Online Puja Services

అయ్యప్ప స్వామికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది ?

3.145.163.138

అయ్యప్ప స్వామికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది ?
- లక్ష్మీరమణ 

పవిత్రమైన కార్తీకం , మార్గశిరం , ధనుర్మాసపు రోజులలో భారతావని ‘ సామియేయ్ శరణమయ్యప్ప! హరిహరసుతనేయ్ శరణమయ్యప్ప!’ అని స్వామి ఘోషతో మారుమ్రోగుతూ ఉంటుంది.  అటు శంకరునికి ప్రీతిపాత్రమైన కార్తీకం, ఇటు కేశవ ప్రీతికరమైన మార్గశిరం, ధనుర్మాసం ఈ మాసాలలో శివకేశవుల తనయుడైన హరిహరుని దివ్యమాల ధారణం గొప్ప విశేషమే కదా ! దాదాపు నవంబర్ మధ్యకాలం (సాధారణంగా 16వ తేదీ ) నుండీ జనవరి మొదటివారం వరకూ కొనసాగే అయ్యప్ప దీక్షల్లో స్వామికి అభిషేకం చేయడం పరిపాటి.  అలా అయ్యప్ప అభిషేక ప్రియుడు. నియమాల తోరణం కట్టి, భక్తి ఇరుముడి నెత్తిన పెట్టి , పదునెట్టాంబడిని శరణు ఘోషతో అధిగమించి,  అయ్యప్పకు అభిషేకం చేస్తే , ఆ స్వామి అనుగ్రహించని వరమే లేదు. అసలు ఆ అయ్యప్పని అందుకోవడంకన్నా , జీవితంలో మరో వరము కొరవలసినదీ లేదు. అయితే, అయ్యప్పకు ఏ ద్రవ్యముతో అభిషేకం చేయడం విశేషం అంటే, గురుస్వాములు ఇలా తెలియజేస్తున్నారు. 

ఏ పరీక్షకి కూర్చోకపోతే సర్టిఫికెట్ ఎలా వస్తుంది? భగవంతుని చేరుకోవాలంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకొనే పరీక్షని పాసవ్వాలి. అప్పుడు భగవంతుని తత్త్వం అర్థమవుతుంది.  మనకున్న భక్తి ముక్తికి దారితీసి బతుకు సార్థకమవుతుంది. అందుకే, అయ్యప్ప తన చురకత్తిని విసిరి, ఆ కత్తి పడ్డచోట పదునెనిమిది మెట్ల సింహాసనం మీద కొలువై ప్రత్యక్షదైవంగా అలరారుతున్నారు. తాను ప్రత్యక్షంగానే ఎదురుగానే ఉన్నా , తనని ఆశ్రయించేవారు దీక్ష పట్టాలని నియమాన్ని విధించారు. ఆ దీక్షని దక్షతగా నడిపించేందుకు అవసరమైన చోదకంగా స్వామియే శరణమయ్యప్ప అనే అయ్యప్ప నామాన్ని ప్రసాదించారు. ఇలా దీక్ష పట్టి, అహం బ్రహ్మాస్మి అనే భావనని అర్థం చేసుకొని ఎవరైతే పదునెట్టాంబడి ఎక్కుతారో వారిని నేను సదా రక్షిస్తుఉంటానని తన అవతార విశేషంలో స్వయంగా చెప్పారు అయ్యప్ప స్వామి. 

 ముందుగానే చెప్పుకున్నట్టు అయ్యప్ప అభిషేక ప్రియుడు. ఆ గంగాతరంగుడి పుత్రుడై నందువల్ల ఆ స్వామికి ఈ అభిషేకాలమీది మక్కువ ఎక్కువేమో మరి ! తండి పోలిక కావొచ్చు. అయితే అది భక్తులని అనుగ్రహించేందుకే అంటున్నారు గురుస్వాములు. వారి వివరణ ప్రకారము అభిషేకద్రవ్యాలూ , అయ్యప్పకు ఆ విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన లభించే ఫలితాలూ ఈ విధంగా ఉంటాయి . 

పాలతోటి అభిషేకం చేస్తే మంచి పేరు ప్రతిష్టలని పొందుతారు. 

పెరుగు తోటి అయ్యప్పకు చేసే అభిషేకం వంశాన్ని వృద్ధి చెందిస్తుంది. 

కొబ్బరి నీటితో స్వామికి అభిషేకం చేస్తే మంచి బుద్ధులు, సత్పుత్రులు లభిస్తారు. 

తేనెతోటి అయ్యప్ప స్వామిని అభిషేకిస్తే శాస్త్ర జ్ఞానము సిద్ధిస్తుంది. 

పానకం తోటి స్వామికి అభిషేకం చేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. 

పంచామృతాలతో స్వామికి అభిషేకం చేస్తే దీర్ఘాయువుని ప్రసాదిస్తాడు అయ్యప్ప. 

శుద్ధోదకం (గంగాజలం)తో అభిషేకిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది

కుంభజలాలతో అంటే కలశ జలాలతో అభిషేకం చేస్తే మనశ్శాంతి, భక్తి, ముక్తి లభిస్తాయి.  

ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యము, మోక్షము, అభివృద్ధిని ఇచ్చి ఆశీర్వదిస్తాడు ఆ హరిహరుడు . 

 అయ్యప్పస్వామికి  గంధాభిషేకం చేస్తే పుత్ర లాభము, స్వర్గ భోగము సిద్ధిస్తాయి. 
 
భస్మం తోటి అభిషేకం చేస్తే మహా పాపనాశనం జరుగుతుంది. 

పన్నీటితోటి స్వామిని అభిషేకిస్తే రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. 

వలంపురి శంఖముతోటి అభిషేకం చేస్తే రోగ నాశనము చేసి ఆరోగ్యవంతులుగా దీవిస్తాడు అయ్యప్ప . 

సహస్ర ధారాభిషేకం చేస్తే, ధనలాభము సిద్ధిస్తుంది. 

 అన్ని రకాల ఫలాలతోటి ఏ పలరసంతోనైనా స్వామికి అభిషేకం చేయవచ్చు. ఇలా చేయడం వలన వ్యవసాయ అభివృద్ధి, శత్రు జయము సిద్ధిస్తాయి. 

శుద్ధమైన అన్నంతోటి స్వామికి పగలు మాత్రమే అభిషేకం చెయ్యాలి. దీనివలన దేహ కాంతి సిద్ధిస్తుంది. సర్వ తీర్థాలలో స్నానం చేసిన ఫలితము లభిస్తుంది. 

 అన్ని రకాల పుష్పములతోటి అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం చేయవచ్చు. దీనివల్ల కుటుంబంలో ఆనందము, పాపనివృత్తి జరుగుతాయి. 

నవరత్నాలతోటి స్వామికి అభిషేకం చేస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి శాంతి సిద్ధిస్తుంది.  రజిత అభిషేకం చేస్తే జ్ఞానము, శాంతి, పొన్నాంబళంలో స్వామిని అభిషేకించినటువంటి ఫలితము లభిస్తుంది. 

వస్త్రములు గనక స్వామికి సమర్పించినట్లయితే రాజయోగము, ఆత్మశుద్ధి కలుగుతాయి.
 

అభిషేకాన్ని నిర్వర్తించి భజనలో అయ్యప్పలు ఈ పాటని ఖచ్చితంగా పాడుతూ ఉంటారు . 

పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు
కట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి
పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా
హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే
భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప
నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే
పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు|
స్వామియే శరణమయ్యప్ప !!

#ayyappa

Tags: ayyappa, abhishekam, 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore