Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 77

18.191.27.78

శ్రీమదాంధ్ర భాగవతం - 77

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

కాలియునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ ఒంటిమీద వున్నా ఆభరణములు చిక్కుపడి చెల్లాచెదరయి పోతుండగా, కొప్పు ముడులు విడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే ఒంటిమీద బట్ట సరిగా ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా పరుగుపరుగున అక్కడకు వచ్చి చంటిపిల్లలను కృష్ణుని పాదముల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈ కాళియుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో! ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో! ఎటువంటి గొప్పగొప్ప పనులు చేశాడో! మహాత్ములయిన వారికి కూడా దర్శనం అవని నీ పాదపద్మములు ఈవేళ మాభార్త తలలమీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళిచేత అలంకృతమయ్యాయి. ఇవాళ మా భర్త పుణ్యాత్ముడు. అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహమును యిచ్చావు. ఈవేళ లక్ష్మీదేవికంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగామును ఇవాళ మా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది’.

‘ఈశ్వరా! మా తల్లిదండ్రులు ఈ కాళియుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అతనిని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుదని, మమ్మల్ని యితనికిచ్చి పెండ్లిచేశారు. మా అయిదవతనం, మా పసుపుకుంకుమలు యితని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్ళిచేస్తే మాకు పసుపు కుంకుమలు వచ్చాయి. అయిదవతనం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఉండవు అని నీవు తెల్చేస్తున్నావు. నీవు అనాథ నాతుడవు. అటువంటప్పుడు నీవే మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? భక్తుల కోర్కెలు తీర్చే స్వామీ, మాకు పతిభిక్ష పెట్టవలసినది’ అని అడిగారు.

ఇప్పుడు కాళియుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ‘ఈశ్వరా, తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడినుంచి వచ్చినదో నేను గ్రహించగలిగాను’ అన్నాడు. కాళియుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నారు –

ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు త్రాగుతారు. నీవంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్ళు విషం అవుతాయి. నీవు యిక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపమునకు వెడితే గరుడుడు నిన్ను చంపెస్తాడని భయపడుతున్నావు. నీ భయం నాకు తెలుసు. నీకా భయం లేకుండా ఇవ్వాళనుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదములు కనపడతాయి. కృష్ణ పాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తరుమదు. గరుడుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. అందుకని రమణక ద్వీపమునకు వెళ్ళిపో’ అలా అనగానే కాళియుడు కృష్ణునకు నమస్కారం చేసి తేనే మొదలగు మధుర పదార్థములు, మంచిమంచి హారములు, పట్టు బట్టలు తెచ్చి కృష్ణ భగవానునికి బహూకరించి తన స్నేహితులతో బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరల రమణక ద్వీపమునకు వెళ్ళిపోయాడు.
ఈ కాళియ మర్దనమును ఉభయ సంధ్యలందు ఎవరు వింటున్నారో వారికి ఇన్నాళ్ళనుండి కాళియుడిళా లోపల పట్టిన విషము పోతుంది. బాహ్యమునందు కాళియమర్దనం విన్న వాళ్ళని పాములు కరవవు. అది కృష్ణ భగవానుడి వరం.

ఇందులోని తత్త్వమును మనం గ్రహించాలి. కాళియుడంటే ఎవరో కాదు. మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హ్రుదయక్షేత్రమునుండి 101నాడులు బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు యిస్తాడు. వీటిని మీరు సద్బుధ్ధితో వాడుకున్నట్లయితే అందరియందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి ఇపుడు కాళియుడు వచ్చి కూర్చున్నాడు. కాళియుడికి ఒక రహస్యం ఉంది. యితడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. ‘రమణ’ అనే మాటకు శబ్ద రత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో డానికి రమణకము అని పెరు. అనగా ఎలా ఉండాలో అలా వుంటే అది రమణకము. కాళియుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ వున్న వాళ్ళకి గ్రద్దలంటే భయం. అందుకని ప్రతిరోజూ కూడా కొంతకొంతమంది కొద్ది తేనె, కొద్ది చలిమిడి, కొద్ది చిమ్మిలి పట్టుకువెళ్ళి గ్రద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా నియమమును ఏర్పాటు చేసుకున్నారు. గ్రద్దలు వచ్చి అలా పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒకరోజున కాళియుని వంతు వచ్చింది. వానిని కూడా కొద్ది తేనే, చిమ్మిలి చలిమిడి పెట్టమని అడిగారు. ‘ఎవరికి పెట్టాలి?’ అని అడిగాడు కాళియుడు. గరుడుడు వస్తాడు అతనికి బాలి ఆహారమును పెట్టాలి అన్నారు. అపుడు కాళియుడు ‘గరుత్మంతు డెవరు? నేను పెట్టను. నేను బలవంతుడిని’ అన్నాడు. అయితే నీఖర్మ అని కాళియుడిని వదిలేశారు.

గరుత్మంతుడు వచ్చి ‘నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు? అని అడిగాడు. మిగిలిన పాములు కాళియుడు పెట్టలేదని చెప్పాయి. కాళియుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళేలోపల గరుత్మంతుడి మీదకి కాళియుడు వెళ్ళాడు. తన నూరు పడగలూ ఎత్తి గరుత్మంతుడి ఎడమ రెక్క మీద కాటు వేసాడు.
గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళియుడిని వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు.కొడితే కాళియుడి ఒళ్ళంతా బద్దలయిపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనుక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళియుడికి గరుత్మంతునికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. ఆటను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు.

అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌభరి మహర్షి గరుత్మంతుడిని శపించారు. ‘సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు కాబట్టి నీవు ఎప్పుడయినా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు’ అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. కాబట్టి కాళియుడు కాళింది సరస్సును చేరాడు.

ఈశ్వరుడు ముందు రమణకమును అనగా మనుష్య శరీరమును యిస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము. దీనితో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు. కాళ్ళతో దేవాలయమునకు వెళ్ళవచ్చు. చెవులతో భాగవతమును వినవహ్చు. నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఏమి చేస్తాడంటే సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ, దేవతలకు తాను పెట్టవలసిన భాగమును పెట్టడు. తత్సంబంధమయిన క్రియలు చేయడం మానివేస్తాడు. నీవు ఎన్ని సుఖములను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కనయినా పూజగదిలో పెట్టి రోజూ ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకు అడ్డుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేమీ చేయదు. చేయనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. దేవతలు ఆగ్రహమును ప్రదర్శిస్తారు. అపుడు ప్రమాదం వస్తుంది. అక్కడే వుంది మరల దేవతారాధన చేస్తే చిన్నతనం! అందుకని ఎవరెవరు దేవతారాధనకు యిష్టపడరో అటువంటి చోటికి వెళతాడు.అందుకని ఇక్కడ కాళియుడు కాళింది మడుగుకి వెళ్ళాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషముగా తయారుచేస్తున్నాడు. తనలో వున్నా నూరు జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. ఇప్పుడు భయంకరమయిన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు యీ విషమును వెనక్కి తీయడు. ఆ అహంకారము పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు యింక క్షమించడు. అందుకని గోపాల బాలురు ఆవుదూడలు మడుగులోని నీటిని త్రాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది తన భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు ఊరుకోడు. నూరు పడగలు పగిలి పోయేటట్లు తొక్కేశాడు. కాళియుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇపుడు లోపల వున్నా బుద్ధి సద్బుద్ధి అయింది. ఇపుడు విషమును బయటకు తీసి మరల వదిలిపెట్టాడు.

కాళియమర్దనము వింటే మనలోని నూట ఒక్క నాడులలో వున్న విషం వెనక్కు వెళ్ళి సద్బుధ్ధితో మనం అందరం హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళియ మర్దనమునకు బాహ్య ప్రయోజనము ఏమిటి? అంటే పాము కరవదు. అంతర ప్రయోజనము ఏమి? అంటే లోపలిపాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చేయదు. మరల రమణక ద్వీపం చేస్తుంది. కాళియమర్దనం వినగానే మరల ఈ శరీరమంతా శుద్ధి అయిపోతుంది. కాళియమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమయిన స్థితి ఉంది.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya