Online Puja Services

శ్రీ మదాంధ్ర భాగవతం – 27

18.220.97.161

శ్రీ మదాంధ్ర భాగవతం – 27.

తృతీయ స్కంధము

దితి – కశ్యపుడు 

కశ్యప ప్రజాపతికి పదమూడుమంది భార్యలు. ఆయన తన 13మంది భార్యలతోను ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. ఆయన సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి ‘దితి’ వచ్చి ఆయనతో ఒక మాట అంది – “నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. నేను ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు’ అని చెపుతూ ఆవిడ ఒకమాట చెప్పింది. ‘నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉంది’ అంది. ‘అదేమిటో చెప్పవలసింది’ అని అడిగాడు కశ్యపుడు.

ఆవిడా అంది ‘నీకు 13మంది భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులం. 13 మందినీ ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో 12మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ‘ఆత్మావై పుత్రనామాసి’ – భర్త భార్యకు అపురూపముగా ఇచ్చే కానుక ఏది? తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపమును పట్టుకు వెళ్ళి ఇంకొక దీపమును వెలిగిస్తాము. రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ వత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. కానీ దీపశిఖ మాత్రం సమాన ధర్మమును కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. రెండు దీపముల జ్యోతికి తేడా ఉండదు. కాబట్టి తండ్రికి, కుమారుడికి భేదం లేదు. తండ్రికీ, కుమారుడికీ భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే ఈ అధికారమును పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్లు చేయగలదు. కాబట్టి నీ తేజస్సును నాయందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపము ఎక్కడ ఉంది? నాకు సంతానమును కటాక్షించు’ అంది. ఆవిడ ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి!అపుడు ఆయన అన్నాడు – ‘దితీ! నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కానీ ఒక్కమాట చెపుతాను వినవలసింది. ఇది ఉగ్రవేళ. అసుర సంధ్యా కాలంలో పరమశివుడు వృషభవాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్లకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరయినా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో కానీ, ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమయిన ఫలితమును ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను’ అన్నాడు.

దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మ భ్రష్టత్వము ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. అపుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి, తానూ ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకోని, ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి, స్నానం, ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడయిపోయాడు.

కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి, రుద్ర గణములకు క్షమాపణ చెప్పింది. కానీ అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూత గణములలో భద్రాభద్రులు అనే వారు చూసి ఉగ్రమయిన ఫలితమును ఇచ్చేశారు.

పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా’ అని అడిగింది. అపుడు కశ్యప ప్రజాపతి అన్నాడు ‘నేను వద్దని చెప్పాను. కానీ నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్నివేల స్త్రీల కళ్ళమ్మట నీళ్ళు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమానపరుస్తారు. చిట్టచివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు’ అని చెప్పాడు.

ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. ‘చివరకు నాకు ఇంత అపఖ్యాతా? దీనికి నీవారణోపాయం లేదా’ అని అడిగింది. అపుడు కశ్యపప్రజాపతి ‘దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కానీ నీవు మహా భక్తుడయిన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడయిన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరిచేతిలో మరణిస్తారు’ అని చెప్పాడు.

భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడ నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహా పతివ్రత. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా! అసలు పిల్లలనుకనడం మానివేసింది. కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. అపుడు ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తోంది. అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. కాబట్టి ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. అపుడు కశ్యప ప్రజాపతి దితితో – ‘నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను కనవలసింది’ అని చెప్పాడు. అపుడు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు.

ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే ‘హిరణ్య’ ముందు పెట్టి ఒకనికి ‘అక్షి’, రెండవ వానికి ‘కశ్యప’ అని చేర్చి, ఒకనికి ‘హిరణ్యాక్షుడు’, రెండవ వానికి ‘హిరణ్యకశిపుడు’ అని పేర్లు పెట్టారు. ఒకడు కనబడ్డదానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపూ తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తనపేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారములే! ఈవిధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భమునుండి జన్మించారు.

హిరణ్యాక్షుడు పుట్టీ పుట్టడం తోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరికే! యుద్ధం కోసం అనేకమంది దగ్గరకు వెళ్ళాడు. చిట్టచివర సముద్రం లోపల ఉన్న వరుణుడి దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళి ‘ఏమయ్యా, నీవు ఎక్కడో సముద్రంలో ఉంటావు. నా భుజముల తీట తీరాలి. అందుకని నీవు వచ్చి నాతొ యుద్ధం చెయ్యి’ అన్నాడు. అపుడు వరుణుడు ‘నాకు నీతో యుద్ధం ఎందుకు? నీకోసం వచ్చేవాడు ఒకాయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపొయింది. నీవు ఒక పర్యాయం సముద్రం మీదకు వెళ్ళు. ఆయన కనపడతాడు. ఆయనతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు? అంటే దీనికి వెనుక ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది.

భద్రాభద్రులు అనే రుద్ర గణములు చూసి దితి యందు ఉగ్రమయిన బిడ్డలు పుట్టాలని ఎప్పుడయితే నిర్ణయం జరిగిందో, అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము ఎంత శివ కేశవుల అభేదముగా నడుస్తుందో చూడండి!

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya