Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 37

3.144.235.141

శ్రీమదాంధ్ర భాగవతం - 37

పృథుమహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి ‘వీర్యము’, ‘ఓజము’, ‘ఋతము’ అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.

రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహపాత్రలలో మూడురకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టిపాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిలమహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణనే శక్తిని పిండుకున్నారు. యక్ష, భూత, పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చేసుకుని తమ పుట్టలనబడే పాత్రలలోకి ‘పురువులు’ ‘ఫలములు’ అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి ఉండి మనకు రసపోషణము చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషముగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి ‘సరస్వతి’ ‘తృషద్వతి’ అనబడే రెండు నదుల మధ్యప్రాంతంలో యజ్ఞశాల కట్టి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశాడు. నూరవయజ్ఞం  చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపముతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి ‘గుర్రమును ఎత్తుకు పోతున్నవాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా  బాణము వదిలెయ్యి అన్నాడు. బాణము వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుఱ్ఱమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి ‘విజితాశ్వుడు’ అని పేరు పెట్టారు.

మరల యజ్ఞం జరుగుతున్నది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణముగా మాంత్రికశక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసినవాడయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాపవిముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడుకూడా అయి ఉంటాడు. అతనిని వధించాలా! వద్దా! అని పృథువు అనుమాన పడుతున్నాడు.  అత్రి ‘నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది’ అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు.  ఇంద్రుడు ఆ రూపమును,  గుఱ్ఱమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు ‘పాఖండరూపము’ అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేద విరుద్ధమయిన మార్గములో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. ఋషులు ‘నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవయజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఇంద్రుడిని ఈ హోమములో పడేస్తాము’ అన్నారు.
 
ఇంద్రుని మీద క్షాత్రశక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారు  వచ్చి  ‘మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే’ అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరముగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనము దిగి ‘పృథూ, ఇప్పటికి నువ్వు తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా?  తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు.  నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయి ఉండేవాడివి. ఇంద్రుడి మీద బాణం వేయడములో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గుర్తించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. అతని చర్య పైకి దోషముగా కనపడుతున్నది.  నీవు బాణం వేయవలసింది ఇంద్రుని మీద కాదు. ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపంనుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేస్తున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనము చెయ్యి’ అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.

పృథుమహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

  
అర్చన భక్తికి పృథుమహారాజు గొప్పవాడు. పృథుమహారాజు జీవితములో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. శ్రీమహా విష్ణువు ‘పృథూ! నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. పృథుమహారాజు ‘స్వామీ! నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరములు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడము వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు’ అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజానిష్ఠ. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.

ఒకనాడు సత్రయాగము చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందాది మహర్షులు క్రిందికి దిగారు. మహాపురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు.

సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి ‘స్వామీ! మేము సంసారమునందు ఉన్న  మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి’ అని ‘బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత’ అని అడిగితే సనక సనందనాదులు ‘ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటివాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు’ అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా   ‘గృహస్థాశ్రమంలో ఉండి చాలాకాలము పాపకర్మలయందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగనివాడు జీవితము తరించడానికి చేయవలసిన మొట్టమొదటి పని  భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగి ఆ నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకోవాలి. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమముగా నిష్కామయోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్నిపాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతే సాయుజ్యము కలుగుతుంది’ అన్నారు.

సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తరదిక్కుకు ప్రయాణించి ఆశ్రమవాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథివికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణుసాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేసాడు. ఈవిధముగా పృథుమహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేస్తూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.

ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథుమహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానారాజ్యం కావాలని పృథుమహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథుమహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారములో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించేతత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి పృథుచరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వపాపములు నశించి శ్రీకృష్ణపరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహముతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya