Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 41

52.14.110.171

శ్రీమదాంధ్ర భాగవతం - 41

నాభి ఒక కొత్త మార్గమును ఆవిష్కరించాడు. ఆయన యజ్ఞముయొక్క  గొప్పతనమును ఆవిష్కరించాడు. యజ్ఞము చేత భక్తిచేత పరమేశ్వరుడిని కట్టి ఎలాగ తన కొడుకుగా తెచ్చుకోవచ్చునో నిరూపించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చునో తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు. ఋషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షమును పొందాడు. ఇది నాభి వృత్తాంతము.

ఋషభుడు చాలాకాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు. తరువాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లలను పిలిచి ఒకమాట చెప్పాడు. ఋషభుడి చరిత్రవింటున్న వారికి చదువుచున్న, వారికి సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెపుతారు. ‘కుమారులారా! కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమయిన ఉపాధిని పొందిన మనిషికూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్లనో తెలుసా? కేవలము కామము చేత కష్టములు పడుతున్నాడు. కామము అంటే కేవలము స్త్రీ పురుష సంబంధమయిన గ్రామ్యసుఖము మాత్రమే కాదు. కామము అంటే కోరిక. కోరికకు ఒక లక్షణము ఉంటుంది. అది లోపల అంధత్వమును ఏర్పరుస్తుంది. మీరు ఒక కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమయిన కోర్కె పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని అక్కడవరకు ప్రయాణము చేయడము గృహస్థాశ్రమంలో దోషం కాదు.   వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలవికాని కోర్కెను పెంచుకుంటే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. ధర్మము గాడితప్పవచ్చు లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమయిన దానికి తిరగడములో చేయవలసిన ఈశ్వరారాధన   వదులుకుంటున్నారు. కోరికలు బంధించి వేసి కళ్ళల్లో ధూళి పోసి కనపడకుండా చేస్తాయి. మనిషి కుక్కకన్నా హీనం అయిపోతాడు. అందరిచేత ఛీ అనిపించుకుంటాడు. కామమును అదుపు చెయ్యి. మనసులో ధారణ ఉండాలి, పూనిక ఉండాలి.  కామము పెరిగిపోవడమే బంధహేతువు అవుతుంది. దీనిని విరగ్గొట్టడానికి నేను రెండుమార్గములు చెపుతాను. అందులో మొదటిది తపము చెయ్యడం. తపము లేక ధ్యానము చెయ్యండి. ఈశ్వరునియందు భక్తిని పెంపొందించుకోండి. రెండవది సజ్జనసాంగత్యము.

సజ్జనసాంగత్యము ఒక్కటే ఈశ్వరుని దగ్గరకు తీసుకువెళుతుంది. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి. క్రమక్రమముగా అంతటా ఈశ్వరుడిని చూడడము నేర్చుకోవాలి. ‘నేను, నాది’ అనే భావన విడిచిపెట్టాలని బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపమును చూసి ఏమి అందగాడని ప్రజలంతా మోహమును పొందారు. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. స్నానం లేదు. ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ఇంతకు పూర్వం ఋషభుడిని చూసిన వారు ఇప్పుడు ఆయనను చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అలా వెళ్ళిపోయి చాలా కాలానికి ‘అజగరవ్రతము’ అని ఒక చిత్రమయిన వ్రతం పట్టాడు.

అజగరము అంటే కొండచిలువ. కొండచిలువ ఎలా భూమిమీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒకచోట భూమిమీద పడి ఉండిపోయాడు. అతడు పొందిన యోగసిద్ధికి సిద్దులన్నీ  మేము నిన్ను వరిస్తున్నాము స్వీకరించండి’ అని అడిగాయి. నాకీ సిద్ధులు అక్కరలేదని వెళ్ళిపొమ్మన్నాడు. అలా చాలాకాలం పడివుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్న అరణ్యమునందు నడుస్తున్నాడు. ఆయన అలా నడిచివెడుతుంటే అక్కడ వున్న చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి ఒక అగ్నిహోత్రము బయలుదేరింది. పెద్ద అగ్నిజ్వాలలు రావడం ప్రారంభించాయి. ఆయన వాటివంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. అవి వచ్చి అంటుకుంటే శరీరము పడిపోతుంది అనుకున్నాడు. యధార్థమునకు అలా ఉండడము అంత తేలికకాదు.  ఋషభుడి కథ అసుర సంధ్యవేళ ఎవరు వింటున్నారో వాళ్లకి సమస్త కామితార్థములు ఇవ్వబడతాయని చెప్పబడింది. ఆ అగ్నిహోత్రం శరీరమును పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది. తాను ఆత్మలో కలిసిపోయాడు. ఋషభుడు ఇలా శరీరమును వదిలిపెట్టాడని రాజ్యమును ఏలుతున్న అరహన్ అనే రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుని ‘మనకు ఒక సత్యం తెలిసింది. లోపల ఉన్నది ఆత్మ. ఈ శరీరము మనది కాదు. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళెవరూ స్నానం, సంధ్యావందనం చేయనక్కరలేదు. దేవాలయములకు వెళ్ళక్కరలేదు. పూజలు చేయనక్కర లేదు. బ్రాహ్మణులను గౌరవించనక్కరలేదు. యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు’ అని చెప్పాడు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలుపెట్టారు.
  
