఆరిపోతుందని చెప్పారు.అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేసారు.
24 గంటలు గడచినా గర్భ గుడిలోని శివ జ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది. కానీ అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొకటిగా చచ్చుబడిపోతూ వొంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది. అప్పుడు స్వామి వారి మహిమని గ్రహించాడా ప్రబుద్దుడు .
తానూ ఆ స్వామికి పరీక్షా పెట్టినందుకే , ఇలా తన ప్రాణ వాయువులు నిష్క్రమిస్తున్నాయని , తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యెక పూజలు చేయమని అర్చకులని ప్రాధేయపడ్డారు . ఆలయంలోకి వెళ్లి , అక్కడ స్వామి వారిని సేవించగా, అప్పుడా దొరగారికి పూర్ణ చైతన్యం కలిగిందట .
ఆనాడు స్వామి వారిని ఒక శ్రీ - సాలెపురుగు , కాళము - ఒక పాము , హస్తి - ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. అది నాటి కదా . ఇది సాక్షాత్తూ ఈ కలియుగం నాటిమాటే కదా ! శివయ్యంటే అదీ అనిపించారుకదా ! శంభోశంకర!