శ్రీమదాంధ్ర భాగవతం-60
శ్రీమదాంధ్ర భాగవతం-60
పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు
ప్రవచనం
వామనావతారం
అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారి, మళ్ళీ పోగొట్టుకొనిన సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఇపుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. “మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు. కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించక పోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.
ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. అపుడు శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారు అని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగ గుండములో నుండి ఒక బంగారు రథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతోంది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మేడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మేడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.
ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇపుడు తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. అపుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఇప్పుడు ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. కాబట్టి మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.
అపుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవాలి. అలా దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. అపుడు దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. ఇప్పటి నుంచి మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. మహాభక్తుడు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.
కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మ జ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు.
ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నది అని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన కానీ ప్రీతి చెందాడంటే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.
ముళ్ళపంది లేదా అడవి పంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.
అపుడు స్వామి అదితి ని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. అపుడు ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్య భ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. కాని స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉంది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆడపు ఆమె అంది ‘స్వామీ నాకు అంతకన్నా భాగ్యమా! తప్పకుండా’ అన్నది. అపుడు స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. ఇపుడు అదితి గర్భం గర్భాలయం అయింది.
గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తి అయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రంను ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు.
యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతలా గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.
బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అపుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.
పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం