Online Puja Services

అమృతభాండమే భాగవతం

52.14.88.151


 
అమృతభాండమే భాగవతం 

సేకరణ: లక్ష్మి రమణ 

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృతభాండాగారాన్ని మన తెలుగువారందరికీ పంచిచ్చారు. నిజంగా ఇది అమృతభాండమే . కృష్ణపరమాత్మ లీలని రమ్యంగా పరమానందభరితంగా వర్ణిస్తారు పోతనామాత్యులవారు . ఆ అమృతాన్ని ముందుతరాలకు పదిలంగా ఒక పద్యంతో అందించాలనే తపన ఇది . చిన్ని పద్యాలు, అనంతమైన ఆ భగవానుని లీలలతో నిండిన కథలు ఇంతకన్నా పాపహరణం , మోక్షదాయకం మరొకటి ఏముంటుంది. రండి కడవల నిండా ఆ అమృతాన్ని ఆస్వాదిద్దాం . 

 "పలికెడిది భాగవతమట నే పలికిన భవహార మగునట" అని వినయంగా , భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో వివరిస్తారు పోతన కవి  . భాగవతంలోని విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి.  వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి.  మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం.  ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, ఆస్వాదిద్దాం. అని ఆయన చేసిన ఆ పరమాత్ముని ధ్యానం చెప్పుకోదగినది . ఇక్కడ అంతర్యామి అయినా ఆ భగవానుని తత్వాన్ని ప్రథమస్కందంలోని 34వ సీసపద్యంలో పోతనామాత్యులు ఇలా వివరిస్తారు . 

సీ ||  విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని-
వలన నేర్పడు, ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై-
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె-
నెవ్వఁడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీటఁ గాచాదుల-

ఆ ||  త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు, స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ, డతనిఁ గోరి చింతించెద,
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.


అద్భుతమైన ఆ పద్యము అర్థాన్ని పరిశీలించండి . 

ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; ఎవరు  సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవరు ఈ సమస్తానికి రాజై విరాజిల్లుతుంటారో ; ఎవరు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేసాడో; ఎవరి మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవరియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో ప్రతిఫలించినట్టు అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవరు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను. 

ఈ ప్రార్థనలో మన సనాతన ధర్మమంతా ప్రతిఫలించందంటే అతిశయోక్తి కాదు . భాగవతంలో ఇటువంటి అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి .  

మహా సంపన్నమైనదీ వేదవ్యాస మహామునిచేత రచింపబడినటువంటిది  అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచలమైన  భక్తితో ఆస్వాదించాలనుకునే  భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. సజ్జనులైనటువంటివారు , ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలనుకునేవారు, సత్యమార్గాన్ని అనుసరించాలనుకునేవారు , ఎటువంటి కాంక్షా లేకుండ, భాగవతంపైన ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనే త్రివిధ తాపాలూ నశించి వారికి తత్త్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో మాత్రమే పరమార్థభూతము, పరమానంద దాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్త మవుతుంది. మరిక ఆ దివ్య గాధలనే తేనెపట్టు నుండీ స్రవిస్తున్న చిక్కని మధువును మనసారా ఆస్వాదిద్దామా !!

Quote of the day

Once you start a working on something, don't be afraid of failure and don't abandon it. People who work sincerely are the happiest.…

__________Chanakya