వ్యాసులవారు ఇది మహాదోషము అన్నారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము. మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించలేరు. ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. మీరు కర్మ చెయ్యాలి. అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది.  మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేయాలి. అది వైరాగ్యమును ఇచ్చి ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అరహన్ చేసిన భయంకర కృత్యము. ఒక మహాపురుషుని జీవితకథగా దీనిని విని, చేతులు ఒగ్గి నమస్కరించాలి. అలా చేస్తే మీకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి మీరు కృష్ణ పాదములను చేరుకుంటారు. మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది.

2. భరతుని చరిత్ర:

మహానుభావుడయిన ఋషభుని కుమారుడే భరతుడు. ఆయన పరిపాలించాడు  కనక మనదేశమునకు భరతఖండము అను పేరువచ్చింది. ఆయన విశ్వరూపుడు అనే ఆయన కుమార్తె ‘పంచజని’ని వివాహం చేసుకుని సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, దూమ్రకేతువు, అను ఐదుగురు బిడ్డలను కన్నాడు. ఆయన భక్తి వైరాగ్యములతో కొన్ని వేల సంవత్సరములు భరత ఖండమును పరిపాలించాడు. ఆయనలా పరిపాలించిన వారు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమునకు ‘భరత ఖండము’ అన్న పేరు వచ్చింది.

ఆయన ఒకరోజు  ‘ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను? ఇక్కడి నుండి బయలుదేరి పులహాశ్రమమునకు వెళ్ళిపోతాను. అక్కడ గండకీనది ప్రవహిస్తోంది.  సాలగ్రామములు దొరుకుతూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను’ అని బయలుదేరి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారు జామునే సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ దర్శనము తెల్లవారిన తరువాత జరుగుతుందనే ఉద్దేశంతో నదీస్నానం కొరకని చీకటి ఉండగానే వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. అక్కడికి నిండుచూలాలయిన ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అక్కడే అరణ్యంలో సింహం ఒకటి అరణ్యము బ్రద్దలయిపోయేటట్లు గర్జించింది. సింహం అరుపు విని నిండుగర్భిణి అయిన లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. వెంటనే దానికి ప్రసవమై ఒక లేడిపిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోయింది. దానిని భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పిల్లను తెచ్చాడు. అయ్యో! తల్లి మరణించిందే అనుకుని ఈ లేడిపిల్లను ఆశ్రమములో తనపక్కన పెట్టుకున్నాడు. మెల్లమెల్లగా దానికి లేత గడ్డిపరకలు తినిపించడము కొద్దిగా పాలుపట్టడము దానిని పులో, సింహమో వచ్చి తినేస్తుందని ఎవరికీ దొరకకుండా ఆశ్రమంలో తలుపులు వేసి పడుకోబెట్టడము చేసేవాడు. ఎప్పుడూ లేడిపిల్ల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలు పెట్టేవాడు.   నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడి ఎక్కడికయినా వెళ్ళిపోతుందేమో ఏ పులో దానిని తినేస్తుందేమోనని దానిని చూసుకుంటూ ఉండేవాడు. రానురాను ఆయన దేనికోసం తపస్సుకు వచ్చాడో అది మరచిపోయి లేడిపిల్లను సాకడములో పడిపోయాడు.

భరతునికి అంత్యకాలం సమీపించింది. ప్రాణం పోతున్నది. మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను. నా లేడి ఏమయిపోతుందోనని ఆ లేడివంక చూస్తూ కన్నులనీరు పెట్టుకుని లేడినే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు. ఈశ్వరుడికి రాగద్వేషములు ఉండవు. ఆఖరి స్మరణ లేడిమీద ఉండిపోయింది  లేడిగా పునర్జన్మను ఇచ్చారు. ‘అయ్యో! నేను లేడిని పట్టుకోవడం వలన కదా నాకీ సంగం వచ్చింది. అసలు నేను ఎవరినీ ముట్టుకోను’ అని వ్రతం పెట్టుకున్నాడు. పచ్చగడ్డి తింటే దానిమీద వున్న క్రిములు చచ్చిపోతాయని ఆ లేడి (భరతుడు) ఎండుగడ్డిని మాత్రమే తినేది. అంత విచిత్రమయిన వ్రతం పెట్టుకుని పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచాడో ఆ పులహాశ్రమమునకు వచ్చాడు. ఆ లేడి లోపల ఎప్పుడూ నారాయణ స్మరణము చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితమును గడిపి అంత్యమునందు భగవంతుడినే స్మరిస్తూ శరీరము విడిచిపెట్టింది. మోక్షం పొందడానికి మరల మనుష్య శరీరములోకి రావాలి. ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya