Online Puja Services

ఈ గుహలో స్వయంగా లయకారుని దర్శనం

18.220.242.160

అదృష్టం ఉంటే , ఈ గుహలో స్వయంగా లయకారుని దర్శనం దొరుకుతుంది. 
లక్ష్మీ రమణ . 
 
లయం అంటే, లీనం అవ్వడమే కదా ! లయకారుడు అంటే, లీనం చేసుకొనే వాడు . సృష్టి జన్మిస్తుంది.  తిరిగి లీనమవుతుంది. ఒకవేళ అలా విలీనం కానట్లయితే, ఈ భూమి ప్రాణులతో నిండిపోయి ఉండేదేమో !! అప్పుడు ప్రాణులకి నిలబడే చోటయినా మిగిలేది కాదేమో !! ఆ లయకారుడే స్వయంగా నివశించే ఒక గుహ కాశ్మీర్ లో ఉంది . ప్రత్యక్షంగా అక్కడ శివ దర్శనం చేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు . ఆ కథ తెలుసుకుందామా ?

భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆధ్యాత్మిక జిజ్ఞాసులు , సృష్టిని గురించి , తప్పక ఆలోచిస్తారు . పుట్టుక నుండీ అంతంవరకూ ఆ సర్వచాలకుని లీలా విలాసాన్ని చూసి , ఇంతటి వ్యవస్థ ఏవిధంగా నడుస్తోందా అని ఆశ్చర్యపోతారు . కానీ ఆయన సృష్టించనిది ఈ జగతిలో లేదు . మరెవరికీ సాధ్యం కాదు . అటువంటి లీలామానుష రూపుడు శివుడు స్వయంగా దిగివచ్చే చోటు , భారతదేశానికి కిరీటం వంటి కాశ్మీర్ లో ఉంది .

 కాశ్మీర్ లోని రిసీ జిల్లాలో శివఖోరి అనే ఓ శివాలయం ఉంది. శివ - శివుడు , ఖోరి అంటే గుహ అనిఅర్థం . శివఃఘోరి అని ఆ అఘోర స్వరూపుడైన శివుణ్ణి ప్రార్ధిస్తున్నట్టూ ఈ శివఖోరి ఆలయం పేరు శబ్దిస్తుంది . చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న ప్రక్రుతి సౌందర్యం . నీటితావులపైన నిర్మించిన చెక్కల వంతెనలు , వాటి మీదినుండీ నడక ప్రయాణం .  కళ్లు తిప్పుకోలేని కాశ్మీర్ సోయగం .పరమాత్మే దిగివచ్చే చోట , ఆ ప్రకృతి పరవశించి చేసే నాట్యంలా ఉంటుంది ఇక్కడి పరిసరాల శోభ. 

నిజానికి ఇది ఒక గుహ మాత్రమే. సాధారణంగా మనం చూసే ఆలయాలలా అద్భుతమైన శిల్పకళ, రాజగోపుర ప్రాకారాలు , గర్భాలయ విమానాలూ ఏవీ లేని ఒక సహజసౌందర్యభరితమైన కొండగుహ ఇది . సుమారు  ఒక మీటరు వెడల్పుతో , నాలుగు మీటర్ల పొడవుతో ఉండే ఆ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది.

 ఈ గుహలో మనకి పొడవైన రాతి శివలింగం దర్శనమిస్తుంది . ఇది స్వయం భూ శివలింగమని స్థానికులు చెబుతారు. శివయ్య అభిషేకప్రియుడు కదా ! మరి ఆయన వెలసింది ఎంతటి ఎత్తయిన కొండయినా , ఆ గంగమ్మ ఉరుకులు పరుగులతో ఆయన్ని అభిషేకించడానికి వస్తూనే ఉంటుంది . ఈ ఆలయంలోనూ స్వామి పైనుండే జాలువారుతూ ఘడియ ఘడియాకీ తలస్నానం చేయిస్తుంటుంది.  గుహలోని స్వామి పైభాగంలో చూసే మనసుంటే, నాగసదృశమైన ఆకారాలు , ఉమాదేవి , గణపతి స్వరూపాలూ కూడా దర్శనమిస్తాయి . ఇవన్నీ స్వయంగా ఏర్పడిన రూపాలే కావడం విశేషం . త్రిశూలం , నాగ పడగలు కూడా ఇక్కడ స్వామీ చుట్టూ భక్తులు ఏర్పాటు చేశారు . 

మరో విచిత్రం ఏమిటంటే, ఆలయంలో ఎప్పుడూ జంట  పావురాలు ఉంటాయట. ఇవి ఆదిదంపతుల ప్రతిరూపాలేనని ,  పుణ్యం చేసిన వారికి మాత్రమే ఇవి దర్శనమిస్తాయని, ఈ పావురాలని దర్శిస్తే , జన్మరాహిత్యమేనని ఇక్కడి భక్తుల నమ్మకం . స్వయంగా ఆ కాలుడే ఇక్కడికి సంవత్సరంలో రెండు సార్లు దిగివస్తాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు . ఆ సమయంలో అసలు ఈ ఆలయంలోకి వెళ్లలేమని , ఒకవేళ వెళ్లినా , ఈ శరీరానికున్న కళ్ళతో పరంజ్యోతి స్వరూపుడైన, కోటిసూర్య సమ ప్రభుడైన ఆయన్ని దర్శించలేమని , ఒక వేళ జన్మాంతర పుణ్యవశాన లయకారుని దర్శనం లభిస్తే, ఇక ఆయనలో లయమే కానీ , తిరిగి శరీరంతో వెనుతిరగాల్సిన అవసరం ఉండదని విశ్వాసం . అంతటి అద్భుతమైన మహత్యం గల ఆలయం ఈ శివఘోరి గుహాలయం .   

 ఈ గుహ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గం కూడా ఉంది. ఇక్కడ నుండే సాధువులు , మహర్షులు అమర్నాథ యాత్రకి వెళ్లేవారట .ఇప్పటికీ నాగసాధువులు యోగ మార్గం అనుసరిస్తూ , ఇక్కడినుండి అమర్నాథ్ యాత్రకి వెళుతుంటారని ప్రతీతి . ఈ మాటని విన్న కొంతమంది సాహసికులు మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని , ఇక్కడి నుండీ అమర్నాథ్ వెళ్లొచ్చు అని చెప్పబడుతున్న మార్గంలో ప్రయాణించారట . కానీ అయితే అలా వెళ్లిన వారెవరూ అక్కడికి చేరుకోపోగా, తిరిగి రానుకూడా లేదు.వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీంతో , మళ్ళి  ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి, ఆ గుహలోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు.

అయితే, మహాశివరాత్రికి మూడు రోజుల ముందు మాత్రమే శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు. అప్పుడిక్కడ ఒక మహా జాతరే జరుగుతుంది . దేశ విదేశాలనుండి అసంఖ్యాకంగా భక్తులు ఈ ఆలయానికి వస్తారు . స్వయంభూ పరమేశ్వర మూర్తి అయిన స్వామిని దర్శించుకొని , ప్రత్యేక పూజలు చేసి వెళుతుంటారు . 

ఎంతో పురాతనమైన చరిత్ర ఈ ఆలయానికి  ఉన్నప్పటికీ,  2000 నుండి మాత్రమే భక్తులకు ఈ ఆలయం గురించి తెలిసింది. సాధారణంగా వైష్ణోదేవీ , అమర్నాథ యాత్రలు చేసే వారు , సాహసికులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనే ప్రయత్నం చేస్తారు .  

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore