Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం- 55

3.144.43.194

శ్రీమదాంధ్ర భాగవతం- 55

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు
ప్రవచనం

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!

లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ల్శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!

ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.

వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.

అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!

అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.

మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా అభాయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.

ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.

మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.

ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. రోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya