Online Puja Services

అమృత భాండమే భాగవతం -3

3.138.69.101

భాగం : 3. భవసాగరాన్ని దాటించగలవాడు ,మోక్షప్రదాత అయిన వాసుదేవుడే!
సేకరణ: లక్ష్మి రమణ 

రోమహర్షుని కుమారుడు, సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు, ఉగ్రశ్రవసుడని ప్రసిద్ధుడైన సూతుడు ఇలా ఆ భగవానుని లీలని (భాగవతాన్ని) వివరించేందుకు ఉపక్రమించాడు. రసరమ్యమైన ఆ కథాగానం ఒక తేనెపట్టునుండీ జాలువారుతున్న తేనెబిందువుల్లా , శ్రావ్యమైన ఆ మహనీయుని గళం నుండీ వెలువడడం  మొదలయ్యింది . సూతమహాముని భాగవత కథాసుధని ఆరంభిస్తూ ఇలా చెప్పసాగారు .  

“ మునీంద్రులారా! సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరడిగారు. దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందునికి సమర్పితమైన భక్తియోగంవలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం - కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియసంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. 

తత్త్వవిచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు, తత్త్వవేత్తలైన వారు అద్వైతజ్ఞానమే తత్త్వమని తలుస్తారు. ఆ తత్త్వాన్ని ఔపనిషదులు బ్రహ్మం అంటారు. హైరణ్యగర్భులు పరమాత్మ అంటారు. సాత్త్వతులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణంచేత సంప్రాప్తమై, జ్ఞానంతోనూ, వైరాగ్యంతోనూ కూడిన భక్తి పట్ల ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ లోనే పరమాత్మను దర్శిస్తారు. 

ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించడమే ప్రయోజనం. ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు వినడం , వాటిని మననం చేసుకొని, వివరించడమే అవశ్య కర్తవ్యం. వివేకంగల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకార పూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. 

పుణ్యతీర్థాలనూ, పుణ్యపురుషులనూ సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మ బంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణకీర్తనుడైన పురుషోత్తముడూ తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలూ సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు. అశుభ పరిహారంవల్ల భాగవతసేవ లభిస్తుంది, భాగవతసేవ వల్ల అచంచలభక్తి ప్రాప్తిస్తుంది. భక్తివల్ల రజస్తమోగుణాలతో చెలరేగిన కామలోభాదులకు లొంగక చిత్తం సత్త్వగుణాయత్తమై ప్రసన్నమౌతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్త్వజ్ఞానం సిద్ధించి ఈశ్వరదర్శనం లభిస్తుంది. ఈశ్వరదర్శనం వల్ల అజ్ఞానరూపమైన అహంకారం దూరమౌతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలూ పటాపంచలౌతాయి. సంశయాలు తొలిగిపోగానే అశేషకర్మలూ నిశ్శేషమై నశిస్తాయి.

విజ్ఞాననిధులు, తపోధనులు తమ అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసారబంధాలను త్రోసిపుచ్చి; అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు.

పరమపురుషుడు ఒక్కడే; ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు; ఆయనే సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తు, రక్షిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు; అందులో అనంత సత్త్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు.

ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. కట్టె కంటే పొగ విశిష్టమైనది. పొగ కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైనది. అదే విధంగా తమోగుణం కన్నా రజోగుణము, రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపజేసే సత్త్వగుణమూ ఉత్తమమైనది. 

పూర్వం మహర్షులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగా కొలిచారు. కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు. మోక్షాన్ని కోరినవారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదలి, శాంతభావులైన ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరినే ఆశ్రయిస్తారు. 

మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింప దగ్గవాడు. వేదాలూ, యాగాలూ, యోగాలు క్రియలూ, జ్ఞానాలూ, తపస్సులూ, ధర్మాలూ అన్నీ వాసుదేవుని స్వరుపాలే. త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి, సత్త్వరజస్తమో గుణాలను అంగీకరించి, గుణసహితుని లాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక కట్టెలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కన్నిస్తున్నట్లు, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి యందు అంతర్యామియై ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఉండి కూడ త్రిగుణాలకు లోబడకుండా,  ఆ యా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ  మనుష్య పశుపక్ష్యాదులలో లీలావతారుడై జన్మించి లోక రక్షణం చేస్తుంటాడు” అని చెప్పి సూతుడు మళ్లీ ఇలా చెప్పసాగాడు.

ఈ సీసపద్యాన్ని చదివే ప్రయత్నం చేస్తూ ఆ భాగవత కథలోని రసరమ్య పద వైదుష్యాన్ని అవధరించండి  ! 

62-సీ.|| మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై-
చారు షోడశ కళాసహితుఁ డగుచుఁ,
బంచమహాభూత భాసితుండై శుద్ధ-
సత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ,
జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శి-
రములు నానాసహస్రములు వెలుఁగ,
నంబర కేయూర హార కుండల కిరీ-
టాదులు పెక్కువేలమరుచుండఁ,

62.-తే.|| 
బురుషరూపంబు ధరియించి పరుఁ, డనంతుఁ,
డఖిల భువనైకవర్తన యత్నమమర
మానితోదార జలరాశి మధ్యమునను
యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు."

భావము:
“పరాత్పరుడు, అనంతుడు ఐన ఆ భగవంతుడు సమస్త భువనాలనూ సృష్టింప దలచి; మహదహంకారాలతో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే తన్మాత్రలతో కూడి షోడశకళాపరిపూర్ణుడై; పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై; శుద్ధసత్త్వస్వరూపుడై; సర్వేశ్వరుడై; వేలకొలది పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కన్నులు, శిరస్సులతో అలరారుతూ; వేలకొలది వస్ర్తాలు, భుజకీర్తులు, హారాలు, మకరకుండలాలు, మణికిరీటాలు ధరించి; పరమపురుష రూపం ధరించి; యోగనిద్రా ముద్రితుడై మహా సముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు.

అని సూతమహాముని ఆ పరంధాముని రూపరహితుడైనా, లోకం కోసం రూపాన్ని ధరించిన ఆ విశ్వనాయకుని వర్ణించారు . ఆపై ఆ నారాయణుని  ఏకవింశ్యతి అవతారాలని గురించి శౌనకుడు తదితర మునులకు ఈ విధంగా చెప్పా సాగారు. అద్భుతమైన ఆ వివరణని మనం తరువాతి భాగవత కథలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం .  

(సశేషం )

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya