Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 63

18.227.0.57

శ్రీమదాంధ్ర భాగవతం - 63

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

నవమస్కంధము – అంబరీషోపాఖ్యానము 

అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమయిన విషయము. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి. ఆయన పాటించిన గుణములు మనందరం మన జీవితములలో పాటించవలసినవి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమయిన విషయము. చాలా గొప్ప అధికారం వుండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమయిన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్న వాడు మనకి కనపడడు. కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపము నుండి తప్పించుకున్నాడు. అదీ ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం. 

అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పాదములను పట్టుకుని ఉండేది. అనగా ఆయన పరిఢవిల్లిన భక్తిచేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరి గుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథా శ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు.భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్య పాలనమును విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రముల మీద, ధనం మీద, ఉద్యాన వనముల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురము మీద కోరిక లేదు. కానీ వీటి అన్నింటితో ఉన్నాడు. దీనినే కర్తవ్య నిష్ఠ అంటారు. ఆయా విషయముల యందు వెర్రిగా వ్రేలాడడం లేదు. 

అలా పరమ పవిత్రమయిన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వసిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలములను ఇచ్చాడు. ఒక సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతము చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశీ వ్రతమునకు, ద్వాదశీ వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రము నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే ‘అశనము’ అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అశనము అంటే వ్యక్తికీ క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్నా, ఆకలి వేస్తున్నా తినుండా తనని తాను ఒకరోజు మాడ్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్త్వికమయిన పదార్ధం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమయిన సాత్త్వికమయిన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము ఉంటారు. అంబరీషుడు ఏకాదశీ వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పదార్థములను తినేయ్యడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశీ వ్రతమును పూర్తి చేసేశాడు. ఏకాదశి తిథి అయిపొయింది తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సరకాలం పాటు చేసిన ఏకాదశీ వ్రతం పరిపూర్ణమయింది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశీ వ్రతం పూర్తి అవుతోంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి వుండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసేముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరం మధువనం లోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపు నిండా తినిన తరువాత యితడు ద్వాదశి పారణం చేయాలి. తనుకూడా భోజనం చేయాలి.

అందరి భోజనములు పూర్తి అయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధ పడుతుండగా అక్కడికి దుర్వాసో మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలముల యందు వేదముల యందు వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించిన వాడు. గొప్ప తపస్సును పాటించిన వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటివాడు. వచ్చిన దుర్వాసో మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి ‘అయ్యా! ఊరకరారు మహాత్ములు! ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి. నీవు నా యింటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము. ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరూ నేనూ తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన యిద్దరికీ యిదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్త శేషమును నేను తింటాను’ అన్నాడు

దుర్వాసో మహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నదీ జలములలో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దుర్వాసో మహర్షి మహా భక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇపుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అతను పారణ చేయాలి. లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపల పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రత భంగం అయిపోతే ఆటను మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో వున్న మహా పండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ‘ఆయన చూస్తే మహర్షి, ధ్యానంలో ఉన్నాడు. పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థు. వ్రతం చేసి వున్నావు. భంగం జరుగ కూడదు. పోనీ పారణ చేసేయ్యడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్యే మార్గం ఒకటి చెపుతాము. సలిలము పుచ్చు’ అన్నారు. అంటే కాసిని నీళ్ళు తాగమన్నారు. అయితే ‘నేను కొద్ది నీళ్ళు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేశామునే నేను భోజనముగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అందుకని నీళ్ళు ఒక్కటే పుచ్చుకుంటాను’ అని ఆయన నీళ్ళను పుచ్చుకున్నాడు. 

ఇలా ఇక్కడ నీళ్ళు పుచ్చుకోగానే దుర్వాసో మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురువచ్చి అయ్యా! ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనమునకు కూర్చోండి. తరువాత నేను చేస్తాను’ అన్నాడు. ఇపుడు దుర్వాసుడు అంబరీషుడు నీళ్ళు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి. ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ. రెండూ కలిసి ‘ఇంత మహర్షిని నేను నీకు ఇంత చవకబారు వానిలా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ యింట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను. నా భుక్త శేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానము. కాబట్టి నిన్ను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏమి చేస్తానో. ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి’ అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్ళు తీసుకుని తన జటాజూటం నుండి జటనొకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమయిన ఒక క్రుత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెపితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళముందు కృత్య అంబరీషుని తినెయ్యాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇపుడు ఆ క్రుత్యను ప్రయోగించాడు. ఈ కృత్య చేతిలో భయంకరమయిన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమయిన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయివుంది అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమయిన కోపం పెంచేసుకుంటున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధ పడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. ‘నాకు తెలిసి అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషము దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు’ అని నమస్కారం చేస్తూ నిలబడి పోయాడు. ఇపుడు ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి. 

ఇపుడు సుదర్శనం కదిలింది. ఇపుడు ధర్మం అంబరీషుని యందు ఉన్నది. సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తరువాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. ఇపుడు సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఆయనకిప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణ రక్షణలోకి వచ్చాడు. దుర్వాసుడు పరుగెత్తి పరుగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. అపుడు బ్రహ్మగారు మిక్కిలి చతురతతో ‘అయ్యో మహర్షీ, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? యిప్పుడు నీవు విష్ణు మూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోతుందో ఆ సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రమును నేను ఆపలేను’ అన్నారు. ఇపుడు దుర్వాసుడు కైలాసమునకు పరుగెత్తాడు. దుర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవా! నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది’ అన్నాడు. అపుడు పరమశివుడు ‘నాకూ, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదయినా ఉన్నదంటే అది విష్ణు మాయ ఒక్కటే. అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడి ప్రార్థించు’ అని అన్నాడు. ఇపుడు దుర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. అక్కడ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన రెండు కాళ్ళను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అపుడు ఆయన ‘ఏమిటయ్యా యిలా పడిపోయావు. ఏమయింది? లేవవలసింది’ అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెటినవాడు ఆయనే కదా! కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. అపుడు ఆయన ‘నాకు ఒక బలహీనత ఉంది. తీగలన్నీ పీకి తాడుచేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉన్నాడని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలచుకుంటూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. నేనేకావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దానివెనక ఆవు పరుగెత్తినట్లు నేను వానిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరుగెడుతుంటాను. కాబట్టి నీ వెనుక వస్తున్నా నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది. వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేశాడా, రాజా, కేవలం వ్రతం చేశాడా యివన్నీ నేను చూడను పరమ భక్తితో ఉన్నవాడికి నేను వశుడనయి ఉంటాను. అన్నిటితో వుంది అన్నిటిన్ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను.నాకు అది ఒక లక్షణము’ అన్నాడు. 

నీవు వానిపట్ల చేసిన తప్పును నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు. ఇపుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. అదీ ఆయన ధర్మం అంటే. అంబరీషుని పాదములు పట్టుకుని ‘మహానుభావా! ఈ సుదర్శన చక్రదారల నుండి నీవే నన్ను రక్షించాలి’ అన్నాడు. అంతటి మహాత్ముడు తనవలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకొనినందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్నా దురితములనుండి మనం కాపాడబడతాము. సుదర్శన చక్రమునకు నమస్కరించి ‘కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది. 

దుర్వాసుడు ‘ఆహా! గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏండ్లు తపస్సు చేసి పొందలేక పోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించినా, వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇకనుండి నీపేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్లకి శ్రీమన్నారాయణుని పాదములయందు భక్తి కలుగుతుంది’ అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాసో మహర్షి వెళ్ళబోయాడు. అపుడు అంబరీషుడు ‘మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్ధమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి’ అన్నాడు. అపుడు దుర్వాసుడు పరమసంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు. 

కాబట్టి క్రోధము ఒక్కటి వుంటే ఎంతటి దానిని ఎలా పాడుచేస్తుందో మనం గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో యెంత కిందనున్న వాడయినా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉంది అంబరీషుడు సాధించిన విజయమునకు మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి.

ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుజ్యమును పొంది తరించినాడు.

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda