శ్రీమదాంధ్ర భాగవతం - 62
శ్రీమదాంధ్ర భాగవతం - 62
పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి
ప్రవచనం
వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి అలాంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లని పాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూశాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదమేదున్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకోని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూశాడు. బాలి చక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నాడు. కానీ నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి, చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచే సరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది అపుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసేశాడు.
వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.
ఇంతింతై వటుడింతై. ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై, నభోవీధి పై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై!!
పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పడి అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై.
ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర.
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్!!
వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా ఉంది. తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అపుడు సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయిపొయింది. ఇంకా దాటారు అపుడు పాదములకు పెట్టుకున్న అందెలా అయిపొయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్ర పీతలా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.
ఆయన బలి చక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది” అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి
సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!!
నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించదానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. అపుడు బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా! నాకు భర్త్రు భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.
పది దిక్కులా వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. ఇపుడు బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.
అపుడు శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను ఇప్పుడు వీనిని రక్షించాలి. వానిని వరుణ పాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. కాబట్టి అతనికి నేను ఏమి యిస్తానో తెలుసా? సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాణి ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము. కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను. నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పది దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు. ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.
మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కానీ ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి యిప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు యింత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం యిస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణ పాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణి మనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.
‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి యిచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.
ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లి ఇంతే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.
ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.