ఇక్కడి మట్టి కంటి సమస్యలకి దివ్యౌషధం
ఇక్కడి మట్టి కంటి సమస్యలకి దివ్యౌషధం . (శ్రీకంఠేశ్వరుడు- కర్ణాటక )
-లక్ష్మీ రమణ
సృష్టి మొత్తం తన శరీరమై , సూర్యచంద్రులే కన్నులైన స్వామి ఆ పరమేశ్వరుడు. ఈశ్వరుని పైన భక్తి , నిండైన నమ్మకం ఉండాలేగానీ , విభూదే అష్టైశ్వర్యాలుగా , నేలమీదిమట్టే అమృతతులమైన ఔషధంగా మారిపోతుంది . సందేహమే లేదు . అలా నమ్మిన ఓ రాజుగారి పట్టపుటేనుగు ఈ ఈశ్వరుని సన్నిధిలో చూపుని తిరిగిపొందింది. ఇప్పటికీ ఆ కథ పునరావృతం అవుతూనే ఉంది . నేత్రసమస్యలని తగ్గించే శివయ్య కథ తెలుసుకుందామా !!
కన్ను చాలా సున్నితమైనది , డస్ట్ పడకుండా చూసుకోండి అంటారు డాక్టర్లు . నలుసు పడితే , కన్నుకూడా మిన్నుకి పడ్డ చిల్లులాగా వర్షిస్తుంది . కానీ ఈ శివయ్య సన్నిధిలోని మట్టి , కంటి సమస్యలకి దివ్యఔషధంగా పనిచేస్తుంది . ఇది కేవలం నమ్మకం కాదు , ఇలా జరిగిన దృష్టాంతారాలున్నాయని స్థానికులు చెప్పడం విశేషం .
నీలకంఠేశ్వరుడు :
కర్ణాటక రాష్ట్రంలోని , మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో సంజనగూడ్ లో అతి పురాతనమైన శ్రీ కంఠేశ్వర ఆలయం ఉన్నది. కంబినినది (కపిలది) తీరంలో కొలువయ్యాడు ఈ శ్రీకంఠేశ్వరుడు . శ్రీ అంటే పాము . ఆ పాము విషాన్ని కంఠంలో నిలిపినవాడు శ్రీకంఠేశ్వరుడు. కన్నడంలో నంజుడేశ్వరుడు అంటే, పాలసంద్రాన్ని చిలికినప్పుడు విషయాన్ని కంఠంలో నిలిపిన నీలకంఠేశ్వరుడు అని అర్థం . ఈ పేరు మీదనే ఈ ప్రాంతానికి నంజన్ గుడ్ అనే పేరొచ్చింది . ఆ తర్వాత కాలాంతరంలో అది సంజనగూడ్ గా రూపాంతరం పొందింది .
చారిత్రిక ప్రాశస్తి :
సముద్రమట్టానికి 2155 అడుగుల ఎత్తున కొలువయ్యాడు ఈ శ్రీకంఠేశ్వరుడు. ఈ ఆలయ గోపురం ఎత్తు – దాదాపు 120 అడుగులు. అత్యంత ఎత్తయిన రాజగోపురం కలిగిన ఆలయంగా కూడా ఈ ఆలయం సుప్రసిద్ధిని పొందింది .11వ శతాబ్దంలో ఈ ఆలయనిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది . ప్రాంగణంలో శివలీలలు అధ్బుతమైన దృశ్యాలతో చెక్కబడి ఉంటాయి . ఈ ప్రాంతాన్ని గంగ వంశీయులు, ఆతర్వాత హొయసనలు అనంతరం మైసూర్ ఒడయార్లు పరిపాలించారు . వారందరూ ఈ స్వామిని కొలిచినవారే.
హకీం నంజుండేశ్వర:
విశేషం ఏంటంటే, వారి తర్వాత వచ్చిన సుల్తానులు ఈ ప్రాంతంతో అనుబంధాన్ని కలిగి ఉండడం , ఈ దేవదేవుని మహిమాలని కొనియాడడం . హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఈ జాబితాలోనివారే. దీనికి ఉదాహరణగా ఒక స్థానిక గాథని కూడా చెబుతారు ఇక్కడి వారు . టిప్పూసుల్తాన్ పట్టపుటేనుఁగు చూపుని కోల్పోయి ఇబ్బంది పడుతోందట. వైద్యులకు అంతుచిక్కని ఆ ఏనుగు బాధకి , ఈ శ్రీకంఠేశ్వరుని సన్నిధిలోని మట్టి ఉపశమనాన్ని కలిగించిందట . టిప్పూసుల్తాన్ ఆ ఏనుగు కళ్ళకి ఇక్కడి మట్టిని పట్టీగా కట్టడంతో తిరిగి ఆ ఏనుగు చూపును పొందిందట . అప్పటి నుండీ ఈ స్వామిని టిప్పూసుల్తాన్ ‘హకీం నంజుండేశ్వర’ అని పిలిచేవారని స్థల ఐతిహ్యం .
శిల్ప వైచిత్రి :
నాగేంద్రుడే , ఆదిదంపతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యుడని చెబుతారు. కానీ ఈ ఆలయంలో ఒక విచిత్రమైన శిల్పం కనిపిస్తుంది . శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారు నెమలివాహనంపై కూర్చొని ఉండగా, నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యస్వామి తలపై పడగవిప్పిన రూపం చాలా అధ్బుతంగా ఉంటుంది.
దొడ్డ జాతర :
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని మొక్కులు చెల్లిస్తూ,నిరంతరం నీలకంఠ స్వామి వారి సేవలో తరిస్తుంటారు. సంవత్సరానికి రెండు సార్లు జరిగే రధోత్సవ సమయంలో యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దీనిని దొడ్డ జాతర అంటారు.
పరశురామ క్షేత్రం:
నంజన్ గూడ్ కి దగ్గరలో పరశురామ క్షేత్రం ఉంది. ముందుగా శివుడిని దర్శించి, తరువాత ఈ దేవాలయాన్ని దర్శిస్తే కానీ తీర్థయాత్ర పూర్తికాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గుట్టపైన ఉన్నది. ఇక్కడ పరశురాముడు మాతృ హత్యాదోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసాడని ప్రతీతి.
శ్రీకంఠేశ్వర స్వామిని దర్శించినవారికి తెలిసి, తెలియక చేసిన పాపాలు, దీర్ఘరోగాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి మృత్తిక(మట్టి ) ఔషధంతో సమానమంటారు. అనేక చర్మ రోగాలకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు
ఇప్పటికీ చూపుని పాక్షికంగా కోల్పోయినవారు , చూపు లేనివారు , కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని అధికసంఖ్యలో దర్శిస్తుంటారు .