శ్రీ మదాంధ్రభాగవతం -- 13.
శ్రీ మదాంధ్రభాగవతం -- 13.
పరీక్షిత్తు జననము
ఇది జరిగిన పిమ్మట కృష్ణపరమాత్మ, కాలము బలవత్తరమయిన స్వరూపమును వివరించి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు. తదుపరి ’ఇంక నేను ద్వారకా నగరమునకు బయలుదేరతాను’ అని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్న సమయంలో కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడ ఆయనను స్తోత్రం చేసి బెంగపెట్టుకొని దీనవదనములతో నిలబడ్డారు. ఆ సమయంలో ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరుగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చింది. వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణపరమాత్మ పాదములమీద పడిపోయింది. అప్పటికి ఉత్తర గర్భంతో వుంది. అభిమన్యుడు మరణించాడు.
ఉత్తర కృష్ణుని చూసి – ’కృష్ణా, నాకు ఏదో తెలియడం లేదు. కానీ ఏదో దివ్యమయిన తేజస్సు ఒకటి వచ్చేసింది. ఒక ఇనుప బాణం ఏదో వచ్చేస్తోంది. చిత్రం ఏమిటి అంటే అది బయటకు కనపడడం లేదు. నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది. లోపల ఉన్న పిండము మీద పగబట్టి ఆ పిండమును చెణకేస్తున్నది. ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతోంది. నేను తల్లిని. ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపడడం లేదు. పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు. కృష్ణా, నువ్వు రక్షించు’ అని ప్రార్థించింది.
బయటకు వచ్చిన ఉపపాండవుల కోసం ద్రౌపది ఏడ్చింది. లోపల వున్న పిండము పోతున్నదని ఇప్పుడు ఉత్తర ఏడుస్తోంది.
ఉత్తర అలా అనగానే అడగని పాండవులు గబగబా ధనుస్సు పట్టుకున్నారు. ఎవరిమీద వేస్తారు? బయట ఎక్కడ ఉన్నాడు? శత్రువు ఉత్తర గర్భంలో ఉన్నాడు. పిండమును నరకడానికని బాణం వెళ్ళిపోతోంది. ఇప్పుడు కృష్ణుడు చూశాడు. ఉత్తర ఏమని ప్రార్థించింది? ‘కృష్ణా, నేను నీ చెల్లెలయిన సుభద్రకి కోడలిని. అభిమన్యుని భార్య అయిన ఉత్తరను. నా కడుపులో వున్న పిల్లవాడు నీకు మేనల్లుడు అవుతాడు’ అంది. మేనల్లుడు అంటే ఏమిటి?
‘మేనమామల ముద్దు మేలైన ముద్దు – తాతలకు తాముడ్డు తాను అబ్బాయి’
అని జానపదులు పాటలు పాడుతూంటారు. మనవలంటే తాతలకి ప్రీతి. మేనల్లుళ్ళు అంటే మేనమామలకు ప్రీతి. ‘నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు. కాని ఎవరో బాణం వేసేశాడు. అది లోపలికి వెళ్ళిపోతోంది. తామరపువ్వులవంటి నేత్రములు ఉన్నవాడా! నీవు కన్నువిప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడు. ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది . ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తోంది. బయట ఉన్నవాళ్ళకు ఏమి తెలుస్తుంది? కడుపులో వున్న పిండమును రక్షించవా కృష్ణా’ అని శరణాగతి చేసింది.
గాండీవమును ధరించిన అర్జునుడు ఉన్నాడు, చేతి గడతిప్పితే అగ్నిహోత్రమును పుట్టించే భీమసేనుడు ఉన్నాడు. నకుల సహదేవులు ఉన్నారు. అజాతశత్రువయిన ధర్మరాజు ఉన్నాడు. అయినా ఉత్తర వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు. నీ వాళ్ళు నిన్ను రక్షించరు. నీరక్షణ నీఇంటి ఈశాన్య దిక్కున ఉంది.
అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చేయకు. వాళ్ళని భగవంతునిగా చూసుకో. కానీ లోపల పూనికతో ఈశ్వరుడిని శరణాగతి చేయడం నేర్చుకో. ఆయన నీకు రక్షకుడు. అందుకని ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు. కృష్ణుడిని ప్రార్థన చేసింది.
కడుపులో ఉన్న పిండము ‘అగ్నిహోత్రము వచ్చేసింది. నన్ను ఇది కాల్చేస్తుంది, నన్ను రక్షించేవాడు ఎవరు, నేను గర్భంలో వున్నాను. నేను మొరపెడితే ఎవరికీ వినపడుతుంది’ అని ఏడుస్తోంది. ఈయన ఆ పిండమునకు ఎదురువచ్చాడు. ఉత్తర గర్భములోని పిండము సంహరింపబడాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును వేసేశాడు. అది లోపలవున్న పిండం దగ్గరకి వచ్చేసింది. అపుడు కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమందు పెరుగుతున్నటువంటి పిండము ముందు భాగమునందు అంగుష్ఠమాత్రుడై నిలబడ్డాడు. గదను త్రిప్పుతున్నాడు. చక్రహస్తుడై వైష్ణవ మాయను ప్రకటించాడు. ఉత్తరగర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు. ఆ తేజస్సు పిండమునకు తప్ప మరెవరికీ కనపడడం లేదు.
ఉత్తరకి గాని, పాండవులకి గాని, లోకమునకు గాని కనబడడం లేదు. స్వామి ఈ లీలను అమ్మకడుపులో ప్రదర్శిస్తున్నాడు. తానూ బయట అలా నిలబడి ఉన్నాడు. పాండవుల వంశం నిలబడడం కోసం తానూ పిండమునకు ఎదురువెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రమునుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకొని చాలా ఉల్లాసంగా, సంతోషంగా పిల్లాడి వంక చూస్తే, వాడు ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ‘ఎంత అందగాడురా – బొటన వ్రేలు అంత ఉన్నాడు – పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును త్రాగేసి నన్ను రక్షించాడా’ అని స్తోత్రము చెయ్యడం చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానం అయిపోయాడు. అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకివచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
అలా సూతుడు చెప్పి అన్నాడు – ‘ ఈమాట చిత్రంగా ఉందా? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా? మీకు నేను మొదటే చెప్పాను. స్వామి ఇరవై రెండు అవతారములలో ఆవిర్భవించాడు. ఇవి అన్ని శాశ్వత స్వరూపుడయిన నారాయణునిలోంచి వచ్చినవే. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన తేజస్సుని, ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్పకాదు. ఆవిధంగా తేజస్సును పుచ్చేసుకున్నాడు. ఈ పనిని పాండవులు చేయలేరు. కృష్ణుడు చేశాడు. ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానం చేసుకోవాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడయిన ఆశ్వత్థామను రథం మీదనుంచి దింపగానే వానిని చంపి వేయవలసినదని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామణి చంపివేసి ఉండి ఉంటే ‘వీనికి నేను 18అధ్యాయములు గీత చెప్పినా ధర్మం అంటే ఏమిటో అర్థం కాలేదు. కాబట్టి నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు’ అని అనుకోని ఉండేవాడు. తను చెప్పినా అర్జునుడు అశ్వత్థామని చంపలేదు. ఈ ధర్మమును కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’ – ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాడిని తాను రక్షించాలి. ఇపుడు ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. కృష్ణుడు మాత్రమే చేయగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోనవసరం లేదు. అలా అనుమానం పెట్టుకున్న వానిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు.
ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో ‘నా కడుపులో అగ్నిహోత్రం చల్లారి పోయిందయ్యా, నా పిండము రక్షింపబడింది. పాండవ వంశము రక్షింప బడింది’ అని పొంగిపోయింది.
శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు. ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరుపెట్టారు. కానీ ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అని పిలువారు పరీక్షిత్తు అని పిలుస్తారు.
పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం