హారతి భగవంతునికి తీసే దిష్టా ?
హారతి భగవంతునికి తీసే దిష్టా ? దాన్ని కళ్ళకి అద్దుకోకూడదా ?
- లక్ష్మి రమణ
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజా లయమునకు నీరాజనం
అని అన్నమాచార్యులు అద్భుతమైన భక్తి రస కీర్తన ఆలపిస్తారు . అమ్మ రూపాన్ని అద్భుతంగా కళ్ళకి కట్టే ఆ దివ్యకీర్తన అమ్మ రూపాన్ని మనకి చూపిస్తుంది . లక్ష్మీ స్వరూపాన్ని దర్షింపజేస్తుంది . నీరాజనం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటే, దాన్ని కళ్ళకి అద్దుకోవచ్చా లేదా అనేది బోధపడుతుంది .
హారతి దేవుడికి తీసే దిష్టని, దాన్ని కళ్ళకి అద్దుకోకూడదని కొందరి అభిప్రాయం. కానీ హారతిని సంస్కృతిలో నీరాజనం అంటారు. దీని అర్థాన్ని తెలుసుకున్నాక, అసలు హారతి ఇవ్వడంలో అంతరార్థాన్ని , దాని ప్రాశస్త్యాన్ని అవగాహన చేసుకోగలరు. నిః అంటే నిశ్శేషముగా అంటే పూర్తిగా పరమాత్మను ; రాజనం అంటే ప్రకాశింపజేయడం అని అర్థం . అంటే పరమాత్మని పాదముల నుండీ , మోకాళ్ళు , నాభి, ముఖము వద్ద కొంత కొంత సంఖ్యలో ప్రదక్షిణముగా హారతిని తిప్పడం నీరాజనం అనే క్రియగా చెప్పబడింది. పూర్తిగా పరమేశ్వరుడిని ప్రకాశవంతం చేస్తూ, దర్శనం చేయించిన ఈ హారతిని కళ్ళకి అద్దుకోవడం, ఆ వెచ్చదనంతో కూడిన చేతితో పరమాత్మ ప్రకాశం అనే భావనతో తలని స్పృశించడం పూర్వకాలం నుండీ మనకి శిష్టాచారంగా వస్తున్నాయి. అందువల్ల వీటిని పాటించడం తప్పు కాదు .
ఇక దిష్టి తీసే హారతిని కూడా దేవాలయాలలో ఇస్తారు . అది ఊరేగింపు తర్వాత ఆలయ సింహద్వారం దగ్గర ఇస్తుంటారు . ఈ సమయంలో అర్చకులు దేవునికి దిష్టి తీసి , దూరంగా పడేస్తారు . ఇది దేవునికి తీసే దిష్టి , దీనిని కళ్ళకి అద్దుకోమని వాళ్ళు కూడా చెప్పరు.
ఈ రెండింటికీ మధ్య ఉన్న అంతరాన్ని మనం గుర్తించాలి . కనుక పరమాత్మ దర్శనాన్ని మనకి చేయించే అంతరాలయంలో ఇచ్చే హారతిని, ఇంట్లో మనం భగవంతునికి ఇచ్చే హారతిని చక్కగా కళ్ళకి అద్దుకోవచ్చు. తప్పేమీలేదు .
శుభం !!