Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 73

3.144.40.239

శ్రీమదాంధ్ర భాగవతం - 73

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

ఒకనాడు గోపాలురందరూ కలిసి నందవ్రజంలో జరుగుతున్న సంఘటనలను గురించి చర్చించుకుంటున్నారు. ‘నందవ్రజంలో చాలా విపరీతమయిన సంఘటనలు జరుగుతున్నాయి. చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతోమంది రాక్షసులు ఎన్నో రూపములతో వచ్చారు. ఇతనిని సంహరిద్దామనుకుంటున్నారు. కేవలము భగవంతుని నిర్హేతుకమయిన కృప వలన కృష్ణుడు కాపాడబడుతున్నాడు. కాబట్టి మనం ఈ ప్రాంతమును విడిచిపెట్టేద్దాము. ఇక్కడకు దగ్గరలో బృందావనము అనే ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ సమృద్ధిగా నీరు దొరుకుతుంది. పచ్చిగడ్డి దొరుకుతుంది. మనం అందరం భద్రంగా ఉండవచ్చు’ అని అక్కడ వున్నా గోపకులలో పెద్ద వాడయిన ఉపనందుడు అనే ఆయన అన్నాడు. మిగిలిన గోపకులందరూ ఆయన చెప్పిన మాట విన్నారు. ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యంత పవిత్రమయిన ప్రదేశములలో బృందావనం ఒకటి. భగవంతునితో సంబంధం కలిగిన మహర్షులు కూడా అక్కడకు వచ్చి బృందావనంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారు. బృందావనంలోని మట్టిని తీసి కొద్దిగా నోట్లో వేసుకున్న వాడు గొప్ప అదృష్టవంతుడు. ఉత్తరక్షణం నందవ్రజంలోని గోపగోపీజనం ఆ ప్రదేశమును వదిలిపెట్టి, బృందావనమునకు బయలుదేరి వెళ్ళిపోయారు.

వత్సాసుర వధ

ఇపుడు ఒక చిత్రమయిన లీల జరిగింది. ఆవులమందలోకి కొత్త ఆవుగాని వచ్చినట్లయితే గోపబాలురు దానిని కనిపెట్టేస్తారు. ఒకనాడు ఆ మందలోనికి ఒక కొత్త ఆవు వచ్చింది. వీళ్ళు దానిని కనిపెట్టి ఆ విషయమును కృష్ణునికి చెప్పారు. కొత్త ఆవుదూడ చెంగుచెంగుమని ఆడుతోంది. కృష్ణుడు దానిని చూశాడు. కొత్తగా వచ్చిన దూడ ఒక రాక్షసుడు. కంసుని పనుపున కృష్ణుని చంపడానికి దూడ రూపంలో వచ్చాడు. వాని పెరు వస్తాసురుడు.

కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా దాని దగ్గరకు వెళ్ళి, దాని తోక పట్టుకున్నాడు. తరువాత రెండు చేతులూ చాపి దాని నాలుగు కాళ్ళను పట్టుకుని గభాలున పైకెత్తి, తోకతో ఆ నాలుగు కాళ్ళను కట్టేశాడు. ఇపుడు ఆ దూడను చంపెయ్యాలి. దానిని గిరగిర తిప్పి అక్కడే వున్నా వెలగచెట్టుకు వేసి కొట్టాడు. అలా కొట్టేసరికి అక్కడ ఏకకాలంలో ఇద్దరు రాక్షసులు చచ్చారు. ఒకడి పెరు కపిత్థాసురుడు, వెలగచెట్టు రూపంలో వచ్చాడు. రెండవ వాడు వత్సాసురుడు, అతడే దూడ రూపంలో వచ్చాడు. ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్ప వృష్టిని కురిపించారు. ఎంత రాక్షసుడు అయినప్పటికీ శ్రీకృష్ణుడంతటి వాడు ఆవుదూడను అలా చంపవచ్చునా – అది పాపము కాదా- అది గోహత్య అవలేదా అనే సందేహం మనకి కలుగుతుంది. ఆవుదూడ రుచికి ప్రసిద్ధి. ఆవుదూడకి ఏది పడితే అది పడదు. ఆవుదూడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలుకూడా చాలా తక్కువగా తాగిస్తారు. తినకుండా ఉండడానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తారు. అది ప్రతిదానినీ తిందామనుకుంటుంది. అలాగే వెలగ పండు వాసనకు ప్రసిద్ధి. వాసనను దాచలేము. ఆవుదూడ, వెలగపండు రుచికి, వాసనకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. రుచి వాసనలు మనలను జన్మ జన్మాంతరములుగా తరుముతుంటాయి. ఉండకూడని రుచి, వాసనల యందు మనస్సు నిలబడి పోయినట్లయితే దానివలన చాలా ప్రమాదం ఉంది. అందువలనే ప్రయత్నపూర్వకంగా సుఖములను పరిత్యజించడం అలవాటు అవాలి. లేకపోతె ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒకదానియందు ఉండిపోతుంది. అంత్యకాలం వచ్చినపుడు మనస్సు డానికి బాగా ఇష్టమయిన రుచిని పట్టుకుని, యింద్రియములను గబగబా మూట కట్టి ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదే వాసన. వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినపుడు పాత శరీరము నుండి వాసనను తీసుకువస్తుంది. అందుకనే పుట్టుకతోనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గ ఆలోచనలు చేస్తాడు. ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు వెడతాడు. ఈ వాసన వెలగపండు. అసురీశక్తి. మనస్సు అనుభవించడం, గుర్తుపెట్టుకోవడం అనేదే రుచి. వెళ్ళిపోయే ముందు మనస్సు బతికి వున్నన్నాళ్ళు వ్యామోహం దేనిమీద పెరిగిపోయిందో దానినే పట్టుకుని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే తరువాతి జన్మలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకనే ఒక్కొక్కడు చిన్నతనం నుంచే దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతాడు. వాడిని వెనక్కు తీసుకురాలేము. అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగుచేయగలదు. వాడికి ఈ లీల వినిపించాలి. అమ్మను చూడగానే కాముకత్వం ఎలా చల్లారి పోతుందో అలా ఈశ్వరుని గురించి వినేసరికి వాసనా బలం క్షీణించి ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. మీరు మీ వాసనలను ముందు జయింపలేరు. అందుకని భక్తితో కృష్ణా కృష్ణా అని భగవంతుని ప్రార్థించాలి. భాగవతం దశమస్కంధము వినాలి. ఈ లీలవిని పొంగిపోవాలి. కృష్ణుడిని మనసులో పెట్టాలి. అపుడు ఈ రుచి లోపలి, ఈ వాసన పైకి వస్తుంది.

బకాసుర వధ

ఒకానొక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవానుడిని చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పెరు బకాసురుడు. బకుడు అనగా కొంగ. గోపకులు అందరూ ఉదయముననే కృష్ణ బలరాములతో కలిసి తమ గోసంపదనంతటినీ తీసుకుని బృందావనమునకు బయలుదేరారు. వారికి అక్కడ ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. బకుడు అన్ని పనులను మానివేసి ఒకే విషయం మీద దృష్టిపెట్టి ధ్యానంచేస్తున్న వాడిలా, తాను నోరు విప్పి మాట్లాడితే అది తన సత్త్వ రూపమునకు భంగమన్న ఉద్దేశంతో, మహాపురుషులయిన వారు మౌనమును ఆశ్రయించి ఎలా ఉంటారో అలా, ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా, శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టిపెట్టి ఉన్నాడు. మీరు కొంగను పరిశీలించినట్లయితే అది చాలా ఆశ్చర్యకరంగా నిలబడుతుంది. అది చెరువు ఒడ్డునో ఎక్కడో ఒక్క కాలు మీద నిలబదినట్లుగా ఉంటుంది. చూడడానికి చాలా సత్త్వగుణంతో ఉన్నదని, ఒకరికి అపదారం చేయనిది నమ్మేలా ఉంటుంది. కానీ దాని మనస్సులో ఉండే భావన వేరు. కృష్ణ పరమాత్మను ఈ గోపబాలుర నుండి వేరుచేస్తే, కృష్ణుడిని ఒక్కడినీ నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములను విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడనబడే రాక్షసుడు కృష్ణుడిని చంపాలనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏది కొత్తది కనపడినా కృష్ణుడికి చెప్పడం గోపబాలురకు అలవాటు. ‘కృష్ణా, ఆ కొంగను చూడు, అది ఎంత తెల్లగా, పెద్దగా ఉందొ చూడు’ అన్నారు.

అది ఒక్కసారి తన పాదమును భూమికి వేసి తాటించి పైకిలేచి,రెక్కలు అల్లారుస్తూ నోరుతెరుస్తూ, నోరు మూస్తూ, ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ వున్న చెట్ల కొమ్మలు విరిగి కిందపడిపోతున్నాయి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన రెండు చంచూపుటములలో యిరికించుకుని ఎగిరిపోయి ఒక పర్వట శిఖరం మీద అకూర్చుని కృష్ణుడిని మింగేసింది. ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో, కృష్ణుని బకుడు మింగేస్తే గోపబాలురు అలా అయిపోయారు. ఆయన లేనినాడు తమకు అస్తిత్వమే లేదని భావిస్తున్నారు. ఇదీ భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం. ఇదీ వారికి వున్నా భక్తి. కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు. ఆ పదార్థము అటువంటిది. ఏవస్తువును ప్రేమిస్తే ఆనందమును మాతమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మము అని తెలియనక్కరలేదు. ఎప్పుడయితే వీరంతా ప్రాణములు లేని యింద్రియములలా అయిపోయారో ఉత్తర క్షణమునందు కొంగ కంఠమునందు ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలే అయిపోయినాడు.

కంఠమునందు వున్నవాడు బయటవున్న గోపబాలుర ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే, పరమాత్మ ఉత్తరక్షణం వైకుంఠమునకు చేరగలడు. కానే తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి యిపుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం యివ్వాలి. అందుకని కొంగ కంఠం నుండి బయటకు రావడానికి ఆయన అగ్నిహోత్రం అయిపోయాడు. వెంటనే కొంగ కక్కేసింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు ముక్కుపుటములతో పొడిచి చంపేస్తాను అలా చంపి మ్రింగివేస్తాను అని తన చంచూపుటములు పెట్టి పొడుస్తూ ఆయన వెంట పడింది. అటువంటి దాని చంచూపుటములను రెండింటిని గట్టిగా పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లుగా చీల్చి, కృష్ణుడు ఆ పక్షిని చంపివేశాడు. ఆ పక్షి కొంగగానే ఎందుకు రావాలి? వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చంపాడు. అలా రాకుండా చంపకూడదా?బకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేదు. మనలోనే ఉన్నాడు. అతని పెరు దంభము. దంభము అంటే పైకి ఒకలా కనపడుతూ లోపల మరొకలా ఉండుట. దంభమును నిగ్రహించలేరు. ఇది పైకి ఒకలా ఉంటుంది. లోపల ఒకలా ఉంటుంది. ప్రతిక్షణం వెన్నంటి ఉంటుంది. మనస్సును ప్రయత్నపూర్వకంగా గెలవాలి. దంభము మహా పాపకార్యము. దంభము సత్యముగా ఉండడమును అంగీకరించదు. సత్యమంటే కృష్ణుడు. కృష్ణుడిని తినేస్తాను అంటుంది. లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా వుండే ప్రయత్నం మొదలు పెట్టాలి. అందుకు భగవంతుని స్మరణ చేయడం మొదలు పెట్టాలి. ఈ నామ స్మరణ మనస్సుని నిరంతర ప్రక్షాళన చేస్తూ ఉంటుంది.

దంభమును తప్పించుకోవడం కష్టం. అది సత్యమును మ్రింగుతుంది. అందుకని ముందుగా కృష్ణుడు మ్రింగబడాలి. ఆర్తి చెందేవాడు వుంటే అగ్నిహోత్రమై బయటకు రావాలి. దంభమును చీల్చాలి. అలా చీలిస్తే కృష్ణుడు తనంత తాను గోపాల బాలురకు దక్కాడు. ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయనను ఆర్తితో ప్రార్థిస్తే ఆయనే మన దంభమును తీసువేస్తాడు. ఆయనే మనలను రక్షించి పుణ్య పురుషుడుగా మారుస్తాడు.

దీపము మీద వెళ్ళి పడిపోయిన శలభాములు ఎలా కాలిపోతాయో అలా ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వారందరూ మడిసిపోయినారు. హృదయంలో భగవంతుని నిలబెట్టడం చేతనవాలి. అసురీ గుణములు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినా నామం పట్టుకుని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మడిసి పోయి రాలి పోయి, నీవెప్పుడూ పవిత్రమయి ఉండిపోతావు. గోపాల బాలురు కృష్ణుని గురించి ఆర్తి చెందినట్లు మనుష్య జన్మలోనికి వచ్చినందుకు నీవు భగవంతుడి గురించి ఆర్తిచెండడం నేర్చుకోవాలి. ఇది వేరొకరి ప్రబోధం చేత వచ్చేది కాదు. నీఅంత నీవుగా పరిశీలనం చేసుకోవాలి. భగవంతుని గూర్చి ఆర్తి, భక్తి అలవాటు చేసుకోవాలి. అవి మాత్త్రమే నిన్ను రక్షించగలవు. అన్యములు రక్షించలేవు. బకాసుర సంహార వృత్తాంతము నుండి ఈవిశాయమును మనం గ్రహించాలి.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore