శ్రీమదాంధ్ర భాగవతం- 58
శ్రీమదాంధ్ర భాగవతం- 58
పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు
ప్రవచనం
మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. ఇపుడు అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఇపుడు పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది. ఈ కల్ప వృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీ మణులై ఉండిపోయారు. తరువాత పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది.
పచ్చటి కాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లని కన్నులతో సొగసయిన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు విన్నారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశితుంది. ఇది పరమయధార్థం. పుడుతూనే ఆ తల్లి యౌవనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీ బంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, అలంకరించుకుని వుంది. మెడనిండా హారములు వేసుకుని ఉంది. వరదముద్రపత్తి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది.
నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!!
పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!!
సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః
కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!!
స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!!
యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా
తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!! (శ్రీదేవీ భాగవతం – 9వ స్కంధము)
పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈలోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును యిచ్చి కాపాడు’ అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది.
అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ “లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం” అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇపుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమాయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. ఇపుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి యిచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదం మంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళ ధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళ స్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు.
అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆరోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలిలేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనన్ ‘సుహృత్’ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రములో వున్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ ‘అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇపుడు దండ పట్టుకుని ఎవరి మేడలో వేయాలి అని బయలుదేరుతోంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో వున్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది.
పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం.