శ్రీ మదాంధ్రభాగవతం -- 23
శ్రీ మదాంధ్రభాగవతం -- 23.
కలి అన్నాడు “నేను ఇంకా స్థిరముగా ఊన్చుకోలేక పోతున్నాను. ఇది నా తప్పు కాదు. నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా ఊన్చుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా! కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా! అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకూ, నాకూ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది. నేను రావాలి. కాబట్టి నేను ఎక్కడ ఉందనో నీవే చెప్పవలసింది” అన్నాడు.
అపుడు పరీక్షిత్తు “నీకు నాలుగు స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు” అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. “జూదశాల యందు నీవు ఉండవచ్చు” అన్నాడు. రెండవది పానశాల. ‘ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు’ అన్నాడు. మూడవది ‘స్వేచ్ఛా విహరిణులై, ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులయిన స్త్రీలవద్ద నీవు ఉండవచ్చు.’ నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. ‘జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ నాలుగు ప్రదేశములను నీకు ఇచ్చాను’ అన్నాడు.
ఇలా కలికి ఈ నాలుగు స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని, అలా నాలుగు స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూడశాలలో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థములను అమ్మేచోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా – మిమ్మల్ని కలి ఎలా పాడుచేస్తాడు? ఇది మీరు విశ్లేషణ చేయాలి.
జూదశాలయందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యము ప్రబలుతుంది. లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు ‘ఏమండీ- నేను ఒక్కసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవడూ చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళివస్తానని అబద్ధం చెప్తాడు. లేకపోతే క్లబ్ ను ఒకదానిని పెట్టుకుని అక్కడికి వెడుతున్నానని చెప్పుకుంటారు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడరు. మనం సాధారణంగా ఏమని అనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారని అనుకుంటాము. ఏమీ ఉండదు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానం. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది.
సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలయిపోతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత మూడుగంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది. ‘ఏమండీ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండీ’ అంటుంది. అపుడు ఆయన ‘స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్లాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. అందుకని వెళ్లాను’ అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ‘మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు’ అంటుంది. ‘ఏమీ కాదు డబ్బు మా నాన్న గారికి పంపించాను’ అంటాడు. బుకాయిస్తాడు. దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది.
రెండవది పానశాల. తాగగానే యుకాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే శుకపిక బకరవములు ప్రారంభమయిపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలుపెట్టేస్తాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత నీవు రాక్షసుడవు అయిపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నావు. అపుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమౌతుంది. మదోన్మత్తుడవు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మదరూపంలో వస్తాడు. అందుకని పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతోంది. మనిషి విషయ సంగాలోలుడు అయిపోతున్నాడు.
నాల్గవది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమానూ చంపి వేయనక్కరలేదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తున్చేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆ ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమయిన హింస నోటిమాట.
‘కడుపుల్ రంపపుకోత కోయునదియే గాయాలు కాకుండినన్’ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మతుమందు ఇవ్వకుండా ఒక రంపము పట్టుకువచ్చి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే, ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో,అవతలవారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగితజ్ఞానం లేకుండా, ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాక్కునందు అదుపు ఉండాలి. అవతలివారు బాధపడకుండా మధురమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాటయందు కాఠిన్యము అలవాటయిపోతుంది. అవతలివారి యందు నిష్కారణమయిన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువయిన నాడు అది కలిపురుషుని ప్రవేశమును సూచిస్తుంది.
‘కాబట్టి ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను’ అన్నాడు పరీక్షితు కలితో. తాను పరిపాలనలో వుండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ నాలుగుచోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు కలి ప్రతినిధి.
మీరు నాలుగింటిలో ఒకదానికి పట్టుకున్నారంటే మిగిలిన మూడింటివైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడయిపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు.
కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలదు. కలి పరీక్షిట్టుతో ‘అయ్యా, మీరు నాకు నాలుగు స్థానములు ఇచ్చారు. కానీ వీటిలో నేను ఊన్చుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి’ అన్నాడు. అపుడు గభాలున పరీక్షిత్తు ‘నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను’ అన్నాడు. ‘చాలు మహాప్రభూ!’ అని కలి వెళ్ళిపోయాడు.
ఆ రోజుల్లో బహుశః ఒక లక్షణం ఉండేది. నిస్సంగులయిన వారికి ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకము అయిపోయింది.
పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన తరువాత పరీక్షిట్టుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారమునుండి తానిచ్చిన వేరొక స్థానములోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదానిద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతాడు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. తరువాత పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే – జానపదులు వచ్చి, అయ్యా, క్రూర మృగముల సంఖ్యా పెరిగి పోయిందండి’ అని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడతాడు. అలా వెళ్ళాలి. అంతేగానీ జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.
పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం