Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 42

3.145.59.89

శ్రీమదాంధ్ర భాగవతం - 42

భరతుడు ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన పుట్టిన తరువాత కొంతకాలమునకు ఉపనయనము చేశారు. తరువాత ఆయనకు మనస్సులో ఒక భావన ఉండిపోయింది. ‘అప్పుడు పులహాశ్రమానికి వెళ్లాను. లేడిమీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగ కష్టపడి మనసులో భగవంతుడిని పెట్టుకుని లేడిని వదిలి ఇపుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రిని చేయడం, ఈయన చెప్పిన మంత్రములన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్ళి చేసి నన్ను సంసారంలో పడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మరల భ్రష్టుడనయిపోయి మరల ఎటు జారిపోతానో! అందుకని నేనెవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేనొక వెర్రివాని వలె వుంటే నాకు పిల్ల నిచ్చేవాడెవడు ఉంటాడు?’ అని నిర్ణయించుకుని  వెర్రివాడిలా అలా కూర్చుని ఉండేవాడు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి సహగమనం చేసింది. సవతి బిడ్డలయిన అన్నదమ్ములు 'వీడికేమి వచ్చు. వీడికి శాస్త్రం ఏమిటి! వీడిని గొడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి. పొలానికి పంపించండి. ఆ పనులన్నీ చూస్తుంటాడు అని అతనిని ఒరేయ్ పేడ  ఎత్తరా అనేవారు. ఎత్తేవాడు. పాసిపోయిన అన్నం పెడితే మారుమాట్లాడకుండా అదే తినేవాడు. ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయాడు. ఒకరోజు అన్నదమ్ములు ‘నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయమన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు.

లోకమునందు కొంతమంది చిత్రవిచిత్రమయిన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికా దేవికి మంచి అవయవ హీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకుని వీడెవడో బాగానే ఉన్నాడు. మాట కూడా మాట్లాడడం లేదు వీడిని తీసుకుపోదాం అని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు. బ్రహ్మజ్ఞానుల జోలికి వెళితే లేనిపోని ప్రమాదములు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు. పద అన్నారు. వెళ్ళిపోయాడు. ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు. తినేశాడు. తరువాత వంగు, నరికేస్తాము అన్నారు. వంగాడు. కత్తియందు బ్రహ్మము, నరికేసేవారియందు బ్రహ్మం. అంతటా బ్రహ్మమును చూసి తలవంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహములో నుంచి  బయటకు వచ్చి ‘ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు. ఆయన మీదనా మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చినవారి శిరసులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంటే సింధుదేశపు రాజు రహూగణుడు (రాహుగణుడు) ఇక్షుమతీ నదీతీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని వెళుతున్నాడు. బోయీలు పల్లకిని మోస్తున్నారు.  ఒక బోయీకి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. నాలుగో బోయీ కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు. మంచి దృఢకాయుడై ఉన్నాడు. ఈయనను తీసుకురండి పల్లకీ మోస్తాడు అన్నారు.

బాగా పొడుగయిన వాడు పల్లకీ పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకీ మోస్తున్నాడు. అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనంద పడిపోవడములో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబడేవి.  ఎత్తు పల్లములకు లోనయి పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకి అంచుకు గట్టిగా తగిలేది. ఆయన రెండుమూడు మాటలు చూసి ‘ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నారు. ఒంటిమీద తెలివి ఉందా’ అని అడిగారు. వాళ్ళు ‘అయ్యా! మా తప్పు కాదు. కొత్త బోయీ సరిగా లేడు. వీడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు’ అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ బోయీవంక చూసి పరిహాసమాడాడు. మోస్తున్న వాడు బ్రహ్మజ్ఞాని. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. రాజుగారు పల్లకి తెర తప్పించి క్రిందికి చూసి ‘తిన్నగా నిందించకుండా పరిహాసపూర్వకమయిన నింద చేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మరల బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ దూకాడు ఎందుకో మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అపుడు రాజు ‘ఒరేయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపడడము లేదు. నిన్ను రాజ దండనము చేత నా మార్గములోనికి తిప్పే అవసరము నాకు కనపడుతోంది. పలకవేమిటి?’ అన్నాడు. 

ఇప్పటివరకు పుట్టిన తరువాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘రాజా, నువ్వు మాట్లాడింది నిజమే. నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు? ఈ దేహమునకు శిక్ష వేస్తాను అంటున్నావు. ఈ దేహం నేను కాదు. నేను ఆత్మని ఉన్నవాడిని నేను. ఇది నీ మాయని నీ అజ్ఞానమును  బయటపెడుతున్నది’ అన్నాడు.

ఈమాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. ‘ మోస్తున్న వాడెవడో సామాన్యుడు కాదు. ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు’ అని పల్లకి ఆపమని గభాలున క్రిందికి దూకి ఆయనవంక చూస్తే గుర్తుపట్టడానికి యజ్ఞోపవీతం ఒక్కటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా! నన్ను పరీక్ష చేయడానికి బహుశః కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు? నిజం చెప్పండి. మీవంటి బ్రాహ్మణులు జోలికి నేను రాను. మీమాటలు నన్ను చాలా సంతోష పెట్టాయి. నాకొక్క మాట చెప్పండి. లేనిది ఎలా కనపడుతోంది? ’ అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళమీద పడ్డాడు రాజు.  భరతుడు నవ్వి ‘రాజా! నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు. అందుకని చెపుతున్నాను. ‘నేను’ అనబడే పదార్థము ఈ కన్నుల చేత చూడలేనిది కాదు. ఈ కన్నులకు కనపడుతుంది. దీనిని తిరస్కరించక పోతే ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే.  ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడిటి వలన అనేకము కనపడతాయి. అవి కాలము, బుద్ధి,  నామములు. రూపము ఉంటే నామము ఉంటుంది. నామము ఉంటే రూపము ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినట్లయితే మాయ పోయినట్లు అవుతుంది. రూపము చేత నామము మారదు. నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. ఈ రెండూ అశాశ్వతమే. నామము, రూపము రెండూ అబద్ధమే. నామ రూపములుగా కాలగతియందు బుద్ధిచేత తిరస్కరింపబడుతుంది. మాంస నేత్రముచేత మగ్నము చేయబడుతుంది. అది నీవు తెలుసుకుంటే  నేను చెపుతాను. 

ఒక్కమాట ఆలోచించు. ఇది పృథివి. ఈ భూమిమీద నా చరణములు పృథివి. నా చరణముల మీద నా కాళ్ళు పృథివి. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారమునకు నీవు ఒక పేరు పెట్టుకున్నావు. ‘నేను మహారాజును – వాడు బోయీ’ అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు.  నీవు మాట్లాడడానికి ఆధారమయిన ఆత్మ, నాలో వున్న ఆత్మ ఒక్కటే. రెండూ రెండు శరీరములను ధరించాయి. ఈ రెండూ నామరూపముల చేత గుర్తించ బడుతున్నాయి.  ఇవి మాయ వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్లే. నీకు తత్త్వం అర్థం అయింది.  సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తుంది. అక్కడ బంధుత్వములనే తోడేళ్ళు ఉంటాయి. అవి మేకలవెంట తరుముకు వచ్చినట్లు వస్తాయి. ప్రతివాని ఇంట్లో ఈగలు ఉంటాయి. పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామము  పోయినట్లు ఉంటుంది. మళ్ళీ వచ్చి చేరుతుంది. రాజా వ్యవసాయం బాగా చెయ్యాలని ఆనుకున్న వాడు కలుపుమొక్కని కత్తిరిస్తే సరిపోదు. మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయటపారేసి ఎండిపోయిన తరువాత తగులబెట్టెయ్యాలి. తరించాలనుకున్నవాడు కామమును ముందు గెలవాలి.

అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెళుతుండగా నిన్ను చూసి ఆరుగురు దొంగలు వెంట పడతారు. ఆ ఆరుగురు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారు. అయిదు ఇంద్రియములు, మనస్సు – ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకు పోతారు. నువ్వు పతితుడవయిపోయి పతనమయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం శరీరంలోకి వెడుతూ ఉండడం ఇది ‘నేను’ అనుకోవడము దీని అనుబంధములతో మగ్నం అయిపోవడం ఈశ్వరుడిని తెలుసుకోవడం. అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. రాజా! ఏనాడు నీ జ్ఞాన నేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తావు. వారి పాదముల మీద పడతావు. బ్రహ్మ జ్ఞానమును పొందుతావు. భక్తితో ఉంటావు. కర్మా చరణమును చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి. అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రహూగణుడు విని వైరాగ్యమును పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు మోక్షమును పొందాడు.

ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అరణ్యమునకు వెళితే మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు. ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటకు వెళ్ళి ఋషభుడు మోక్షమును పొందాడు. ఇంట్లో ఉంటే నన్నేదో పట్టేసుకుందని భయపడిపోయి అరణ్యము వెళ్ళి మూడు జన్మలు ఎత్తి మోక్షం పొందాడు భరతుడు.   పాడుచేసేది ఇల్లు కాదు. లోపల వున్న మనసు. అందుకే ఆధునిక కవి ఒకమాట అన్నారు.

'తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలయమయిన మనస్సును ప్రక్షాళన చేయాలి. నీ మనస్సే నీ ఉన్నతికి గాని, పతనమునకు గాని కారణము అవుతోంది అని ఒక అద్భుతమయిన విషయాన్ని నలుగురి యందు నాలుగు విషయములను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమయిన ఘట్టమును  గృహస్థాశ్రమంలో తరించడానికి మనకి ఉన్న అనుమానములను నివృత్తి చేస్తూ వ్యాసభగవానుడు ఇచ్చిన అమృతఫలములను పోతనగారు ఆంధ్రీకరించి మనలను ఉద్దరించారు.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya