శ్రీమదాంధ్ర భాగవతం - 33
శ్రీమదాంధ్ర భాగవతం - 33
ధ్రువోపాఖ్యానం:
భాగవతంలో ధృవోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయాలి అంటే మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్లజన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధృవోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధృవోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధృవుని వృత్తాంతమును వినాలి. భాగవతాంర్గతముగా వినడం అనేటటు వంటిది మరింత గొప్పవిషయం. ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ధృవచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధృవోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.
ధృవచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథునసృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూపనే స్త్రీ స్వరూపమును, స్వాయంభువ మనువనే పురుషస్వరూపమును సృష్టి చేశారు. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనే ఇద్దరు కుమారులు కలిగారు.
ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుతున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధృవుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు యిన ఉత్తానపాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉన్నది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. సునీతి కొడుకయిన ధృవుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధృవుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధృవుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. ‘నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. నీకు ఆ భాగ్యం దక్కదు’ కేవలం ఆభిజాత్యముతో ఈమాట అన్నది. సురుచి మళ్ళీ ‘నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిందములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు’ అన్నది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధృవుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి.
ఆవిడ కొడుకును చూసి ‘నాయనా! మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలుగుతావు’ అని చెప్పింది.
పిల్లవాడయిన ధృవుడు ‘అమ్మా! అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చి ‘నాయనా! నీవు ఎక్కడికి వెడుతున్నావు?’ అని అడిగాడు. ధృవుడు ‘నేను అడవికి వెళుతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు. నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ధృవుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధృవుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. ధృవుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. నారదుడు ఏ పెద్ద పదవిని కోరతావు’ అని అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను’ అన్నాడు.
నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొందుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి, రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి, అంతంత కష్టములు పడినవారికి, శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.
ధృవుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అన్నది. నా మనస్సు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. శ్రీహరి కనపడతాడా లేదా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి ‘నాయనా! నీవు యమునానది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునానదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడని పట్టు పట్టు. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానముగా తులసి తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు.