లింగానికి కేశములున్న క్షేత్రం బహుశా ఇది ఒక్కటేనేమో!
లింగానికి కేశములున్న క్షేత్రం బహుశా ఈ భువిపై ఇది ఒక్కటేనేమో!
-లక్ష్మీ రమణ
గోదావరి నాదీ ప్రవాహం ఉన్న చోట జ్ఞానం వేయికాంతులతో దీప్తిస్తుందని ఆర్యోక్తి . ఈ నదీ తీరంలో వెలసిన పుణ్య క్షేత్రాలు ఎన్నో నేటికీ వాటి మహత్యాన్ని చాటుతున్నాయి . అటువంటి వాటిల్లో శ్రీ ఉమాకొప్పు లింగేశ్వరస్వామి వారి దేవస్థానం ఒకటి . తిరుమలలో శ్రీ వెంకటేశ్వరులవారికి కేశములు స్త్రీలకు ఉన్నట్టుగా ఉంటాయని విని ఆశ్చర్యపోతుంటాం . అలాగే ఇక్కడున్న శివయ్యకి కొప్పు ఉంటుంది . లింగానికి కేశములున్న క్షేత్రం బహుశా ఈ భువిపై ఇది ఒక్కటేనేమో ! రండి , అగస్త్యుడు అర్చించిన ఈ ఈశుని దర్శనం చేసుకుందాం .
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం చాలా పురాతనమైనది. ఈ గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది . ఈ దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. అంటే, పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం అన్నమాట. మూడవది – నిజానికి శివలింగంపై ఉన్న కొప్పు. అయితే, ఇది మొదటినుండీ ఉండేది కాదు. కాలాంతరంలో పుట్టుకొచ్చింది.
మనం క్షేత్రమహత్యానికి సంబంధించిన కథని తెలుసుకునే ముందర, ఒకసారి వింధ్య పర్వతం, అగస్త్య మహాముని గురించిన వివరాలు క్లుప్తంగా తెలుసుకుంటే ఈ క్షేత్ర మాహాత్మ్య వర్ణనం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఆ వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం .
అగస్త్యుడు:
వింధ్యపర్వతానికి గురువు అగస్త్య మహామునీశ్వరుడు . ఒకానొక సమయంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతంపై అసూయ కలిగి, తాను అదే పనిగా పెరిగిపోతూ గ్రహ, నక్షత్రమండల గమనానికి అవరోధం కలిగించసాగింది. అంత ఎత్తుగా ఎదిగి మేరువు కన్నా తానూ గొప్పవాడినని నిరూపించాలని వింధ్యుని ఉద్దేశ్యం . అలా వింధ్య పర్వతం గ్రహగమనానికి అవరోధంగా మారడంతో లోకవ్యవహారం దెబ్బ తిన్నది. దేవతలు వింధ్య పర్వతాన్ని ప్రార్థించారు. ఆయన వినలేదు, తగ్గలేదు. చేసేదేమీలేక దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంత బ్రహ్మ ఈ ఉపద్రవము నుండి మిమ్ము రక్షించువాడు అగస్త్యుడు తప్ప మరెవరూ లేరని సెలవిచ్చారు. దేవతలు తిన్నగా అగస్త్యుని వద్దకు చేరి విషయం విశదపరిచారు. విన్న అగస్త్యుడు భయము వలదని వారికి అభయమిచ్చి, తాను వింధ్య పర్వత ప్రాంతాన్ని సమీపించాడు. అంత దూరాన అగస్త్యుని చూచిన వింధ్య, గురువైన భక్తితో ఒదిగి నమస్కరించింది . గ్రహ గమనము యథావిధిగా ప్రారంభమైంది. వింధ్యుడు పురుషాకృతి దాల్చి అగస్త్యునకు సాష్ఠాంగదండ ప్రణామం చేసి గురువుగారి రాకకు కారణం వినగోరాడు.
అందుకు సమాధానంగా ఆ మహా ముని “నేను దక్షిణాపథంలో ఉన్న తీర్థయాత్రలకు బయలుదేరాను. నేను తిరిగి వచ్చేవరకూ నీవు ఇలాగే ఉండాలి ” అని ఆదేశించారు. గురువాక్యం దాటరానిది . చర్చకి తావులేనిది. వినమ్రంగా శిరసా వహించాడు వింధ్యుడు.
ఇక అప్పటి నుండి అగస్త్యులవారు దక్షిణ భారతంలోనే స్థిరపడి పోయారు. ఆయనకిచ్చిన మాట మేరకు వింధ్య పర్వతం కూడా అలాగే ఉండి పోయింది. శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో అగస్త్యుని గొప్పదనాన్ని స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.
పలివెల లోని ఈశ్వరుడు అగస్త్య ప్రతిష్ఠ:
ఒకప్పుడు అగస్త్య మహాముని కౌశికానది తీరామున, పల్వలపుర ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా హిమాలయ పర్వతమున లోక కల్యాణార్థమై పార్వతీ పరమేశ్వరుల కల్యాణము అతి వైభవముగా జరుగుతోందని ఆయనకీ తెలిసింది . ఆ ఆదిదంపతుల కల్యాణమును చూచి తరించాలని తపించని ఆస్తికుడు ఉంటాడా ? అగస్త్య మహాముని కూడా అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు . అగస్త్యుడు వెళ్ళినట్టయితే, వింధ్య పర్వతము మళ్ళీ నిలబడి గ్రహభ్రమణమునకు ఆఘాతము కలుగజేసి ప్రమాదముంది . అలాంటి ఉపద్రవం జరుగుతుందని భయపడి ఇంద్రాది దేవతలు అగస్త్యుని ప్రయాణమును విరమింప చేయాలని, విశ్వబ్రహ్మను పంపారు. అగస్త్యుడు విశ్వబ్రహ్మ ద్వారా కల్యాణ మహోత్సవ వైభవమును శ్రవణానందముగా విని, తన దివ్యదృష్టితో కనులారా చూసి పార్వతీపరమేశ్వరులను కల్యాణ పసుపు వస్త్రములతో దర్శనమీయవలసిందిగా ప్రార్థించారు . పార్వతీపరమేశ్వరులు అగస్త్యునికి అలాగే దర్శనమిచ్చారు.
కల్యాణపీఠముపై దివ్యమంగళ స్వరూపులుగా విరాజిల్లుచున్న పార్వతీ పరమేశ్వరులను ఏకపీఠముపై పల్వలపుర దివ్యక్షేత్రములో భక్తుల కామితాలని తీర్చే నిమిత్తం , లోక కల్యాణార్ధం అగస్త్యుడు ప్రతిష్ఠ చేశారు . దీంతో ఈ క్షేత్రముకి “అగస్త్యేశ్వర క్షేత్రము” అని పేరు వచ్చింది . ఈ పల్వలపురమే కాలగమనంలో పలివెలగా రూపుదాల్చింది .
శ్రీ అగస్త్యేశ్వరుడు - కొప్పులింగేశ్వరుడు ఇలా అయ్యారు :
పల్వలపురంలో అలా అగస్త్య మహాముని వలన ప్రతిష్టింపబడిన ఈశ్వరుడు ఒకే పీఠంపైన ఉమాసహితంగా పూజలందుకున్నారు . అప్పుడు ఆయనకీ కొప్పులేదు . కాలాంతరంలో ఆయనకీ కొప్పు మొలిచింది . దానికీ ఒక స్థానిక ఐతిహ్యముంది .
అగస్త్యేశ్వరుని వెలనాటి వంశమునకు చెందిన ఒక విప్రుడు పరమ నిష్టాగరిష్టుడై విశేష భక్తితో పూజిస్తూ ఉండేవాడు. ఎంతటివారికైనా ఎక్కడో ఒక బలహీనత ఉంటుందన్నట్టు, మనవాడు వేశ్యాలోలుడు . ఆయన భక్తిలో లోటులేకపోయినా , ప్రవర్తనని భరించలేని భక్తులు రాజ్యపాలకునకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాజు ఒక రోజున ఆకస్మికంగా పూజారిని పరీక్షించాలని అనుకొని, పల్వలపురమునకు వచ్చాడు. ఆ సమయములో ఆ పూజారి వేశ్య దగ్గర ఉన్నాడు. మహారాజు రాక విని, రివాజు ప్రకారము నిర్మాల్య మాలికను రాజు గారికి ప్రసాదముగా ఇవ్వాలి . కానీ అప్పటికే ఉన్న మాలికాని తన సుందరి కొప్పులో అలంకరించేశాడా వేశ్యాలోలుడు . ఇంకొక పూలమాల లేదు . దాంతో , తన వేశ్య తలలో పెట్టిన మాలనే రహస్యముగా ఆలయములోనికి తెచ్చి, నిర్మాల్య మాలికగా రాజుగారికి ఇచ్చాడు.
మహారాజు ఆ నిర్మాల్య మాలికలో నిగనిగలాడుతున్న పొడవైన వెంట్రుకను చూసి శంకించి, పూజారిని ప్రశ్నించాడు. అతను “పరమశివుడు జటాఝూటధారి” కాబట్టి పూలమాలికకి అగస్త్యేశ్వరుని కేశము చుట్టుకొని ఉంటుందని బదులు పలికాడు. లింగమునకు జటాఝూటములు ఉండటమా అని రాజు ఆశ్చర్యపడి – సరే, అయితే, ఈ ఈశ్వరలింగముకి కేశములు చూపించు అన్నారు . దానికి పూజారి మహారాజా, ఇది మధ్యాహ్న సమయము, స్వామివారికి అభిషేక పూజా విధులు నిర్వర్తించి, మహానివేదన చేసి, నాగాభరణాలు అలంకరించాను. రేపటి ఉదయం వరకు అలంకరణాదులను తొలగించరాదు. మీరు ప్రాతః కాలము వరకు ఉంటే స్వామి జటాఝూటమును చూపిస్తాను అన్నాడు .
మహారాజు దానికి అంగీకరించి, జటాఝూటములు చూపింకపోతే నీకు శిరచ్ఛేదము తప్పదని చెప్పి, ఆ రాత్రి పల్వలపురంలోనే విడిదిచేశాడు. దాంతో పూజారి తనకు శిరచ్ఛేదము తప్పదని తలపోస్తూ, అంతరాలయంలో శివ సన్నిధిలో చివరి క్షణం గడిపితే, మోక్షం లభిస్తుందని ఆలోచిస్తూ , రక్షించమని స్వామిని అర్థిస్తూ ఉండిపోయాడు . తన తప్పుని మన్నించి , కొప్పుని ధరించి దర్శనమివ్వాలని పరిపరి విధాలా వేడుకున్నాడు . అప్పటికీ స్వామిలో మార్పుని గమనించక , ఆయన ఆకొప్పుని ధరించని పక్షంలో , రాజువేసే కొరతతో తానూ ప్రాణాలు విడువనని , లింగానికి తలబాదుకొని చనిపోతానని ప్రతిన బూని , ఆప్రయత్నంలో స్పృహకోల్పోయాడు .
భక్తుల మొరలు ఆ బోళాశంకరుడు ఆలకించనిదెప్పుడని ? లింగోద్భవ కాలంలో సర్వేశ్వరుడు తన జటాఝూటాన్ని కొప్పుగా ధరించి సాకారుడయ్యాడు . కానీ దాన్ని ప్రజలు, మహారాజు అంత త్వరగా నమ్మలేదు . ఉదయాన శివదర్శనానికి వచ్చినవారు , అదంతా పూజారి చేసిన అలంకారమని భ్రమించారు .
మహారాజు “ఏది ఒక వెంట్రుకని పెకిలించి తీసుకొని రా” అని ఆజ్ఞాపించాడు . పూజారి అలాగే చేశాడు. రాజుకు ఆ వెంట్రుక మొదట రక్తము కనిపించింది. అది చూసిన రాజుకు నేత్ర కళ్ళు పోయాయి . అప్పుడు మహారాజు పరమేశ్వరునకు అపచారము జరిగింది అని తలచి, దోషమును మన్నించి, దృష్టిని ప్రసాదించమని వేనోళ్ళ పరమేశ్వరుని వేడుకున్నాడు . పరమేశ్వరుడు శాంతించి రాజుకు దృష్టిని ప్రసాదించాడు. పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు గుర్తుగా రాజుగారు జుత్తుగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించు కొన్నాడు.
జుత్తుగపాడు అనే గ్రామం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరంలో వుంది. కాబట్టి, అగస్త్యేశ్వరుడు తన పూజారి ప్రాణాలను కాపాడటానికి కొప్పును ధరించడం వలన, అప్పటి నుండి శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామిగా నామాంతరము చెందారు. ఇప్పటికీ ఆ కొప్పుతో ఉన్న స్వామిని మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు .
పలివెల (Palivela), తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామము లొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం ఉంది .ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహిస్తారు . నవదంపతులైన ఆదిదంపతులని కదా ఇక్కడ అగస్త్యుడు ప్రతిష్టించారు . అందుకే ఈ స్వామీ కల్యాణాన్ని తిలకిస్తే, సాక్షాత్తూ కైలాసంలో జరిగే పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని చూసినంత ఫలితం సంప్రాప్తిస్తుందన్నది స్థల ప్రాశస్తి .