Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 50

3.149.253.73

శ్రీమదాంధ్ర భాగవతం - 50

హిరణ్యకశిపుడు తపస్సుకు బయలు దేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండే మంత్రి, సామంత్రులందరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చేతకాని వాడు పిరికివాడు. నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణువు  మహామాయగాడు. అతను ఉండే స్థానములు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము మొదలయినవి. చెట్టు మొదలును కాల్చేస్తే పైన ఉండే పల్లవములు శాఖలు తమంతతాము మాడిపోతాయి. ఇలాంటివి ఎక్కడ కనపడినా ధ్వంసం చేయండి. ఎవడయినా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారెయ్యండి. ఎవడయినా వేదము  చదువుకుంటుంటే వాడిని చంపెయ్యండి’ అన్నాడు. ఆమాటలు వినడముతోనే భటులందరూ లోకం మీద పడ్డారు. ‘నేను అపారమయిన తపశ్శక్తి సంపన్నుడనయి ఈ మూడులోకములను నేను పరిపాలిస్తాను. విష్ణువనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని బయలుదేరి మంధరపర్వత చరియలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. మహా ఘోరమయిన తపస్సు చేశాడు. ఆయన కపాలభాగమునుండి తపోధూమము బయలుదేరి సమస్త లోకములను కప్పేస్తోంది. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో దేవతలు అందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘ఈ హిరణ్యకశిపుని తపో ధూమముచేత మేమందరమూ తప్తమయి పోతున్నాము.  నువ్వు  తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చి ఏమి కావాలో ఆయనను అడిగి ఆయన కోర్కె సిద్ధింపచేయవలసింది’ అన్నారు.

పక్కన దక్షప్రజాపతి భ్రుగువు మున్నగువారు కొలుస్తూ వుండగా స్వామి హంసవాహనము మీద ఆరూఢూడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు వచ్చి నిలబడి తన కమండలములో ఉన్న మంత్రజలమును తీసి పుట్టలు పట్టిపోయి వున్న హిరణ్యకశిపుని శరీరము మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమయిన తేజస్సుతో కూడుకున్న నవయౌవనముతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచివచ్చి సాష్టాంగ దండ ప్రణామము చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన  ‘నువ్వు  దుస్సాధ్యమయిన తపస్సు చేశావు.  నాయనా హిరణ్యకశిపా! నీవు ఏమి కోరుకుంటావో కోరుకో’ అన్నాడు.

‘తనకు మృత్యువు ఉండకూడదు. గాలిచేత చచ్చిపోకూడదు. ఏ దిక్కునుంచి వస్తున్న ప్రాణిచేత చచ్చిపోకూడదు. పైనచచ్చిపోకూడదు. క్రిందచచ్చిపోకూడదు. ఇంట్లోచచ్చిపోకూడదు. బయటచచ్చిపోకూడదు. ఆకాశంలోచచ్చిపోకూడదు. ప్రాణం ఉన్న వాటివలన చచ్చిపోకూడదు. ప్రాణం లేని వాటి వలన చచ్చిపోకూడదు. మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నరుల చేత, దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, వీటి వేటి చేత పగలు కాని, రాత్రి కాని మరణములేని స్థితిని నాకు కటాక్షించు’ అని కోరాడు. ఈ కోరికను విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. తథాస్తు ఇచ్చేశాను.  కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి అనుకూల్యతతో మంచినడవడితో ప్రవర్తించు సుమా’ అని చెప్పి హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు.

హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చి అందరిని పిలిచి ‘నేను వరములు పుచ్చుకుని వచ్చాను. విష్ణువు ఎక్కడ ఉన్నాడో పట్టుకొని సంహారం చేయాలి. పైగా ఇంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేయాలి. త్రిలోక్యాధిపత్యము  పొందాలి’ అని చెప్పి పెద్ద అసుర సైన్యమును తీసుకొని ఇంద్రలోకము మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రునికి ఈ వార్త అంది ఎప్పుడయితే హిరణ్యకశిపుడు ఇన్ని వరములు పొందాడని తెలిసిందో ఇక వానితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమరావతిని స్వాధీనము చేసుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు లేనేలేవు. హవిస్సులన్నీ హిరణ్యకశిపుడికే భయంకరమయిన పాలన సాగిస్తున్నాడు.

 దేవతలు అందరూ చాలా రహస్యమయిన సమావేశం ఒకటి పెట్టుకున్నారు. తమ కష్టములు తీర్చమని శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తే అశరీరవాణి వినబడింది. ‘మీరందరూ దేనిగురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను సమస్తము తెలిసి ఉన్న వాడిని.  నాకంటూ ఒక నియమం ఉన్నది. వాడు ధర్మము నుండి వైక్ల్యబ్యం పొందాలి. బాగా ధర్మం తప్పిపోవాలి. వాడిని  చంపేస్తాను’ అని స్వామి ప్రతిజ్ఞచేశారు. ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను. వానికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ప్రహ్లాదుడు. మహాభక్తుడు.  ప్రహ్లాదుని ఆపదల పాలు చేయడం ప్రారంభం చేస్తాడో ఆనాడు వానిని సంహరించేస్తాను.  మీరెవ్వరూ బెంగపెట్టుకోకండి’ అన్నాడు. ఈ మాటలు విని దేవతలందరూ సంతోషించారు.

హిరణ్యకశిపునికి లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. ఆయన మహానుభావుడు. మహాజ్ఞాని. గురువులు కరచరణాదులతో కదిలివస్తున్న ఈశ్వరుడే అన్న భావన కలిగినవాడు. తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా కాక తన తోడబుట్టిన వాళ్ళలా చూసేవాడు. గురువులు చండామార్కులు ఉన్నది రాక్షస విద్యార్థులు. ఒక్కనాడు అబద్ధం ఆడింది లేదు. మిక్కిలి మర్యాద కలిగిన వాడు. ప్రహ్లాదుని సుగుణములు అన్నీ ఇన్నీ అని చెప్పడానికి కుదరదు. ప్రహ్లాదుడిని చూసిన హిరణ్యకశిపుడు ‘ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించడం, బాధపెట్టడం వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుడిలా కూర్చుంటాడు. తనలో తాను నవ్వుకుంటాడు. కళ్ళు మూసుకొని ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు.  ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా పరిపాలన చేస్తాడు? రాక్షసులను ఎలా సుఖపెడతాడని బెంగపెట్టుకున్నాడు.

 శుక్రాచార్యులవారి కుమారులయిన చండామార్కుల వారిని పిలిచాడు. 'మీ భ్రుగు వంశం మా రాక్షసజాతిని ఎప్పటినుంచో ఉద్ధరిస్తోంది. మా బిడ్డడయిన ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు. వీనికి నీతిశాస్త్రమో, ధర్మ శాస్త్రమో, కామశాస్త్రమో బోధ చెయ్యండి. వీనియందు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయములు తెలుసుకొని పదిమందిని పీడించడం నేర్చుకుంటే నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది’ అని ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చండుడు, మార్కుడికి అప్పచెప్పాడు.

ఆ రోజులలో రాజాంతఃపుర ప్రాంగణంనందు ఒక విద్యాలయము ఉండేది. అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవారు. ప్రహ్లాదుడు చిత్రమయిన పని చేస్తుండేవాడు. ఆయన ఏకసంథాగ్రాహి గురువులు చెప్పిన విషయమును వెంటనే ఆయన మేధతో పట్టుకునేవాడు. తానుమాత్రం మరల బదులు చెప్పేవాడు కాదు. ఏమీ మాట్లాడేవాడు కాదు అన్నీ వినేవాడు. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు. వాళ్ళు దుర్మార్గమయిన నీతులు చెబితే ఆ నీతులు నేర్చుకునే వాడు. అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునే వాడు. అది మనస్సులోకి వెళ్ళలేదు. అనగా అంత దుష్ట సాంగత్యమునందు కూడా తన స్వరూపస్థితిని తాను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఒకనాడు హిరణ్యకశిపునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి ‘మీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము. మీ అబ్బాయి చాలా బాగా పాఠములు నేర్చుకున్నాడు’ అన్నారు. తన పిల్లవానిని సభామంటపమునకు పిలిచాడు. తన కొడుడు తన తొడమీద కూర్చుని అవన్నీ చెపుతుంటే సభలో ఉన్నవాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించినవాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయం. అందుకని సభకు పిలిపించాడు ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. తన తొడమీద కూర్చోబెట్టుకుని ‘నీవు ఏమి నేర్చుకున్నావో ఏది నాలుగు మాటలు చెప్పు. నీవు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చినది నీకు బాగా నచ్చింది ఏది ఉన్నదో అది ఒక పద్యం చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు

ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతిలోపలం
ద్రెళ్లక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునం
దుల్లము జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ !

ప్రతి జీవుడు ప్రతి శరీరధారి శరీరమును పొంది ఇల్లు అనే ఒక చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి ‘నేను’, ‘మీరు’ అనే భావన పుట్టి అందులోంచి అహంకారం, మమకారం పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి, ఎదుటి వాళ్లకు కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు. నేను నా వాళ్ళు అనే భావనను విడిచి పెట్టి జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకుని గుర్తెరిగి వాడు ఘోరారణ్యములోకి వెళ్ళి కూర్చున్నా ఉద్ధరించ బడుతున్నాడు. ఇది తెలుసుకోకుండా ‘నేను’ ‘నాది’ అన్న భావన పెంచుకున్న వాడు ఊరినడుమ కూర్చున్నా అటువంటి వాని వలన కలిగే ప్రయోజనం ఏమీలేదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం. ఇంత తపస్సు చేసి నీవు ఏమి తెలుసుకుంటున్నావు?  నీవు మార్చుకోవలసిన పధ్ధతి ఉన్నదని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. ఇతని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya